Health Insurance: ఆరోగ్య బీమా పాల‌సీకి రైడర్లు చేర్చాలా? 

ఐఆర్‌డీఏఐ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ఏదైనా రైడర్ కోసం చెల్లించే ప్రీమియం, బేస్ ప్రీమియంలో 30శాతానికి మించ‌కూడ‌దు. 

Updated : 07 Sep 2021 11:25 IST


గత ఏడాదిన్నర కాలంలో అన్ని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగానే పెరిగాయి. దాదాపు 20 శాతం మేర పెరిగినట్లు ఇటీవల పాలసీబజార్.కామ్ విడుదల చేసిన డేటా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. కోవిడ్-19 నేపథ్యంలో భద్రతా చర్యలు పాటించడం తప్పనిసరి అయ్యింది. దీంతో ఆసుపత్రులలో సిరంజీలతో పాటు పీపీఈ కిట్లు, శానిటైజర్లు వాడకం కూడా పెరిగింది. వీటికయ్యే ఛార్జీలు కూడా జోడించడం వల్ల వైద్య ఖర్చులూ భారీగానే పెరిగాయి. 

ఇప్పటికే ఆరోగ్య బీమా ఉన్నప్పటీ.. పాలసీలో ఇచ్చిన గైడ్‌లైన్స్‌ ప్రకారం పీపీఈ కిట్లు వంటి వినియోగ వస్తువులకు అయ్యే ఖర్చు ప్రస్తుత పాలసీలో కవర్ కాకపోవచ్చు. అందువల్ల ఇలాంటివి పాలసీలో కవర్ అవుతున్నాయా.. లేదా.. అనేది పాలసీదారుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

రైడర్లు చేర్చాలా?
కోవిడ్-19కి ముందు వినియోగ వస్తువుల వ్యయం ఆసుపత్రి మొత్తం ఖర్చులో దాదాపు 3 నుంచి 5 శాతం వరకు ఉండేది. కానీ ప్రస్తుతం వీటి వాటా 25 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. దీంతో వైద్య ఖర్చులు ఘనణీయంగా పెరిగాయి. ఫలితంగా అప్పు  చేయక తప్పడం లేదు. కొంత మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికి ఈ ఖర్చులు పాలసీలో కవర్ కాక, పొదుపును వినియోగించాల్సి వస్తుంది. 

అయితే, ప్రస్తుతం బీమా సంస్థలు.. వినియోగ వస్తువుల ఖర్చులను కూడా కవర్ చేయగల రైడర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. పాలసీదారుడు బేస్ హెల్త్ పాలసీతో పాటు వీటికి సంబంధించిన రైడర్లను తీసుకోవచ్చు. 

కేర్ హెల్త్ ఇన్సురెన్స్, మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సురెన్స్ వంటి సంస్థలు ఈ రైడర్లను అందిస్తున్నాయి. బేస్ ప్లాన్ ప్రీమియం 5శాతం పెరుగుతుంది.  బెల్ట్స్, మాస్కులు, గ్లోవ్స్, స్పైరోమీటర్లు వంటి వినియోగ వస్తువులను కవర్ చేసేందుకు కేర్ హెల్త్ ఇన్సురెన్స్ లేదా మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సురెన్స్ అందించే పాలసీలకు రైడర్‌ను జతచేయవచ్చు.

దీంతో పాటు, యాక్సిడెంటెల్ డెత్ బెనిఫిట్ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్‌ రైడర్, మెటర్నటీ రైడర్, అవుట్ పేషెంట్(ఓపీ) రైడర్, పర్మినెంట్ డిసేబిలిటి రైడర్ వంటి యాడ్-ఆన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ప్రయోజనాలు...
బేసిక్ ప్లాన్‌తో పాటు రైడర్ తీసుకోవడం వల్ల తక్కువ ఖర్చు అవుతుంది. అదే విధంగా బేసిక్ కవరేజ్‌తో పాటు అదనపు హామీ లభిస్తుంది. దీంతో ఖర్చులపై నియంత్రణ ఉంటుంది. అయితే ఆరోగ్య బీమా పాలసీలో రైడర్లను ఎంచుకునేటప్పుడు పాలసీదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

నష్టాలు:
రైడర్ తీసుకోవడం వల్ల ప్రీమియం స్వల్పంగా పెరుగుతుంది. కవరేజ్‌కి పరిమితులు, వెయిటింగ్ పిరియడ్ ఉంటాయి. ఉదాహరణకి, చాలా వరకు బీమా సంస్థలు అందించే మెటర్నటీ బెనిఫిట్ రైడర్ కవరేజ్‌పై పరిమితులు ఉంటున్నాయి. అలాగే కొన్ని షరతులు విధిస్తున్నాయి. అందువల్ల కొనుగోలు దారుని అవసరాలకు రైడర్ అనుగుణంగా ఉన్నదీ.. లేనిదీ చూడడం అవసరం.

ప్రీమియం ఎంత?
సమగ్ర బీమా కవర్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చయినప్పటికీ చాలా వ‌ర‌కు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను డిఫాల్ట్‌గా కవర్ చేస్తుంది. మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉండొచ్చు.  అయితే బేసిక్ ఆరోగ్య బీమాను కొనుగోలు చేస్తే.. రైడర్లను తీసుకోవాల్సి వ‌స్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వారు, వారి వ్యక్తిగత అవసరాలకు తగినట్లు రైడర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. లేదంటే అనవసర రైడర్లను ఎంచుకుని పాలసీ ఖర్చును పెంచుకోవడం తప్ప లాభం ఉండదు. ఈ విషయం మీకు క్లెయిమ్ సమయంలో స్పష్టం అవుతుంది. 

బీమా చేసిన వ్యక్తి ఆసుప్రతిలో చేరితే అయ్యే జేబు ఖ‌ర్చులు ఆదా చేయడంలో బీమా రైడర్లు సహాయపడతాయి. ఉదాహరణకి, రూ.7వేల ప్రీమియం చెల్లించి రూ. 5 లక్షల హామీతో ఆరోగ్య బీమాను కొనుగోలు చేశారనుకుందాం. దీనికి హాస్పిక్యాష్ రైడర్‌ను జత చేస్తే, ఆసుపత్రిలో చేరినప్పుడు రోజుకు రూ.1000 నుంచి రూ.1500 స్థిర మొత్తం అందజేస్తారు. 30 రోజుల ఆసుపత్రి ఖర్చులను హాస్పిక్యాష్ కవర్ చేస్తుంది.

బీమా సంస్థలు కొన్ని ప్రత్యేక రైడర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. వీటికి అయ్చే ఖర్చు  కొంచెం ఎక్కువే. ఉదాహరణకి, ఓపీడీ కవర్‌కి అయ్యే ఖర్చు బేస్ ప్రీమియంలో 15శాతం వరకు ఉంటుంది. ఈ రైడ‌ర్‌ కొనుగోలుకు అయ్యే ఖర్చు కంటే వార్షిక ఓపీడీ ఖర్చు తక్కువగా ఉండే అవకాశం ఉంది.

సాధారణ ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలో రైడర్ల ఖర్చు సగటున 5 నుంచి 15 శాతం వరకు ఉంటుంది. బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. ఏదైనా రైడర్ కోసం చెల్లించే ప్రీమియం, బేస్ ప్రీమియంలో 30శాతానికి మించ‌కూడ‌దు. 

రైడర్లను ఎలా ఎంచుకోవాలి..
కోవిడ్-19 తర్వాత రైడర్లను ఎంచుకునే ముందు వస్తువుల వినియోగం, వాటి ధరలు ఎలా పెరిగాయో అర్థం చేసుకోవాలి. కోవిడ్ కేసులు పెరగినప్పుడు వినియోగ వస్తువుల ధర కూడా బాగా పెరిగింది. రాబోయే రోజుల్లో వీటి వినియోగం తగ్గితే.. ధర కూడా తగ్గే అవకాశం ఉంది. అందువల్ల నిర్థిష్ట అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైడర్‌ను తీసుకోవాలి. 

హాస్పిక్యాష్ వంటి రైడర్లు ఆసుపత్రిలో చేరినప్పుడు రూమ్ రెంట్ వంటి వాటికి ఉపయోగ పడతాయి కాబట్టి అటువంటి రైడర్లను జోడించడం ప్రయోజనకరమే. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా నిర్ధిష్ట‌ కవరేజ్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్‌ వంటి రైడర్లను తీసుకోవచ్చు. కానీ ఓపిడి వంటి రైడర్లకు అనేక పరిమితులు ఉంటాయి. కొన్ని సాధారణ ఆరోగ్య బీమాలో ఈ ఖ‌ర్చులు అంతర్గతంగా క‌వ‌ర‌వుతాయి. అందువల్ల వీటిని తీసుకునే ముందు పాలసీ కవరయ్యే అంశాలు, కవర్ కాని అంశాలు, వాటికి అయ్యే ఖర్చులు, పరిమితులు అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని