Hyundai EVs: రూ.4వేల కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్‌ భారీ ప్రణాళిక!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ భారత్‌లో మరిన్ని విద్యుత్తు వాహనాలను ప్రవేశపెట్టనుంది....

Updated : 08 Dec 2021 17:13 IST

2028 నాటికి ఆరు ఈవీ మోడళ్లు

దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ భారత్‌లో మరిన్ని విద్యుత్తు వాహనాలను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం రాబోయే ఏడేళ్లలో రూ.4000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఆరు మోడల్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

విద్యుత్తు వాహనాల కోసం హ్యుందాయ్‌ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఈ-గ్లోబల్‌ మాడ్యులార్‌ ప్లాట్‌ఫామ్‌(ఈ-జీఎంపీ)’ ఆధారంగానే వీటిని రూపొందించనునట్లు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌.ఎస్‌.కిమ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని మోడళ్లతో పాటు కొత్త వాటిని కూడా తయారు చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది తొలి కారును విడుదల చేసేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. 2028 నాటికి అన్ని మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. ఈ-జీఎంపీతో పాటు అవసరమైతే భారత్‌ కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తామన్నారు. ఆరు కొత్త విద్యుత్తు వాహనాల్లో అన్ని సెగ్మెంట్లకు చెందినవి ఉంటాయని తెలిపారు.

ఈ-జీఎంపీ ప్లాట్‌ఫామ్‌ 77.4 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించారు. అలాగే గరిష్ఠంగా గంటకు 260 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. హ్యుందాయ్‌ భారత్‌లో ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్‌ పేరిట విద్యుత్తు వాహనాన్ని విక్రయిస్తోంది. కొత్త విద్యుత్తు వాహనాలన్నింటి తయారీని దేశీయంగానే చేపడతామని కిమ్‌ తెలిపారు. చెన్నైలో ఉన్న తయారీ కేంద్రం నుంచే వీటి ఉత్పత్తి జరగనుందని పేర్కొన్నారు. తొలిదశలో బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. అందుకోసం చైనా, దక్షిణ కొరియా కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. కొన్నేళ్లలో బ్యాటరీలను కూడా దేశీయంగా తయారు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని