కుటుంబాల పొదుపు తగ్గింది

కరోనా ప్రభావంతో కుటుంబాల ఆర్థిక పొదుపు తగ్గుతోంది. డిసెంబరు త్రైమాసికంలో పొదుపు జీడీపీలో 8.2 శాతానికి పడిపోయింది.

Published : 24 Jun 2021 01:00 IST

మూడో త్రైమాసికంలో 8.2 శాతానికి ఆర్‌బీఐ గణాంకాలు

ముంబయి: కరోనా ప్రభావంతో కుటుంబాల ఆర్థిక పొదుపు తగ్గుతోంది. డిసెంబరు త్రైమాసికంలో పొదుపు జీడీపీలో 8.2 శాతానికి పడిపోయింది. 2019-20 ఇదే త్రైమాసికంలో పొదుపు 10.4 శాతంగా ఉన్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలైన 2020-21 జూన్‌ త్రైమాసికంలో కుటుంబాల పొదుపు పుంజుకున్నా, ఆ తర్వాత వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గినట్లు వెల్లడించింది. జీడీపీలో బ్యాంకు డిపాజిట్ల నిష్పత్తి జులై- సెప్టెంబరులో 7.7 శాతం కాగా, అక్టోబరు-డిసెంబరులో 3 శాతానికి క్షీణించింది. జీడీపీలో రుణాల శాతం 2019 మార్చి నుంచి స్థిరంగా పెరుగుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2020 సెప్టెంబరుకు 37.1 శాతంగా ఉన్న రుణాల నిష్పత్తి.. 2020 డిసెంబరుకు 37.9 శాతానికి పెరిగింది. బ్యాంకులు, గృహరుణ సంస్థల రుణాలు పెరిగినప్పటికీ.. కుటుంబాలకు ఇచ్చిన రుణాలు మాత్రం తగ్గాయి. డిపాజిట్లు, జీవిత బీమా ఫండ్లు, పింఛన్‌ నిధులు, కరెన్సీ, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, చిన్న మొత్తాల పొదుపు సహా ఆర్థిక ఆస్తులు 2020 డిసెంబరు ఆఖరుకు రూ.6.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2020 సెప్టెంబరులో ఇవి రూ.7.46 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఆర్థిక రుణాలు రూ.2.54 లక్షల కోట్ల నుంచి రూ.2.48 లక్షల కోట్లకు తగ్గాయి.

సురక్ష గ్రూప్‌నకు రుణదాతల ఆమోదం
జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ దివాలా ప్రక్రియ

దిల్లీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను కొనుగోలు చేసేందుకు ముంబయికి చెందిన సురక్ష గ్రూప్‌ చేసిన ప్రతిపాదనను ఆ సంస్థ రుణదాతలు, గృహకొనుగోలుదార్లు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌బీసీసీ ఆఫర్‌ను తిరస్కరించారు. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చిన వేలమందికి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆశలు పెరిగాయి. ఎన్‌బీసీసీ, సురక్ష గ్రూప్‌ టేకోవర్‌ ప్రతిపాదనలపై 10 రోజుల పాటు సాగిన ఓటింగ్‌ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ముగిసింది. ఇందులో సురక్ష గ్రూప్‌నకు అనుకూలంగా 98.66 శాతం, ఎన్‌బీసీసీకి 98.54 శాతం చొప్పున ఓట్లు లభించాయి. 2017 ఆగస్టులో జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ దివాలా ప్రక్రియ మొదలైన తర్వాత కొనుగోలుదారు ఎవరో తేల్చేందుకు బిడ్డింగ్‌ జరగడం ఇది నాలుగోసారి. 12 బ్యాంకులకు మొత్తం 43.25 శాతం ఓటింగ్‌ హక్కులు ఉండగా.. సురక్ష గ్రూప్‌నకు 41.91 శాతం లభించాయి. సంస్థాగత రుణదాతలు ఎన్‌బీసీసీకి 41.79 శాతం ఓట్లు వేశారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ మినహా అన్ని బ్యాంక్‌లు సురక్ష గ్రూప్‌కే మొగ్గుచూపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని