సెబీ నిబంధనలతో తీవ్ర విఘాతం: కేంద్రం

శాశ్వత బాండ్లుగా భావించే ఏటీ1 లేదా పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం కాలపరమితిని 100 ఏళ్లుగా పరిగణించాలన్న సెబీ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిపై మ్యూచుఫల్‌ ఫండ్ల(ఎంఎఫ్‌) సంస్థలు తీవ్ర అభ్యంతర........

Published : 12 Mar 2021 21:49 IST

వివాదాస్పదమైన ఏటీ1 బాండ్ల వాల్యుయేషన్‌ కొత్త నిబంధనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాశ్వత బాండ్లుగా భావించే ఏటీ1 లేదా పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం కాలపరిమితిని 100 ఏళ్లుగా పరిగణించాలన్న సెబీ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిపై మ్యూచుఫల్‌ ఫండ్ల(ఎంఎఫ్‌) సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది. పర్పెచ్యువల్‌ బాండ్ల వాల్యుయేషన్‌ కోసం ఇటీవల జారీ చేసిన 100 ఏళ్ల నియమాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. ఈ మేరకు సెబీ ఛైర్మన్‌ అజయ్‌ త్యాగికి కేంద్ర ఆర్థిక శాఖ మెమో జారీ చేసింది. ‘వాల్యుయేషన్‌ కోసం చేర్చిన ఆ నియమం తీవ్ర విఘాతం కలిగించేలా ఉంది’ అంటూ లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఏటీ1 బాండ్ల వాల్యుయేషన్‌కు సంబంధించిన కొత్త నిబంధనల్ని సెబీ మార్చి 10న విడుదల చేసింది. ఇవి ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. 100 ఏళ్ల నిబంధనపై ఎంఎఫ్‌ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పర్పెచ్యువల్‌ బాండ్ల రీవాల్యుయేషన్‌ వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతుందని తెలిపాయి. ఈ మేరకు ‘భారత మ్యూచువల్‌ ఫండ్ల సమాఖ్య(ఏఎంఎఫ్‌ఐ)’ సెబీని సంప్రదించింది. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి నిబంధనలు సామరస్యపూర్వకంగా అమలయ్యేలా చూడాలని కోరింది.

కొత్త వాల్యుయేషన్‌ నిబంధనల వల్ల ఎంఎఫ్‌ల ‘నెట్‌ అసెట్‌ వాల్యూ’లో తీవ్ర ఒడుదొడుకులు చోటుచేసుకుంటాయని ఆర్థిక శాఖ లేఖలో వివరించింది. దీంతో రిడెమ్షన్‌ భయాలు పెరిగి ఎంఎఫ్‌ సంస్థలు పర్పెచ్యువల్‌ బాండ్లను విక్రయించడం మొదలుపెడతాయని పేర్కొంది. ఇది తిరిగి బ్యాంకులు మూలధనం సమకూర్చుకోవడంపై ప్రభావం చూపిస్తుందని తెలిపింది. దీంతో బ్యాంకులు మూలధనం కోసం పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడడానికి దారితీస్తుందని వివరించింది. ఇది చివరకు బ్యాంకుల ఈక్విటీ షేర్ల అమ్మకాలకు దారితీసి చివరకు బాండ్ల విలువ మరింత దిగజారే పరిస్థితి తలెత్తొచ్చని తెలిపింది.

ఇవీ చదవండి...

‘అమెజాన్‌ పే’ బలోపేతానికి రూ.225 కోట్లు

షేర్లలో మదుపు...పన్ను నిబంధనలు తెలుసుకోండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని