మూలధన లాభం లెక్కించే విధానం

మూలధన లాభాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు

Published : 08 May 2021 10:29 IST

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేప్పుడు వచ్చిన అన్ని రకాల ఆదాయాలనూ లెక్క చూపించాల్సి ఉంటుంది. అప్పుడే చట్టబద్ధంగా పూర్తి రక్షణ ఉంటుంది. మూలధన ఆస్తులకు సంబంధించి విక్రయలావాదేవీలు నిర్వహించాల్సినప్పుడు చాలామంది పన్ను పరమైన అంశాలను పెద్దగా పట్టించుకోరు. దీంతో లేనిపోని ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే… మూలధన ఆస్తులు అంటే ఏమిటి? వాటిని అమ్మినప్పుడు వర్తించే పన్ను నిబంధనలు తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలి.
మూలధన లాభాలను రెండు రకాలుగా చెప్పుకోవచ్చు
1.దీర్ఘకాలిక మూలధన లాభం 2.స్వల్పకాలిక మూలధన లాభం

స్థిరాస్థుల విషయంలో 24 నెలలకు మించి ఆస్తి మీ పేరుపై నిర్వహించినప్పుడు దీర్ఘకాలిక ఆస్తి కింద పరిగణిస్తారు. ఇలాంటి ఆస్తులను అమ్మినప్పుడు, వచ్చిన లాభాన్నే దీర్ఘకాలిక మూలధన లాభంగా పేర్కొంటారు. 24 నెలల గడువు లోపల ఉన్న ఆస్తులను విక్రయించగా వచ్చిన లాభం స్వల్పకాలిక మూలధన లాభం.
ఇక షేర్ల విషయానికి వస్తే… 12 నెలలు లేదా ఆపైన ఉన్నవాటిని దీర్ఘకాలిక ఆస్తులంటారు. అంతకంటే తక్కువ కాలం పాటు ఉన్న వాటిని స్వల్పకాలిక ఆస్తులుగా పరిగణిస్తారు.
మూలధన ఆస్తులంటే…
అన్ని ఆస్తులనూ మూలధన ఆస్తులుగా పేర్కొనలేం. మూలధన ఆస్తులు కాని వాటిని అమ్మినప్పుడు వచ్చే లాభాలను మూలధన లాభాలుగా చూపించాల్సిన అవసరం లేదు. కింద పేర్కొన్న ఆస్తులను చట్టప్రకారం మూలధన ఆస్తులుగా పరిగణించరు.
* వృత్తి లేదా వ్యాపారం నిర్వహించేందుకు అవసరమైన ముడి సరుకులు, ఇతర వస్తువులు.
* వ్యక్తిగత ఆస్తులైన కారు, ఫర్నీచర్‌, గృహోపకరణాలు, వినియోగ వస్తువులు (బంగారు ఆభరణాలు, డ్రాయింగులు, పెయింటింగులు, ఆర్ట్‌ వర్క్‌).
* 6.5 శాతం బంగారు బాండ్లు
* 7 శాతం బంగారు బాండ్లు
* నేషనల్‌ డిఫెన్స్‌ గోల్డ్‌ బాండ్లు, 1980
* ప్రత్యేక బేరర్‌ బాండ్లు, 1991
* బంగారం డిపాజిట్‌ బాండ్లు, 1999
* పట్టణ, నిర్దేశిత (నోటిఫైడ్‌) ప్రాంతాల్లో లేని వ్యవసాయ భూమి
* పైన తెలిపిన ఆస్తులు కాకుండా, మరే ఇతర ఆస్తులైనా చట్టం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మూలధన ఆస్తులుగానే పరిగణించాల్సి ఉంటుంది.
మూలధన లాభం ఎలా వస్తుంది?
ముందుగానే చెప్పుకొన్నట్లు… కొన్ని మూలధన ఆస్తులను అమ్మగా వచ్చిన లాభాన్ని ఎలా గణించాలో పరిశీలిద్దాం.
నివాస స్థలం (ప్లాటు)
* నివాసయోగ్యమైన ఫ్లాటు/ఇల్లు
* షేర్లు, సెక్యూరిటీలు
* నిర్ణీత ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూమి


వీటిలో విక్రయ లావాదేవీలు నిర్వహించినప్పుడు మూలధన లాభం ఎలా వర్తిస్తుంది? ఎంత పన్ను చెల్లించాలి? మినహాయింపు కోసం ఏం చేయాలో పరిశీలిద్దాం!
వ్యవసాయ భూమా…?
* నిర్దేశిత ప్రాంతాల్లో లేని వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు లభించే మూలధన లాభంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు.
* పట్టణ, నిర్దేశిత ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు మాత్రం 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే… కింది సందర్భాల్లో మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
* వ్యవసాయ భూమి అమ్మకపు తేదీకి ముందు గడిచిన రెండేళ్లలో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి. విక్రయ లావాదేవీ జరిగిన తేదీ నుంచి రెండేళ్లలోపు మరో వ్యవసాయ భూమి కొనాలి.
* వాస్తవంగా పెట్టుబడి పెట్టిన విలువ మేరకే పన్ను మినహాయింపు లభిస్తుంది.
* ఏప్రిల్‌ 1, 2004 తర్వాత నోటిఫైడ్‌ జాబితాలో ఉన్న వ్యవసాయ భూమిని ప్రభుత్వం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నప్పుడు లభించే పరిహారానికి కొన్ని షరతులకు లోబడి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
* అయితే … స్వాధీనం చేసుకోబోయే భూమిలో గత రెండేళ్లుగా వ్యవసాయం నిర్వహిస్తూ ఉండాలి.
* మూలధన లాభాన్ని గణించేప్పుడు పై అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసుకోండి.
ఇంటి స్థలం అమ్మితే…
ఆస్తి కొని, కనీసం 24 నెలలపాటు కొనసాగించిన ఇంటి స్థలాన్ని అమ్మగా వచ్చిన విలువలో నుంచి, వాస్తవంగా కొన్న విలువను ప్రస్తుత ఏడాది ద్రవ్యోల్బణ సూచీతో సర్దుబాటు చేసి తీసివేయగా మిగిలే లాభాన్ని/నష్టాన్ని మూలధన లాభం/ నష్టంగా లెక్కిస్తారు.
స్థిర ఆస్తిపై మూల ధన రాబడి లెక్కించే క్యాలిక్యులేటర్
* మూలధన లాభం వస్తే… నేరుగా 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీకు లభించిన మూలధన లాభాన్ని కొన్ని షరతులకు లోబడి తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకునే వెసులుబాటును చట్టం కల్పించింది. 2 ఏళ్లలో లోపు అమ్మినట్టయితే, లాభాన్ని మీ ఆదాయానికి జత చేసి పన్ను లెక్కిస్తారు.
* మూలధన లాభాన్ని నిర్ణీత బాండ్లలో (దీర్ఘకాలానికి ఉద్దేశించిన ఎన్‌హెచ్‌ఏఐ లేదా ఆర్‌ఈసీ బాండ్లు) ఆస్తి అమ్మిన తేదీ నుంచి ఆరు నెలల లోగా మదుపు చేయాలి. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ బాండ్లలో చేసే మదుపు రూ.50లక్షలకు మించి అనుమతించరు.
* మీరు లావాదేవీని నిర్వహించిన తేదీ ఆధారంగా, రెండు ఆర్థిక సంవత్సరాల్లో పెట్టుబడులు పెట్టి, రూ.కోటి మేరకు ఉపశమనం పొందే వీలుంది.
* ఇంటి స్థలం అమ్మిన తేదీ నుంచి రెండేళ్లలోగా మరో ఇల్లు/ఫ్లాటు కొనడం లేదా మూడేళ్ల లోగా నిర్మించడం కానీ చేయవచ్చు.
* ఒకవేళ సంబంధిత లావాదేవీ జరిగిన ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేసే గడువు తేదీలోగా తిరిగి మదుపు చేయడం సాధ్యం కాలేదనుకోండి. అప్పుడు ఆస్తిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రత్యేకంగా నిర్దేశించిన కాపిటల్ గెయిన్స్ ఖాతాలో జమచేయాలి. ఈ విధంగా జమచేసిన మొత్తాన్ని అనుమతించిన వ్యవధిలోగా తిరిగి పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది.
* సెక్షన్‌ 54 ఎఫ్‌లో తెలియపర్చిన విధంగా మీరు ప్లాటు అమ్మినప్పుడు నికర విలువలో ఎంత వరకూ పెట్టుబడి పెడితే… ఆ మేరకే మినహాయింపు లభిస్తుంది.
* మరో ముఖ్య విషయం ఏమిటంటే… ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 54 ఎఫ్‌లో సూచించిన విధంగా … మీరు ప్లాటు అమ్మేనాటికి మీ పేరుమీద ఒకే ఒక ఇల్లు లేదా ఫ్లాటు మాత్రమే ఉండాలి. ఒకసారి ఇంటిపై తిరిగి పెట్టుబడి పెట్టి మినహాయింపు పొందాక మరో రెండేళ్ల వరకూ ఇల్లు కొనడంగానీ మూడేళ్ల వరకూ నిర్మించడానికి కానీ అనుమతించరు.
* ఒకసారి ఇల్లు కొనుగోలు చేసి, మినహాయింపు పొందిన తర్వాత ఆ ఆస్తిని కచ్చితంగా మూడేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది.
ఇల్లు/ఫ్లాటు విక్రయిస్తే…
సెక్షన్‌ 54 ప్రకారం ఇల్లు లేదా ఫ్లాటు అమ్మినప్పుడు వచ్చిన మూలధన లాభాన్ని తిరిగి పెట్టుబడి పెట్టడానికి ఇంటి స్థలం అమ్మితే వర్తించే అన్ని షరతులూ వర్తిస్తాయి. అయితే, ఇల్లు/ఫ్లాటు అమ్మగా వచ్చిన మూలధన లాభాన్ని మరో ఇంటిపై లేదా ఫ్లాటుపైగానీ మూలధన లాభం మేరకు మదుపు చేసి పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు.
షేర్ల విషయంలో…
* స్టాక్‌ మార్కెట్లో నమోదైన దీర్ఘకాలిక షేర్లను అమ్మి, సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) చెల్లించినప్పుడు మూలధన లాభంపై ఎలాంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల (ఈక్విటీ ఆధారిత ఫండ్ల) విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
* షేర్ కొన్న ఏడాది దాటాక అమ్మినట్టయితే లాభం మీద 10శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అయితే, మూలధన లాభం రూ. 1 లక్ష వరకు ఉన్నట్టయితే పన్ను వర్తించదు.
12 నెలల లోపు కొనసాగించిన షేర్లను స్టాక్‌ మార్కెట్లో అమ్మినప్పుడు స్వల్పకాలిక మూలధన లాభం/నష్టంగా పరిగణిస్తారు. మీరు నిర్వహించే లావాదేవీల్లో స్వల్పకాలిక లాభం వచ్చిన సందర్భాల్లో ప్రత్యేక పన్ను 15శాతం చెల్లిస్తే సరిపోతుంది.
* స్టాక్‌ మార్కెట్లో నమోదైన స్వల్పకాలిక షేర్లను మార్కెట్‌ బయట అమ్మినప్పుడు … వచ్చిన మూలధన లాభాన్ని పన్ను చెల్లింపుదారుడు తన ఇతర ఆదాయాలన్నింటితోనూ కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి.
* ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే… స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ కార్యకలాపాలు చేయాలనుకున్నప్పుడు ప్రత్యేక ఖాతాను ప్రారంభించడం ఉత్తమం. అదేవిధంగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పెట్టుబడులు చేసేందుకు విధిగా మరో ఖాతాను నిర్వహించడం మంచిది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని