స‌రైన ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఎంచుకోండి

మీరు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేయాల‌నుకుంటున్నారా అయితే ఇవి తెలుసుకోండి. సాధార‌ణంగా కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే 1.5-2 శాతం అధిక రాబ‌డిని ఇస్తాయి. ఈ ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన‌వారు మంచి లాభాన్నే పొందారు...

Updated : 02 Jan 2021 19:46 IST

మీరు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పొదుపు చేయాల‌నుకుంటున్నారా అయితే ఇవి తెలుసుకోండి. సాధార‌ణంగా కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌తో పోలిస్తే 1.5-2 శాతం అధిక రాబ‌డిని ఇస్తాయి. ఈ ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన‌వారు మంచి లాభాన్నే పొందారు.

పిక్స్డ్ డిపాజిట్లు

కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్‌లో కూడా బ్యాంకు ఎఫ్‌డీ మాదిరిగానే డిపాజిట్ చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ స‌మయానికి వ‌డ్డీతో కూడిన రాబ‌డి వ‌స్తుంది. ఈ ఏడాదిలో కార్పొరేట్ ఎఫ్‌డీల వ‌డ్డీ రేట్లు బ్యాంకుల‌తో పోటీ ప‌డి పెరిగాయి. మంచి రేటింగ్ ఉన్న కంపెనీల ఎఫ్‌డీల‌కు, బ్యాంకు ఎఫ్‌డీల‌కు సాధార‌ణంగా 1.5 శాతం నుంచి 2 శాతం వ‌డ్డీ రేట్ల‌లో వ్య‌త్యాసం ఉంటుంది. 2018 లో ప్ర‌ముఖ బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు 7 శాతానికి పైకి చేరాయి. చిన్న సూక్ష రుణ సంస్థ‌ల పోటీతో బ్యాంకుల ఎఫ్‌డీ రేట్లు పెరుగుతున్నాయి.

అధిక రాబ‌డులు

బ్యాంకులు, కంపెనీలు డిపాజిట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. 2018, జూన్‌లో ఏఏఏ రేటింగ్ క‌లిగిన 24 నెల‌ల కాల‌ప‌రిమితి క‌లిగిన 2 కోట్ల‌కు పైగా డిపాజిట్ క‌లిగిన ఎఫ్‌డీపై వ‌డ్డీ రేటు 7.60 శాతంగా ఉంది. డిసెంబ‌ర్‌లో ఇది 8.24 శాతానికి చేరింది. అంటే ఆరు నెల‌ల్లో సుమారుగా 0.60 శాతం పెరిగాయి. 2018 లో రెండు సార్లు వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం మ‌నం చూశాం. మార్కెట్లో ద్ర‌వ్య ల‌భ్య‌త త‌గ్గ‌డం, ఈ కంపెనీలు మంచి రేట్లు ఇస్తుండ‌టంతో డిపాజిట్లు పెరుగుతున్నట్లు విశ్లేష‌కులు చెప్తున్నారు.

అయితే చిన్న రుణ సంస్థ‌లు ఏఏఏ రేటింగ్ క‌లిగిన కంపెనీల కంటే మంచి రేట్ల‌ను ఇస్తున్నాయి. మైక్రోఫైనాన్స్ సంస్థ‌లు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని వ్యాపారం చేస్తాయి. డిపాజిట‌ర్ల‌కు బ్యాంకుల‌తో పోలిస్తే 0.50-0.60 శాతం ఎక్కువ‌గా వ‌డ్డీ రేట్ల‌ను ఆఫ‌ర్ చేస్తూ ఆకర్షిస్తాయి. బ్యాంకుల కంటే సాధార‌ణంగా మైక్రో ఫైనాన్స్‌సంస్థ‌లు ఇచ్చే వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి.

నిర్ణ‌యం మీదే

మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే కేవ‌లం వ‌డ్డీ రేట్ల‌ను చూసి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు. బ్యాంకుల విష‌యానికొస్తే వ‌డ్డీ రేట్ల‌తో పాటు సౌల‌భ్య‌త కూడా చూడాలి. బ్యాంకు డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు బీమా క‌వ‌ర్ కూడా ఉంటుంది. అంటే మీ డిపాజిట్‌పై ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు ర‌క్ష‌ణ ఉంటుంద‌న్న విష‌యం గుర్తుపెట్టుకోవాలి.

కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటే కొంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌వ‌ల‌సి ఉంటుంది. ఎందుకంటే చాలా కంపెనీలు డిపాజిటర్ల‌కు డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌కుండా మోసం చేసిన కేసులు చూస్తుంటాం. మీరు కంపెనీలో డిపాజిట్ చేయాల‌నుకున్న‌ప్పుడు మొద‌ట రేటింగ్ పరిశీలించ‌డం ముఖ్యం. ఏఏఏ రేటింగ్ కలిగిన కంపెనీల‌లో ఎఫ్‌డీ చేస్తే భ‌ద్ర‌త ఉంటుంది.

అదేవిధంగా కంపెనీ ప్రాథ‌మిక విధానాలు, డిపాజిటర్ల డ‌బ్బుతో కంపెనీ చేసే వ్యాపారం ఏంటి అనేది తెలుసుకోవాలి. ప‌న్ను ఆదా చేసుకోవాల‌నుకుంటే బ్యాంకు ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోనే ఇది సాధ్యం. ఇత‌ర అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఆదాయ ప‌న్ను వ‌ర్తిస్తుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై వ‌చ్చిన వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఎఫ్‌డీలు సుర‌క్షిత‌మైన‌వే అయితే అన్ని ఎఫ్‌డీలు కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని