రోజుకు రూపాయితో భద్రం

రోజుకు రూపాయి కడితేనే ఏడాదికి రూ. 2లక్షల జీవితబీమా వస్తుందని మీకు తెలుసా?

Published : 01 Jan 2022 09:41 IST

ఈ రోజు ఎంత ముఖ్యమో రేపన్నది అంతకంటే ముఖ్యం. భవిష్యత్తుకు భరోసా ఉంటేనే ప్రశాంతంగా నిద్రపోగలం. సరైన బీమా పాలసీలు తీసుకోవడం, వాటికి నామినీలను పక్కాగా ఏర్పాటుచేయడం, ఆ విషయాలు వారికి తెలియజెప్పడం.. ఇవన్నీ ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యబీమా సైతం అత్యవసరమే.  మరి మీరేం చేస్తున్నారు? రోజుకు రూపాయి కడితేనే ఏడాదికి రూ. 2లక్షల జీవితబీమా వస్తుందని మీకు తెలుసా? నెలకు రూపాయి కడితే ఏడాదికి రూ.2లక్షల ప్రమాద బీమా ఉందన్న విషయం విన్నారా? భవిష్యత్తును భద్రంగా ఉంచుకోవాలంటే ఇవన్నీ తప్పనిసరి మరి!!


వార్షికాదాయానికి 15 రెట్లు

కరోనా తర్వాత అందరికీ బీమా ప్రాధాన్యం బాగా అర్థమయ్యింది. ప్రతి ఒక్కరూ కచ్చితంగా జీవిత, ఆరోగ్య బీమాలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. బీమా పాలసీలను పెట్టుబడి దృష్టితో చూడకుండా.. రక్షణ అవసరాలకే పరిమితం చేయండి. వార్షికాదాయానికి 15 రెట్ల వరకూ విలువైన టర్మ్‌ పాలసీని తీసుకోండి.  


ఆరోగ్యానికీ అండ ఉండాల్సిందే

కొవిడ్‌-19 తొలిదశలో ఆరోగ్య బీమా పాలసీలు లేక చేతిలో ఉన్న డబ్బు, పొదుపు, పెట్టుబడులనూ చికిత్స కోసం ఖర్చుచేశారు. అందుకే కుటుంబమంతటికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్యబీమా రూ.5-10 లక్షల వరకు తీసుకోవాలి. వ్యక్తిగత ప్రమాద బీమా, వైకల్యం, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలూ అవసరమే. బీమా వివరాలను కుటుంబ సభ్యులందరికీ తప్పక చెప్పాలి.


ఆ తర్వాత ఏం చేద్దాం?

పింఛను అవకాశం లేని చాలామందికి పదవీ విరమణ తర్వాత ఏం చేయాలో స్పష్టత ఉండదు. పదేళ్ల ముందునుంచి ఏడాదికి ఇంత మొత్తమని మదుపుచేస్తే.. తర్వాత ఏటా నిర్దిష్టమొత్తం చేతికి అందుతుంది.


అత్యవసర నిధి ఉందా?

అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఏం చేయాలో పాలుపోదు. చేబదుళ్లు, క్రెడిట్‌ కార్డులు, బంగారం తాకట్టు ఉన్నా... అన్నిసార్లూ ఇదే పనికిరాదు. సొంతనిధికి ప్రయత్నించాలి. 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.

-సాయికృష్ణ పత్రి, వ్యక్తిగత ఆర్థిక నిపుణులు


* పీఎంఎస్‌బీవై కింద 18-70 ఏళ్లవారు ఏడాదికి రూ.12 కట్టి.. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం కలిగినా ఆ కుటుంబానికి రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. లక్ష ఇస్తారు.


* పీఎంజేజేబీవై కింద 18-50 ఏళ్ల మధ్యవారు ఏడాదికి రూ.332 కడితే సహజ మరణానికి రూ.2 లక్షల జీవితబీమా లభిస్తుంది.


ప్రారంభించడానికి సరైన పరిస్థితులు వచ్చేవరకూ వేచిచూడకండి. ప్రారంభించడమే పరిస్థితులను సరిచేస్తుంది.

- అలన్‌ కోహెన్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని