Updated : 05 Jul 2021 16:44 IST

Amazon CEO: బెజోస్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జెఫ్‌ బెజోస్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. అమెజాన్‌ను ఇంటింటికీ చేరువ చేసి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యాపారవేత్త. ఇంతపెద్ద వ్యాపారవేత్తగా ఎదిగే క్రమంలో అనేక ఆటుపోట్లనూ ఎదుర్కొన్నాడు. ఆన్‌లైన్‌లో పుస్తకాల విక్రయించాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టకపోయి ఉంటే ఇవాళ కేవలం ఓ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ఉండేపోయేవాడినన్న బెజోస్‌.. వ్యాపారంలో తాను అనుసరించిన సూత్రాలేంటో వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఖాళీ సమయాల్లో ఏం చేస్తాడో కూడా వివరించాడు. అమెజాన్‌ సీఈవోగా నేడు వైదొలుగుతున్న నేపథ్యంలో ఆ విషయాలు తెలుసుకుందాం.


సంస్థ ఉద్యోగులదే..

‘ఉద్యోగులు సంస్థని సొంత కంపెనీలా భావిస్తే సగం విజయం సాధించినట్టే’

అమెజాన్‌లో 6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అత్యధికులు అది తమ సొంత సంస్థలా భావిస్తుంటారు. దీనికోసం ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉండేలా చూసుకుంటాడు జెఫ్‌. వ్యక్తిగతంగా లేఖలు రాస్తాడు. తరచూ హార్దిక సమావేశాలు జరుగుతుంటాయి. బాధ్యతగా, కష్టపడి పనిచేసేవాళ్లకు అందలాలు, నజరానాలు దక్కుతాయి. ‘నా విజయం నా ఒక్కడిది కాదు. నా ఉద్యోగులందరిదీ’ అని పదేపదే చెబుతుంటాడు బెజోస్‌.

ఎదిగినా ఒదగడం

‘నెంబర్‌వన్‌ కిరీటం నా తలపై ఉండాలనే కోరిక నాకేం లేదు. ధనికుడిగా కాకుండా సంపద సృష్టించే వ్యక్తిగా, ఉపాధి కల్పించే యజమానిగా, మంచి తండ్రిగా పిలిపించుకోవడం నాకు ఇష్టం’

ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం జెఫ్‌ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌ కాబోతున్నాడు. ఈ విజయంపై మీ స్పందన ఏంటని ఓ విలేకరి అడిగినప్పుడు చెప్పిన మాటలివి. కేవలం మాటలే కాదు.. జెఫ్‌ ఆచరణ అలాగే ఉంటుంది. డబ్బు, పేరుతో వచ్చే గర్వాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోలేదు. కిందిస్థాయి ఉద్యోగుల భుజంపై చేయి వేసి మాట్లాడతాడు. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యం ఇస్తాడు.

లక్ష్యం గురిచూసి కొట్టాలి

‘మన వ్యాపారంలో పోటీదారుడికన్నా మిన్నగా ఎలా ఉండాలి అని ఆలోచించవద్దు. మన లక్ష్యం వినియోగదారుడిని ఎలా ఆకట్టుకోవాలి అన్నదానిపైనే ఉండాలి’

వ్యాపారంలో పోటీదారులు సహజం. ముందుకెళ్లడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. అమెజాన్‌ మొదలైనప్పుడు చిన్న స్టార్టప్‌నే. కానీ, అప్పటికే ఆ రంగంలో వాల్‌మార్ట్‌లాంటి దిగ్గజ సంస్థలున్నాయి. బెజోస్‌ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. వినియోగదారుడి మనసు మెచ్చే ప్రయోగాలు చేశాడు. కస్టమర్‌ మిస్‌కాల్‌ ఇస్తే తిరిగి చేయడం, ప్రోడక్ట్‌ నచ్చకపోతే ఎలాంటి ప్రశ్నలు వేయకుండా వెనక్కి తీసుకోవడం.. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో తీసుకొచ్చాడు.

నిరంతర శ్రమ

‘విజయం ఒక్కోసారి సులువు, మరోసారి కష్టం కావొచ్చు. కానీ దక్కిన విజయాన్ని నిలుపుకోవడం మరింత కష్టం’

వ్యాపారం విస్తరించడానికి, ముందుకెళ్లడానికి రెండు మార్గాలుంటాయి అంటాడు జెఫ్‌. విజయవంతంగా కొనసాగుతున్న వ్యాపారాన్ని కొనసాగించడం. మరింత అభివృద్ధి చెందడానికి ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతకడం. ఆన్‌లైన్‌లో పుస్తకాలు అమ్మడంతో మొదలైంది అమెజాన్‌. తర్వాత దాన్ని అన్ని రంగాలకు విస్తరించాడు. ఉప్పు, పప్పులతో సహా ఇప్పుడు అమెజాన్‌లో ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. ఈ సామ్రాజ్య విస్తరణ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఎక్కడెక్కడ అనుకూలం? ఎలాంటి ఉత్పత్తులు అమ్ముకోవచ్చు? అని విశ్లేషించడానికి అమెజాన్‌లో పెద్ద బృందమే నిరంతరం పని చేస్తోంది.

వ్యాపార ఆచరణ

‘ప్రపంచంలో కార్యాచరణ లేని ఆలోచనలు వ్యర్థం. కొన్నిసార్లు నిర్ణయాల్లో అంతులేని వేగం ఉండాలి. ఒక్క సెకనులోనే మంచి ఆలోచన పుట్టొచ్చు. ఆచరణ ఒక్కోసారి జీవిత కాలం పట్టొచ్చు. వెనుకడుగేయొద్దు’

ఈ ప్రపంచంలో సమర్థులు, అత్యంత తెలివైనవాళ్లకు కొదవలేదు. వాళ్ల మెదళ్లలో కోట్లకొద్దీ సరికొత్త ఆలోచనలు మెదులుతుంటాయి. కానీ, ఒక మంచి ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఈ మధ్యలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటాలి. 1994లో బెజోస్‌ ఉద్యోగం మానేసి ఆన్‌లైన్‌ బుక్‌స్టోర్‌ మొదలు పెట్టాలనుకున్నాడు. ఇది కొత్త ప్రయోగాలకు నాంది అని అంచనా వేశాడు. అప్పుడు అతడి వార్షిక వేతనం లక్షల్లోనే. కొనసాగితే రెండింతల జీతం ఇస్తానన్నాడు బాస్‌. అయినా అతడు నిర్ణయం మార్చుకోలేదు. ఒకవేళ ప్రయత్నించకుండా అలా ఆగిపోయి ఉంటే ఎప్పుడో ఒకరోజు బాధపడేవాడినని ఓ సందర్భంలో బెజోస్‌ చెప్పుకొచ్చాడు. ప్రయత్నించి ఓడిపోయినా బాధపడేవాడిని కాదని చెప్పాడు.


ఖాళీ సమయాల్లో ఇలా..

జెఫ్‌బెజోస్‌ ఎంత బిజీగా ఉంటాడో చెప్పక్కర్లేదు. అయినా కాస్త ఖాళీ దొరిందనుకున్నప్పుడు మొదట చేసే పని హాయిగా స్టార్‌ట్రెక్‌ అనే కార్యక్రమం చూడటం. ఆ తరువాత ఎప్పటికప్పుడు నాసా విడుదల చేసే రాకెట్ల నుంచి సముద్రాల్లో పడిపోయే శకలాలను సేకరిస్తుంటాడట. అదే తన హాబీ అని చెప్పే ఈ సంపన్నుడు ఆ శకలాలను వెతికేందుకు అప్పుడప్పుడూ తన పిల్లల్నీ తీసుకెళ్తుంటాడట.


₹1200 కోట్ల ఇల్లా!

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో నిర్మించిన వార్నర్‌ ఎస్టేట్‌ను ఇటీవల బెజోస్‌ కొనుగోలు చేశారు. దీని విలువ 165 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1200 కోట్లు) ఉంటుందట. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత డేవిడ్ గిఫెన్‌ నుంచి ఆయన ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ డీల్‌తో లాస్‌ ఏంజిల్స్ ప్రాంతంలో ఇదే అత్యంత ఖరీదైన ఇల్లుగా నిలిచింది. గతంలో ప్రముఖ మీడియా అధినేత లాచ్లాన్‌ ముర్దోక్ 150 మిలియన్‌ డాలర్లు వెచ్చించి ఒక ఇంటిని కొనుగోలు చేశారు. బెజోస్‌ ఆ రికార్డును అధిగమించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని