Mukesh Ambani: 100 బి.డాలర్ల ప్రత్యేక క్లబ్‌లోకి అంబానీ!

భారత్‌లో అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో వరుసగా 14వ ఏడాది తొలి స్థానంలో నిలిచిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు...

Published : 09 Oct 2021 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో వరుసగా 14వ ఏడాది తొలి స్థానంలో నిలిచిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌ సహా అతికొద్ది మందితో కూడిన 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరారు. శుక్రవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) షేర్ల విలువ రికార్డు స్థాయికి చేరడంతో ముకేశ్‌ అంబానీ సంపద విలువ 100 బి.డాలర్లు దాటింది. ఈ ఏడాది ఆయన సంపద 23.8 బి.డాలర్ల మేర పెరగడం విశేషం. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ 101 బి.డాలర్లుగా ఉంది.

మరోవైపు హరిత ఇంధన రంగంలోకీ ప్రవేశించనున్నట్లు అంబానీ గత జూన్‌లో ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో దాదాపు 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2030 కల్లా పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. ఒక దశాబ్ద కాలంలో 1 కిలో హైడ్రోజన్‌ వ్యయాన్ని 1 డాలరు లోపునకు తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అలాగే ప్రస్తుతం రిలయన్స్‌ గ్రూప్ ఆదాయంలో సింహభాగమైన ఇంధన వ్యాపారంపైనా ముకేశ్‌ పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం ఆరామ్‌కోతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. దాదాపు 73 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం కలిగిన రిలయన్స్‌లో.. ఇప్పటికీ 60 శాతం వాటా చమురు ఆధారిత ఇంధన వనరులదే. ఈ నేపథ్యంలోనే ఆరామ్‌కోతో ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.

ఈ పరిణామాలన్నింటినీ.. అవకాశంగా భావిస్తున్న మదుపర్లు రిలయన్స్‌ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముకేశ్‌ అంబానీ తాజా ప్రకటనన్నీ శిలాజ ఇంధన శకం అనంతరం కూడా రిలయన్స్‌ విజయవంతమైన మనుగడకు హామీలని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి!

బ్లూమ్‌బెర్గ్‌ బిలయనీర్స్ జాబితా ప్రకారం.. 100 బి.డా క్లబ్‌లో ఉన్నది వీరే..

ఎలాన్‌ మస్క్‌         222 బి.డా

జెఫ్‌ బెజోస్‌           191 బి.డా

బెర్నార్డ్‌ అర్నాల్ట్‌       156 బి.డా

బిల్‌ గేట్స్‌            128 బి.డా

లారీ పేజ్‌            125 బి.డా

మార్క్‌ జుకర్‌బర్గ్‌      123 బి.డా

సెర్గీ బ్రిన్‌             120 బి.డా

లారీ ఎలిసన్‌         108 బి.డా

స్టీవ్‌ బామర్‌          106 బి.డా

వారెన్‌ బఫెట్‌         103 బి.డా

ముకేశ్‌ అంబానీ       101 బి.డా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని