పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ - ఎలా?

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్వి, ద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే.....

Published : 16 Dec 2020 16:09 IST

త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌నందించే దిశ‌గా అడుగులు వేయాలి

విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్వి, ద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నేరుంగనివాడు మర్త్యుడే. ఈ ప‌ద్యానికి అర్థ‌మేమిటంటే … మాన‌వుడికి విద్యయే రూపము. విద్యే రహస్యముగా దాచిన ధనం, విద్యయే సకల భోగములను, కీర్తిని, సుఖమును కలుగజేయును. విద్యయే గురువువలె అన్నింటిని బోధించును. పరదేశమునందు చుట్టము వలె సహాయము చేయును. విద్యయే రాజపూజితము. ఇలాంటి విద్య లేనివాడు మనషుడే కాదు.

విద్య సంప‌న్నుల‌ను చేయ‌గ‌ల‌దు. విద్య అజ్ఞానాన్ని చీల్చి వేస్తుంది. చ‌దువుకొన‌డం అంద‌రి స‌మాన హ‌క్కు. ఎవ‌రికైనా విద్య ప్ర‌సాదిస్తే అది ఎన‌లేని ఆస్తిగా మారుతుంది. దీనికంటూ వెల‌క‌ట్ట‌లేం. దీర్ఘ‌కాలం పాటు విద్య వ‌ల‌న ఫ‌లితాల‌ను పొందుతూనే ఉండ‌గ‌లం. స‌మాజంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పు తీసుకురావ‌డంలో విద్య తోడ్ప‌డుతుంది. నాణ్య‌మైన విద్య‌ను ప్రసాదిస్తే అది వాళ్ల‌ను సంపన్నుల‌ను చేయ‌గ‌ల‌దు. అలాగే వాళ్ల చ‌దువుల వ‌ల్ల ఇత‌రుల‌ను సంప‌ద సృష్టించేవారిగా త‌యారు చేయ‌గ‌ల‌రు. స‌మాజంలో గౌర‌వం తెచ్చిపెట్ట‌గ‌ల‌దు. సంస్థ‌లు ఆహ్వానం ప‌లుకుతాయి…నాణ్య మైన చ‌దువులు చ‌దివిన‌వారికి మ‌న దేశంలోని వివిధ రంగాల్లో అనేక కొంగొత్త అవ‌కాశాలు రార‌మ్మ‌ని ఆహ్వానిస్తున్నాయి. విదేశాల్లోనూ మంచి కొలువులు ఇస్తామని అక్క‌డి సంస్థ‌లు పిలుస్తున్నాయి. విదేశాల్లో ఉన్న అవ‌కాశాలు, అక్క‌డి నాణ్య‌త ప్ర‌మాణాలు, వారి మెథ‌డాల‌జీ, సౌక‌ర్యాలు, సౌల‌భ్యాల‌కు ఆక‌ర్షితులై మ‌న దేశ విద్యార్థులు అక్క‌డికి వెళ్లేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేస్తున్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం ఆటంకం కారాదు…త‌ల్లిదండ్రులుగా పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌నందించే దిశ‌గా… ఆర్థిక‌ప‌రంగా ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా చూసుకోవాలి. ఈ నేప‌థ్యంలో విద్యా ఖ‌ర్చుల‌పై ద్ర‌వ్యోల్బ‌ణ ప్రభావం ఉంటుంది. దీన్ని ఎలా అధిగ‌మించాలో తెలుసుకుందాం. ఇందుకు ఏం చేయ‌వ‌చ్చో చూద్దాం. ఫీజు ఒక్క‌టేనా… ఎన్నో ఉంటాయి…నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలో కేవ‌లం ఫీజునొక్క దాన్నే ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకుంటే స‌రిపోదు. చ‌దువుతో ముడిప‌డి ఉన్న‌ అవ‌స‌ర‌మ‌య్యే స్ట‌డీ మెటిరీయ‌ల్స్‌, క్యాంప‌స్ వ‌స‌తులు, గ్యాడ్జెట్లు, వాస్త‌వ శిక్ష‌ణ‌కు అయ్యే ఖ‌ర్చు, ప్రాజెక్టు ప‌నులు, సెమినార్ ఖ‌ర్చులు, హాస్ట‌ల్ వ‌స‌తి ఇత్యాదివన్నీ చూసుకోవాలి.ప్ర‌తి ద‌శ‌లోనూ ఆర్థిక తోడ్పాటు…ప్రాథ‌మిక విద్య కోసం మొద‌లుకొని చ‌దువుకు సంబంధించిన ప్ర‌తి ద‌శ‌లోనూ ఆర్థిక తోడ్పాటు అవ‌స‌ర‌మ‌వుతుంది. దీన్ని మ‌ళ్లీ స‌మీక్షిస్తుండాలి. పెట్టుబ‌డికి అనేక ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్టుబ‌డిదారు త‌మ‌కు అనుకూల‌మైన‌వాటిని ఎంచుకోగ‌ల‌గాలి. ఉప‌సంహ‌ర‌ణ‌, రాబ‌డి, కాల‌వ్య‌వ‌ధి, సుర‌క్షితం, భ‌ద్ర‌త ఇలా పలు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకున్నాకే పెట్టుబ‌డిని ఆరంభించాలి.

ఎలా ప‌నిచేస్తుందంటే…

ముర‌ళి, ర‌మ‌ణిల‌కు 4ఏళ్ల కొడుకున్నాడు. పేరు అర్జున్‌. వాడికి మంచి నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌నుకుంటున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో చ‌దువుల‌కు ఎంత ఖ‌ర్చు అవుతుందో విచారించారు. భ‌విష్య‌త్‌లో ఏ మేర‌కు పెరుగుతుందో అంచనా వేశారు. 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఫీజుల‌ను భ‌రించ‌గ‌ల‌మ‌ని వారికి న‌మ్మ‌కం. అయితే ఆ పై చ‌దువులు మాత్రం భారంగా ఉండ‌నున్నాయి. వాటిపై దృష్టి సారించాల‌నుకుంటున్నారు.

అర్జున్ ఉన్న‌త చ‌దువుల‌కు ఇంకా ప‌దేళ్ల స‌మ‌యం ఉంద‌ని గుర్తించారు. చ‌దువు కోస‌మే ప్ర‌త్యేకంగా కొంత డ‌బ్బు దాచిపెట్టాల‌నుకున్నారు. వాటిని కేవ‌లం చ‌దువుకే కేటాయించ‌ద‌ల్చుకున్నారు.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో…

ప్రారంభంలో ప్ర‌తి నెలా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబ‌డి ప్రారంభించాల‌నుకున్నారు. దీన్ని 8 ఏళ్ల పాటు కొన‌సాగించ‌నున్నారు. ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు జ‌మ అయిన సొమ్మును ఈక్విటీ నుంచి డెట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌కు త‌ర‌లించేలా ప్ర‌ణాళిక చేసుకున్నారు. మార్కెట్లో హెచ్చుత‌గ్గుల‌ను త‌ట్టుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ఉప‌సంహ‌ర‌ణ

పెట్టుబ‌డి పెట్టిన 10ఏళ్ల త‌ర్వాత నుంచి సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ద్వారా మెల్ల మెల్ల‌గా డ‌బ్బు విత్‌డ్రా చేయ‌ద‌ల్చుకున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌యానికి డ‌బ్బులు చేతికంది అర్జున్ చ‌దువుల‌కు ఏ మాత్రం ఆటంకం క‌ల‌గ‌ద‌ని భావిస్తున్నారు.

దిగువ‌నున్న ప‌ట్టిక ఉన్న‌త విద్య‌కు ఖ‌ర్చులు ఎంత అవుతాయ‌న్న‌ది అంచ‌నా వేస్తుంది. వార్షిక వృద్ధి రేటు ఏటా 10శాతంగా లెక్కింపు.

EDN-EXP-1.png

8ఏళ్ల త‌ర్వాత రూ.15 ల‌క్ష‌ల సంప‌ద జ‌మ కావాలంటే… నెల నెలా సిప్ చేయాల్సిన మొత్తాలు ఇంత ఉండాలి.

8శాతం రాబ‌డి అంచ‌నా…రూ.11,200
10శాతం రాబ‌డి అంచనా… రూ.10,250
12శాతం రాబ‌డి అంచనా… రూ.9375

ఈ రూ.15లక్ష‌లు 2ఏళ్ల‌పాటు డెట్ ఫండ్ల‌లో పెట్టి 8శాతం రాబ‌డి అంచనా వేసుకుంటే మొత్తానికి రూ.17.5ల‌క్ష‌లు జ‌మ అవుతాయి.

ఈ కింద పేర్కొన్న ప‌ట్టిక‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం ఫీజుకు చెల్లించేది ఎంత‌, జ‌మ అయిన మొత్తం, డెట్ ఫండ్ల‌లో పెట్టిన సొమ్ము, కోర్సు పూర్త‌య్యే వ‌ర‌కు మిగిలే సొమ్ము ఇలాంటి వివ‌రాలు ఉన్నాయి.

EDN-EXP-2.png

గ‌మ‌నిక‌

పైన పేర్కొన్న లెక్క‌ల‌న్నీ కేవ‌లం అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. వ్య‌క్తి ల‌క్ష్యం, నిధుల ల‌భ్య‌త‌, కాల‌వ్య‌వ‌ధి, మార్కెట్ రాబ‌డుల‌ను బ‌ట్టి పెట్టుబ‌డి సొమ్ములో మార్పులుంటాయి. దీర్ఘ‌కాల పెట్టుబ‌డిలో చ‌క్ర‌వ‌డ్డీ కీల‌క పాత్ర పోషిస్తుంది.

చివ‌ర‌గా…

ప్ర‌తి త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించాల‌ని చూస్తుంటారు. అయితే నిధుల లేమి వ‌ల్ల వారు దీన్ని నెర‌వేర్చ‌లేక‌పోవ‌చ్చు. పిల్ల‌లు చాలా చిన్న‌గా ఉన్న‌ప్పుడే స‌రైన ప్ర‌ణాళిక వేసుకోవాలి. ఏమైనా త‌క్కువ ప‌డితే విద్యారుణం పొందేందుకు ప్ర‌య‌త్నించాలి. ఉన్న‌త విద్య కోసం స‌రిపోను ఆర్థిక వ‌న‌రుల‌ను కూడ‌బెట్ట‌డం క‌ష్ట‌మైన ప‌నే, అయితే అసాధ్య‌మేమీ కాద‌న్న విష‌యాన్ని రుజువు చేస్తార‌ని ఆశిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని