Economy: ద్వితీయార్ధంలోనే ఆర్థిక వ్యవస్థ గాడిలోకి

కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడి చేయడం  కోసం విధించిన లాక్‌డౌన్ల కారణంగా జూన్‌ త్రైమాసికపు వృద్ధి రేటు 12 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్ అంచనా వేసింది....

Published : 18 Jun 2021 19:21 IST

ముంబయి: కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడి చేయడం  కోసం విధించిన లాక్‌డౌన్ల కారణంగా జూన్‌ త్రైమాసికపు వృద్ధి రేటు 12 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సైతం లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం కుదించుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆంక్షల ఎత్తివేతతో తర్వాతి రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు పుంజుకుంది. దీంతో వి-ఆకారపు పునరుత్తేజం కనిపించింది.

కానీ, ఈసారి 12 శాతం క్షీణత నుంచి వి-ఆకారపు పునరుత్తేజానికి అవకాశం లేదని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక అభిప్రాయపడింది. మహమ్మారి వ్యాప్తిపై ప్రజల్లో ఇంకా ఆందోళన నెలకొని ఉండడమే అందుకు కారణమని వెల్లడించింది. వారం ప్రాతిపదికన జూన్‌ 13తో ముగిసిన వారంలో మూడు శాతం వృద్ధి నమోదైనప్పటికీ ఈ త్రైమాసికంలో 12 శాతం క్షీణత తప్పదని అంచనా వేసింది. గత రెండు వారాల్లో అనేక రాష్ట్రాలు కఠిన ఆంక్షల నుంచి సడలింపులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. జూన్‌ నుంచి వృద్ధి రేటు పుంజుకునే అవకాశం ఉన్నప్పటికీ.. వి-ఆకారపు పునరుత్తేజం మాత్రం సాధ్యపడకపోవచ్చునని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం తర్వాతే ఆర్థిక  వ్యవస్థ గాడిలోకి వస్తుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని