Updated : 17 Aug 2021 14:03 IST

Fractional Ownership: ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే.. ఖరీదైన ఆస్తులు కొనడం కష్టమేం కాదు!

స్థిరాస్తిలో వచ్చిన ఈ కొత్త ట్రెండ్‌తో సాధ్యమేనంటున్న నిపుణులు

ఓ విలాసవంతమైన కారు, విల్లా, ఓ కంపెనీలో భాగస్వామ్యం.. ఇవన్నీ కలగానే మిగిలిపోయే మధ్యతరగతి ప్రజల ఆశలు. కానీ, పెట్టుబడుల్లో వస్తున్న కొత్త పోకడల్ని అవలోకనం చేసుకొని.. జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేయగలిగితే.. ఒక 5-8 సంవత్సరాల్లో వీటిని సొంతం చేసుకోవడం సాధ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఉదాహరణకు ఓ బీఎండబ్ల్యూ ఎక్స్‌1 అనే కారుని తీసుకుందాం. దీని ధర దాదాపు రూ.45 లక్షల వరకు ఉంది. మన దగ్గర ఇప్పటికే రూ.25 లక్షలు ఉన్నాయనుకుందాం! ఇంకా రూ.20 లక్షలు కావాలి. ఇక్కడే మధ్యతరగతి ప్రజలు ఇరుక్కు పోతారు. కొందరు ధైర్యం చేసి లోన్‌ తీసుకుంటారు. సాధారణంగా వాహన రుణాలకు వడ్డీరేటు 7-14% మధ్య ఉంటుంది. దీంతో ఐదు సంవత్సరాల్లో వడ్డీ కింద రూ.3.76 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మరో రూ.5 వేలు ప్రాసెసింగ్‌ రుసుము కట్టాలి. కాలం గడుస్తున్న కొద్దీ విలువ తగ్గే ఓ ఆస్తిపై ఇంత ఖర్చు చేయడం ఈ కాలంలో అనవసరం అంటున్నారు నిపుణులు. దీనికి ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ అనే పెట్టుబడి మార్గం సులువైన పరిష్కారంగా సూచిస్తున్నారు.

ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ అంటే..

ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ మార్గంలో గనక మీరు పెట్టుబడి పెడితే.. మీరు కారు కొనడానికి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడిపై వచ్చే రాబడితోనే మీరు కారుని కొనేయొచ్చు. స్థిరాస్తి రంగంలో ముందే లీజుకిచ్చిన కమర్షియల్‌ ప్రాపర్టీలో ఇన్వెస్ట్‌ చేయడం ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. మంచి రాబడి కూడా వస్తోంది. ఇందులో రూ.కోట్లు విలువ చేసే ఆస్తిని చిన్న చిన్న భాగాలు(ఫ్రాక్షన్స్‌)గా విభజిస్తారు. దీంతో రిటైల్‌ మదుపర్లు ఒక్కో భాగాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీన్నే ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌గా వ్యవహరిస్తున్నారు. ముందే లీజుకిచ్చిన కారణంగా ఏటా అద్దె రూపంలో వచ్చే ఆదాయం 8-12 శాతం పెరుగుతుంది. అలాగే ఆస్తి విలువ సైతం ఏటా సగటున 5-10% పెరుగుతూ పోతుంది.

ఫ్రాక్షనల్‌ అసెట్‌ ద్వారా కారును ఎలా కొనుగోలు చేయొచ్చు..

మీ దగ్గర రూ.25 లక్షలు ఉన్నాయని ముందే అనుకున్నాం. ఆ మొత్తాన్ని ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ మార్గంలో పెట్టుబడి పెట్టండి. ముందే లీజుకిచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయడం వల్ల 9% రాబడితో ఏటా రూ.2.25 లక్షలు ఆర్జించవచ్చు. మరోవైపు ప్రతి మూడేళ్లకోసారి అద్దె సగటున 15 శాతం పెంచే అవకాశం ఉంది. అలాగే ప్రాపర్టీ విలువ సైతం ఏడాదికి 5-10 శాతం చొప్పున పెరుగుతుంది. 7శాతం చొప్పున పెరిగిందనుకున్నా.. ఐదేళ్లలో మన రూ.25 లక్షల ఆస్తి విలువ కాస్తా రూ.35.06 లక్షలకు చేరుతుంది. ఇక ముందు అనుకున్నట్లు ఏటా అద్దె రూపంలో వచ్చే ఆదాయం ఐదేళ్లలో (రూ.2.25లక్షలు x 5ఏళ్లు) రూ.11.25 లక్షలకు చేరుతుంది. వీటన్నింటినీ కలిపితే ఐదేళ్ల తర్వాత రూ.46.31 లక్షలు విలువ చేసే ఆస్తి మన చేతిలో ఉంటుంది. అంటే రూ.25 లక్షల పెట్టుబడితో ఐదేళ్లలో సుమారు రూ.20 లక్షల ఆదాయం పొందవచ్చు. దీంతో మనం అనుకున్న రూ.45 లక్షల కారును ఎలాంటి రుణం లేకుండానే సొంతం చేసుకోవచ్చు. పైగా లోన్‌ తీసుకొని ఉంటే పడే రూ.3.76 లక్షల వడ్డీ, రూ.5000 ప్రాసెసింగ్‌ రుసుము కూడా తగ్గుతుంది. అయితే, ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సి ఉంటుంది. ఇలా కారునే కాదు, ఓ విల్లాను, చిన్న కంపెనీలో భాగస్వామ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

ఫ్రాక్షనల్‌ ఓనర్‌షిప్‌ మార్గాన పెట్టుబడులు పెట్టడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముందే లీజుకిచ్చిన ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రతినెలా అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. పైగా స్థిరాస్తి రంగానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కాబట్టి అత్యవసర సమయంలో మన భాగాన్ని విక్రయించుకునే వెసులుబాటూ ఉంటుంది. మరోవైపు మిగిలిన పెట్టుబడి మార్గాలతో పోలిస్తే.. స్థిరాస్తిలో కచ్చితమైన రాబడిని పొందవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని