ఏడాదికి రూ.100తో.. జీవిత, ప్ర‌మాద బీమాతో పాటు స్కాల‌ర్‌షిప్ స‌దుపాయం 

అసంఘటిత రంగ కార్మికుల ఆర్థిక భద్రతే ల‌క్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ద్వారా ఈ ప‌థ‌కాన్ని అందిస్తోంది.

Updated : 02 Mar 2021 10:18 IST

కోవిడ్‌-19 మహమ్మారి కార‌ణంగా ఆరోగ్యంతో పాటు ప్ర‌జ‌ల ఆర్థిక జీవ‌నం కూడా దెబ్బ‌తింది. ఈ నేపథ్యంలో,  ఆరోగ్య, జీవిత బీమాల‌కు ఉన్న ప్రాధాన్య‌త మ‌రింత పెరిగింది. అదేవిధంగా పాల‌సీలు తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే పాల‌సీ కోసం అధికంగా ఖ‌ర్చు చేయ‌లేని వారి మాటేంటి?  ఇటువంటి వారి కోసం ఎల్ఐసీ అందిస్తున్న పాల‌సీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసే వారు ఏడాదికి కేవలం రూ.100 చెల్లించ‌డం ద్వారా  ప్ర‌మాద బీమా ప్ర‌యోజ‌నంతో పాటు, జీవిత కాల క‌వ‌ర్ను అందించే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన ప‌థ‌క‌మే ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌. ఈ పాల‌సీతో  మ‌రో ముఖ్య ప్ర‌యోజ‌నం కూడా ఉంది. పాల‌సీ తీసుకున్న వారి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు  స్కాల‌ర్‌షిప్ ప్ర‌యోజ‌నం కూడా ల‌భిస్తుంది. 

సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాలైన ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న‌(ఏఏబీవై), జ‌న‌శ్రీ బీమా యోజ‌న(జేబీవై) ప‌థ‌కాల‌ను విలీనం చేసి “ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న” ప‌థ‌కాన్ని భార‌త ఆర్థిక మంత్రిత్వ శాఖ 2013లో ప్రారంభించింది. 

దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న ప్ర‌జ‌లకు బీమా క‌వ‌రేజ్‌ను అందించ‌డం ఈ పాల‌సీ ముఖ్య ఉద్దేశ్యం. వీరితో పాటు కొన్ని వృత్తి ప‌నులు(బీడీ కార్మికులు, వడ్రంగి, వస్త్ర కార్మికులు, కొబ్బరికాయలు, మత్స్యకారులు, ఇతరులు) చేసుకునే వారిని కూడా ఈ ప‌థ‌కం కింద‌కి తీసుకొచ్చారు. 

ఎవ‌రు అర్హులు..
* 18 నుంచి 59 సంవత్సరాల మ‌ధ్య వ‌య‌సున్న భార‌తీయులు
* కుటుంబంలో పెద్ద‌వారు/ దారిద్ర్య రేఖకు దిగువ‌న కుటుంబంలో సంపాదిస్తున్న వ్య‌క్తి/ స్వల్పంగా దారిద్ర్య రేఖ పైన ఉండి ఎల్ఐసీ ఇండియా వారు తెలియ‌జేసిన జాబితాలోని వృత్తి చేస్తున్న‌వారు/గ్రామీణ ప్రాంతంలో భూమిలేని వారు పాల‌సీని తీసుకోవ‌చ్చు

ప్రీమియం:
ఎల్ఐసీ వారి ఆమ్ ఆద్మీ బీమా యోజన ప‌థ‌కంలోని స‌భ్యులు చెల్లించ‌వ‌ల‌సిన వార్షిక ప్రీమియం రూ.200. అయితే ఇందులో 50శాతం  ప్రీమియంపై సామాజిక భద్రత నిధి నుంచి సబ్సిడీ ల‌భిస్తుంది. మిగిలిన 50శాతం ప్రీమియంను పాల‌సీ తీసుకున్న వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాల‌సీదారు రూ.100 ప్రీమియం చెల్లిస్తే స‌రిపోతుంది.  ఇళ్లు లేని గ్రామీణ ప్రజల 50 శాతం స‌బ్సిడీ ప్రీ‌మియంను రాష్ట్ర ప్రభుత్వం, ఇతర వృత్తి సమూహాల 50శాతం స‌బ్సిడీ ప్రీమియంను నోడల్ ఏజన్సీ/ రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు చెల్లిస్తాయి. 

హామీ మొత్తం:
బీమా చేసిన‌ వ్య‌క్తి స‌హ‌జంగా గానీ, ప్ర‌మాదం కార‌ణంగా మ‌ర‌ణించినా, ప్ర‌మాదంలో పూర్తి లేదా పాక్షిక అంగ‌వైక‌ల్యం పొందినా ఈ ప‌థ‌కం కింద హామీ మొత్తం ల‌భిస్తుంది. 
1. స‌హ‌జ మ‌రణం:
పాల‌సీ కాల‌వ్య‌వ‌ధిలో పాల‌సీ దారుడు స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే, హామీ మొత్తం రూ.30వేలు నామినీకి చెల్లిస్తారు.
2. ప్ర‌మాద‌వ శాత్తు మ‌ర‌ణిస్తే: 
ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి పాల‌సీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే రూ.75 వేలు నామినీకి చెల్లిస్తారు. 
3. ప్ర‌మాదం కార‌ణంగా పూర్తి, శాశ్వ‌త అంగ‌వైక‌ల్యం క‌లిగితే:
* రెండు క‌ళ్ళూ, రెండు అవ‌య‌వాలు లేదా ఒక క‌న్ను, ఒక అవ‌య‌వం కోల్పోతే రూ.75వేలు, 
* ఒక క‌న్ను, ఒక అవ‌య‌వం కోల్పోతే రూ.37,500

ఉప‌కార వేత‌నం(స్కాల‌ర్‌షిప్)‌:
ఈ బీమా ప‌థ‌కం కింద పాల‌సీ తీసుకున్న స‌భ్యుల పిల్ల‌ల‌కు ఉప‌కార‌వేత‌నం రూపంలో ఒక అద‌న‌పు ఉచిత ప్ర‌యోజ‌నం లభిస్తుంది. 9 నుంచి 12 త‌ర‌గ‌తులు చ‌దువుతున్న పిల్ల‌ల‌(గ‌రిష్టంగా ఇద్ద‌రు)కు మాత్ర‌మే, ఒక్కొక్క‌రికి  నెల‌కు రూ.100 చొప్పున ఉప‌కార వేత‌నం అంద‌జేస్తారు. ఈ మొత్తాన్ని ఆరు నెల‌ల‌కు ఒక‌సారి ఇస్తారు.  ప్ర‌తి సంవ‌త్స‌రం జులై 1, జ‌న‌వ‌రి 1 తేదీల‌లో చెల్లిస్తారు.

ఎలా క్లెయిమ్ చేయాలి..
 మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు లబ్ధిదారులకు ఎల్ఐసీ పీ&జీఎస్‌ యూనిట్ నెఫ్ట్‌ ద్వారా చెల్లింపులు చేస్తారు. నెఫ్ట్‌ సౌకర్యం అందుబాటులో లేకపోతే ఎల్ఐసీ అధికారుల అనుమతితో నేరుగా ల‌బ్ధిదారుని బ్యాంకు ఖాతాకు గానీ, చెక్ ద్వారా గానీ, ఇత‌ర చెల్లింపు మార్గాల ద్వారా గానీ హామీ మొత్తం అంద‌జేస్తారు. 

పాలసీ అమలులో ఉన్న స‌మ‌యంలో పాల‌సీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, మ‌ర‌ణ ధృవ ప్ర‌తంతో నోడ‌ల్ ఏజెన్సీ నియ‌మించిన అధికారిని సంప్ర‌దించి హామీ మొత్తం క్లెయిమ్ చేసేందుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. నోడ‌ల్ ఏజెన్సీ అధికారి క్లెయిమ్ పేప‌ర్ల‌ను త‌నిఖీ చేసి, డెత్ స‌ర్టిఫికేట్‌తో పాటు మ‌ర‌ణించిన పాల‌సీదారుడు పాల‌సీకి తీసుకునేంద‌కు అర్హ‌డు అని తెలియ‌జేసే అంశాల‌ను ప‌రిశీలించి, ధృవీక‌రించిన ప‌త్రంతో పాటు ఎల్ఐసీ పీ&జీఎస్‌ యూనిట్ వారికి ఇస్తారు. ఒక‌వేళ పాల‌సీదారుడు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే, పైన తెలిపిన ప‌త్రాల‌తో పాటు ఎఫ్ఐఆర్ కాపి, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌, పోలీస్ ఎక్వైరీ రిపోర్ట్‌, పోలీస్ కంక్లూస‌న్ రిపోర్ట్‌/  తుది నివేదిక‌లను సంబంధిత అధికారుల‌కు ఇవ్వాలి. 

శాశ్వత పూర్తి అంగవైకల్యం ఏర్ప‌డితే:
క్లెయిమ్ చేసే వ్య‌క్తి ప్ర‌మాదం జ‌రిగ‌న‌ట్లుగా డాక్యుమెంట్ రూపంలో రుజువును, ప్ర‌మాదం కార‌ణంగా వైక‌ల్యం ఏర్ప‌డిన‌ట్లు అర్హ‌త గ‌ల ప్ర‌భుత్వ వైద్యుడు ఇచ్చిన ధృవ‌ప‌త్రాన్ని ఇవ్వాలి. 

ఉప‌కార వేత‌నం క్లెయిమ్ కోసం:
స్కాలర్‌షిప్‌కు అర్హుడైన పాల‌సీదారుని పిల్లలు ఇందుకోసం ఆరునెలలకు ఒక‌సారి నోడల్ ఏజెన్సీకి వినతి పత్రాన్ని  సమర్పించాలి. నోడల్ ఏజెన్సీ విద్యార్థులను గుర్తించి, విద్యార్థి పేరు, పాఠశాల పేరు, తరగతి, పాల‌సీదారుని పేరు, మాస్టర్ పాలసీ సంఖ్య, సభ్యత్వ సంఖ్య, ప్రత్యక్ష చెల్లింపుకోసం నెఫ్ట్‌ వివరాలు త‌దిత‌ర స‌మాచారాన్ని సేక‌రించి విద్యార్థుల జాబితా పీ&జీఎస్ యూనిటుకు సమర్పిస్తుంది. ప్రతి ఆరు నెలలకు అంటే జూలై 1, జనవరి 1, తేదిల‌లో ఎల్ఐసీ, నెఫ్ట్‌ ద్వారా అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాన్ని చెల్లిస్తుంది.

మ‌రిన్ని వివ‌రాల‌కు ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి

ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజ‌న

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు