Jio-BSNL: ఆ రంగంలోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టిన జియో

ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో 20 ఏళ్లుగా అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన సంస్థగా ఇప్పటి వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొనసాగింది. తాజా ఆ స్థానాన్ని రిలయన్స్‌ జియో ఆక్రమించేసింది....

Updated : 20 Jan 2022 17:40 IST

దిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పేరిట ఉన్న ఓ రికార్డు ఇప్పుడు జియో సొంతమైంది. ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో 20 ఏళ్లుగా అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన సంస్థగా ఇప్పటి వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొనసాగింది. తాజాగా ఆ స్థానంలోకి రిలయన్స్‌ జియో (Reliance Jio) వచ్చేసింది. రెండేళ్లలోనే జియో ఈ స్థానానికి చేరడం గమనార్హం. 

టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్‌ విడుదల చేసే నెలవారీ గణాంకాల ప్రకారం.. ఫిక్స్‌డ్‌ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ (Fixed Line Broadband) సెగ్మెంట్లో గత నవంబరు నాటికి జియోకు 4.34 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక అక్టోబరులో 4.72 మిలియన్లుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య నవంబరు నాటికి 4.2 మిలియన్లకు తగ్గింది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌కు 4.08 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 

సెప్టెంబరు 2019లో జియో ఫిక్స్‌డ్‌లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్ని ప్రారంభించింది. అప్పటికి బీఎస్‌ఎన్‌ఎల్‌కు 8.69 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉండేవారు. నవంబరు 2021 నాటికి ఆ సంఖ్య సగానికిపైగా తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.41 మిలియన్ల నుంచి 4.08 మిలియన్లకు పెరగడం విశేషం. త్వరలో ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌ను అధిగమించే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా.

దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య నవంబరు నాటికి 801.6 మిలియన్లకు చేరింది. ఈ రంగంలోనూ జియోదే పైచేయి. ఈ రంగంలోని తొలి ఐదు సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీలు 98.68 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయని ట్రాయ్‌ వెల్లడించింది. 432.96 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో జియో టాప్‌లో ఉండగా.. భారతీ ఎయిర్‌టెల్‌ 210.10 మిలియన్లు, వొడాఫోన్‌ ఐడియా 122.40 మిలియన్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 23.62 మిలియన్లు, అట్రియా కన్వర్జెన్స్‌ 1.98 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని