Stock Market: సూచీలను ముంచుతున్న కొత్త వేరియంట్‌  

గత ఏడాది కాలంగా లాభాల ర్యాలీలో మునిగి తేలిన సూచీలు ఇప్పుడు నష్టాల ధాటికి విలవిల్లాడుతున్నాయి. అధిక విలువల వద్ద గత కొంతకాలంగా లాభాల స్వీకరణ ఇప్పటి వరకు సూచీల పరుగుకు అడ్డుకట్ట వేయగా..

Updated : 26 Nov 2021 13:46 IST

ముంబయి: గత ఏడాది కాలంగా లాభాల ర్యాలీలో మునిగి తేలిన సూచీలు ఇప్పుడు నష్టాల ధాటికి విలవిల్లాడుతున్నాయి. అధిక విలువల వద్ద గత కొంతకాలంగా లాభాల స్వీకరణ ఇప్పటి వరకు సూచీల పరుగుకు అడ్డుకట్ట వేయగా.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు దానికి ఆజ్యం పోశాయి. దీంతో బుల్‌పై పట్టు సాధించేందుకు బేర్‌ ప్రయత్నాలు ప్రారంభించినట్లైంది. దీనికి ఐరోపా, అమెరికాలో కరోనా కేసులు.. తాజాగా దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ మరింత బలాన్నిచ్చింది. దీంతో సూచీలు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. ఇదే కారణంతో నేడు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం సెన్సెక్స్‌ ఓ దశలో 1,400 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ కీలక మద్దతు అయిన 17,100 వద్ద ఊగిసలాడుతోంది. ఉదయం 1:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ ఇప్పటి వరకు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకొని 1,233 పాయింట్ల నష్టంతో 57,561 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 374 పాయింట్ల నష్టంతో 17,162 వద్ద కొనసాగుతోంది.

* రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, స్టేట్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. 

* ఆసియా సూచీలు రెండు నెలల కనిష్ఠానికి దిగజారాయి. చాలా మంది మదుపర్లు సురక్షితమైన బాండ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 

* జపాన్‌ నిక్కీ సూచీ 2.5 శాతం దిగజారింది. అమెరికా ముడి చమురు ఫ్యూచర్స్‌ రెండు శాతం కుంగాయి. 

* ఒక్క హెల్త్‌కేర్‌ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. స్థిరాస్తి, లోహ, ఆటో, ఇన్‌ఫ్రా, ఆయిల్‌అండ్‌గ్యాస్‌, పీఎస్‌యూ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ నష్టాల్ని చవిచూస్తున్నాయి. 

* మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ 2.72 శాతం కుంగగా.. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 2 శాతం దిగజారింది. 

* బీఎస్‌ఈలో 2,192 షేర్లు నష్టాల్లో ట్రేడవుతుండగా.. 896 షేర్లు మాత్రమే లాభాల్లో పయనిస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని