Stock market : లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి....

Updated : 10 Jan 2022 09:52 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market) సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి బలమైన సంకేతాలు లేనప్పటికీ.. దేశీయ సానుకూలతలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ బలహీనంగా ఉండడంతో మదుపర్లు స్టాక్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌లు ఈ వారమే ఫలితాలను ప్రకటించనున్నందున మదుపర్ల చూపు వాటిపైనే ఉండొచ్చు. ఈ కంపెనీలు బలమైన గణాంకాలతో పాటు సానుకూల అంచనాలను ప్రకటిస్తాయని భావిస్తున్నారు. మూడో త్రైమాసిక ఫలితాలు బలంగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలతో పాటు బడ్జెట్‌పై ఆశలు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి.

ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 361 పాయింట్ల లాభంతో 60,105 వద్ద.. నిఫ్టీ (Nifty) 100 పాయింట్లు లాభపడి 17,912 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.14 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 సూచీలో యూపీఎల్‌, ఐటీసీ, టీసీఎస్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, హిందాల్కో, శ్రీరాం సిమెంట్స్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌ హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తుండడం విశేషం.

నేడు వార్తల్లో ఉండే అవకాశం ఉన్న స్టాక్‌లు...

* రిలయన్స్‌ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన పూర్తి స్థాయి అనుబంధ కంపెనీ ద్వారా అమెరికా (న్యూయార్క్‌)లోని అత్యంత విలాసవంతమైన ఒక హోటల్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. ‘మాండరిన్‌ ఓరియంటల్‌ న్యూయార్క్‌’ హోటల్‌లో 73.37 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌(ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) సంతకాలు చేసినట్లు శనివారం వెల్లడించింది.

* టీసీఎస్‌: షేర్లను తిరిగి కొనుగోలు చేసే (బైబ్యాక్‌) ప్రతిపాదనను 12న జరిగే సమావేశంలో డైరెక్టర్ల బోర్డు పరిశీలిస్తుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తెలిపింది.

* టాటా స్టీల్‌ : భారత ముడి ఉక్కు ఉత్పత్తి త్రైమాసిక ప్రాతిపదికన 1.5 శాతం పెరిగింది. మొత్తంగా డెలివరీలు 4 శాతం తగ్గినప్పటికీ.. దేశీయ డెలివరీలు మాత్రం 34 శాతం పెరిగాయి.

* కేఈసీ ఇంటర్నేషనల్‌ : రైల్వేస్‌, సివిల్‌, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ పైప్‌లైన్‌, స్మార్ట్‌ ఇన్‌ఫ్రా అండ్‌ కేబుల్స్ రంగాల నుంచి కంపెనీకి రూ.1,025 కోట్ల ఆర్డర్‌ లభించింది.

* ఇన్ఫో ఎడ్జ్‌ : కంపెనీ ఒక్కో షేరుకు రూ.8 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. 

* ఫెడరల్‌ బ్యాంక్‌ ‌: అన్‌సెక్యూర్డ్‌ బేస్‌ సబార్డినేట్‌ బాండ్స్‌ ద్వారా రూ.700 కోట్ల నిధులు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని