ఫారం 15 సీఏ/ సీబీ  ఫైలింగ్ గ‌డువు పెంపు

 ఆగస్టు 15 వరకు అధీకృత డీలర్లకు ఫారం 15 సీఏ / 15 సీబీని నేరుగా సమర్పించవచ్చని సీబీడీటీ తెలిపింది.

Updated : 21 Jul 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ incometax.gov.inలో 15సీఏ, 15సీబీ ఫారంలను దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొటున్న‌ ఇబ్బందుల దృష్ట్యా.. ఆదాయ ప‌న్ను విభాగం ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌లో కొంత వెసులుబాటు కల్పించింది. పన్ను చెల్లింపుదారులు ఆగస్టు 15 వరకు అధీకృత డీలర్లకు ఫారం 15 సీఏ / 15 సీబీని నేరుగా సమర్పించొచ్చని సీబీడీటీ తెలిపింది.

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, ఫారం 15 సీఏ/ 15 సీబీని డిజిట‌ల్ రూపంలో అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఫారం 15 సీబీ చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్‌తో పాటు ఫారం 15 సీఏని, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అవ‌స‌రమైన చోట అప్‌లోడ్ చేస్తారు. ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్‌కు కాపీని సమర్పించే ముందు దీనిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

పోర్టల్‌లో ఆదాయపు పన్ను ఫారంలు 15 సీఏ/ 15 సీబీ ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారులు నివేదించిన ఇబ్బందుల దృష్ట్యా, పన్ను చెల్లింపుదారులు స్వ‌యంగా అధీకృత డీల‌ర్‌కు స‌మ‌ర్పించ‌వ‌చ్చ‌ని సీబీడీటీ గ‌తంలోనే తెలిపింది. అయితే ఇందుకోసం జులై 15 వ‌ర‌కు గడువు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని ఆగ‌స్టు 15 వ‌ర‌కు పొడిగించింది. ఈ మేరకు అధీకృత డీలర్లకు సీబీడీటీ సూచనలు చేసింది. జూన్‌ 7న ప్రారంభమైన కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in తొలి నుంచీ సాంకేతిక సమస్యలు ఎదురౌతున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని