Digital spends: ఇప్పటికైతే ఫర్వాలేదు.. ఆంక్షలు కఠినమైతే అంతే సంగతులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి....

Updated : 08 Jan 2022 12:38 IST

డిజిటల్‌ వ్యయాలపై పరిశ్రమ వర్గాలు

ముంబయి: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, డిజిటల్‌ వ్యయాలపై మాత్రం ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం లేదని ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. జనవరి తొలి ఐదురోజుల్లో వస్తు, సేవల కొనుగోళ్లపై చేసే వ్యయాలు.. గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే స్వల్పంగానే తగ్గడం గమనార్హం.

జనవరి 1-5వ తేదీల మధ్య ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ మాధ్యమాల ద్వారా చేసిన వ్యయాలు రూ.23.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. డిసెంబరు 2021 తొలి ఐదు రోజుల్లో ఇవి రూ.23.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇప్పటి వరకైతే కొవిడ్‌ విజృంభణ ప్రజల వినియోగంపై పెద్దగా ప్రభావం చూపలేదని పరిశ్రమల వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు ఆంక్షల్ని మరింత కఠినతరం చేస్తే ఇబ్బందులు తప్పవని తెలిపాయి.

గత రెండు దశలతో పోలిస్తే.. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య పెరగడం తాజా విజృంభణలో కలిసొస్తుందని పరిశ్రమలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజల వ్యయాలపై పెద్దగా ప్రభావం లేదని తెలిపారు. అయితే, ఇకపై పరిస్థితులు ఎలా ఉండనున్నాయన్నది నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెలివరీ సర్వీసులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని తెలిపారు.  టైర్‌-2, టైర్‌-3 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రజల వ్యయాలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. 

వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులకు యూపీఐ మాధ్యమాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారని మరోసారి తేలింది. జనవరి తొలి వారంలో రూ.1.5 లక్షల కోట్లు విలువ చేసే లావాదేవీలు జరగడం విశేషం. గత రెండేళ్ల అనుభవం దృష్ట్యా చాలా మంది డిజిటల్‌ చెల్లింపులకు అలవాటు పడ్డారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే డిజిటల్‌ లావాదేవీల్లో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని