Satya Nadella: భారత స్టార్టప్‌లో సత్య నాదెళ్ల పెట్టుబడులు..ఏ కంపెనీయో తెలుసా?

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల భారత్‌కు చెందిన ఓ ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. దానికి ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించనున్నారు...

Published : 08 Jan 2022 18:51 IST

బెంగళూరు : మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులకు వేదికైన ఫిన్‌టెక్‌ సంస్థ ‘గ్రో’లో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ సంస్థకు ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని గ్రో సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ లలిత్‌ కెశ్రే శనివారం వెల్లడించారు. ‘‘ప్రపంచంలో అత్యుత్తమ సీఈఓల్లో ఒకరు గ్రోకు ఇన్వెస్టర్‌గా‌, అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌లో ఆర్థిక సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మా ఆశయంలో సత్య నాదెళ్ల కూడా చేరడం సంతోషంగా ఉంది’’ అని లలిత్‌ ట్వీట్‌ చేశారు.

2021లోనూ గ్రో రెండు దఫాల్లో నిధులు సమీకరించింది. ఏప్రిల్‌లో 83 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రావడంతో సంస్థ విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరింది. అక్టోబరులో మరో 251 మిలియన్‌ డాలర్లు సమీకరించడంతో కంపెనీ విలువ ఏకంగా 3 బిలియన్‌ డాలర్లకు చేరింది. తాజాగా సత్య నాదెళ్ల నిధులు కూడా చేరడంతో ఆ విలువ మరింత ఎగబాకింది.

కరోనా కట్టడి నిమిత్తం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మ్యూచువల్‌ ఫండ్లు (ఎంఎఫ్‌), స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు ఆదరణ పెరిగింది. ఉద్యోగాలు కోల్పోవడం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మదుపు చేసి ఆర్జించాలన్న స్పృహ ప్రజల్లో ఎక్కువైంది. ఈ క్రమంలో కొంత మంది ఎంఎఫ్‌లలో మదుపు చేయగా.. మరికొంత మంది స్టాక్‌ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దీనికి ఐపీఓల హవా కూడా తోడైంది. దీంతో గ్రో వంటి ప్లాట్‌ఫాంలకు మంచి ఆదరణ లభించింది. దీన్ని గమనించి రిబిట్‌ క్యాపిటల్‌, సెఖోయా వై కాంబినేటర్‌, టైగర్‌ గ్లోబల్‌, ప్రొపెల్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌, ఐకానిక్‌ గ్రోత్‌ వంటి పెట్టుబడి సంస్థలు గ్రోలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో సత్య నాదెళ్ల కూడా చేరారు.

గతంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన లలిత్‌ కెశ్రే, హర్ష్‌ జైన్‌,  నీరజ్‌ సింగ్‌, ఇషాన్‌ బన్సల్‌ 2016లో గ్రోని స్థాపించారు. స్టాక్స్‌, ఎంఎఫ్‌, ఈటీఎఫ్‌, ఐపీఓ, యూఎస్‌ స్టాక్స్‌, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌, బంగారంలో మదుపు చేసేందుకు దీన్ని వేదికగా మార్చారు. ప్రస్తుతం దీనికి 20 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని