Tax Loss Harvesting: పన్ను భారం తగ్గించుకోవాలా? ఇదొక చక్కని మార్గం!

పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఉన్న మార్గాల్లో ‘ట్యాక్స్‌ లాస్‌ హార్వెస్టింగ్‌’ అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు....

Updated : 25 Apr 2022 11:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోర్ట్‌ఫోలియోలో ఉన్న షేర్లు (Shares) లేదా మ్యూచువల్‌ ఫండ్ల (Mutual Funds)ను విక్రయించడం ద్వారా వచ్చే లాభాన్ని మూలధన లాభం (Capital Gains) కింద పరిగణిస్తారు. ఒక్కోసారి నష్టం కూడా రావొచ్చు. అయితే, ఈ నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఓ మార్గం ఉంది. పన్ను రిటర్నుల దాఖలు (ITR)లో ఈ నష్టాల్ని చూపించడం ద్వారా కొంత వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీన్నే ‘ట్యాక్స్‌ లాస్‌ హార్వెస్టింగ్‌’ (Tax Loss Harvesting) అని వ్యవహరిస్తారు.

పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఉన్న మార్గాల్లో ‘ట్యాక్స్‌ లాస్‌ హార్వెస్టింగ్‌’ (Tax Loss Harvesting) అత్యంత ప్రభావవంతమైన మార్గమని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మనం పెట్టిన పెట్టుబడి నుంచి ఏడాదిలోపు లాభాన్ని స్వీకరిస్తే దాన్ని స్వల్పకాల మూలధన లాభం (STCG) అంటారు. దీనిపై 15 శాతం పన్ను వర్తిస్తుంది. ఏడాది తర్వాత లాభాల్ని బుక్‌ చేసుకుంటే దాన్ని దీర్ఘకాల మూలధన లాభం (LTCG) కింద పరిగణిస్తారు. దీనిపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మూలధన నష్టాలను.. మూలధన లాభాల ద్వారా పూడ్చుకునేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. ఉదాహరణకు మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మూలధన లాభాన్ని పొందారనుకుందాం. అదే సమయంలో మరికొన్ని స్టాక్‌లు లేదా మ్యూచువల్‌ ఫండ్ల వల్ల రూ.10,000 నష్టం వాటిల్లింది. అప్పుడు మీరు మీ లాభాల నుంచి నష్టాలను తీసేస్తే వచ్చే మొత్తానికి మాత్రమే పన్ను చెల్లించాలి. పై ఉదాహరణ ప్రకారం రూ.40,000లకు మాత్రమే పన్ను కట్టాలి.

ట్యాక్స్‌ లాస్‌ హార్వెస్టింగ్‌ ప్రకారం.. మీ పోర్ట్‌ఫోలియో నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్లు అసలు తిరిగి కోలుకొనే అవకాశమే లేదనుకునే వాటిని విక్రయించాలి. నష్టం వచ్చినా.. పన్ను రిటర్నుల్లో చూపించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. విక్రయించడానికి ఏడాది చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు.

ఎలా పనిచేస్తుందో చూద్దాం..

ట్యాక్స్‌ లాస్‌ హార్వెస్టింగ్‌ ఎలా పనిచేస్తుందో ఓ ఉదాహరణ ద్వారా చూద్దాం.

రమేశ్‌ అనే వ్యక్తి తన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డెట్‌ ఫండ్లు ఉంచుకున్నారు. ఆర్థిక సంవత్సరం చివరికి ఆయన లాభనష్టాలు ఇలా ఉన్నాయి.

* స్వల్పకాల మూలధన లాభం (STCG)  = రూ.80,000

* దీర్ఘకాల మూలధన లాభం (LTCG) = రూ.1,50,000

అప్పుడు పన్ను వర్తింపు ఇలా ఉంటుంది..

ఎస్‌టీసీజీపై పన్ను  = 80,000x15% = ₹12,000

ఎల్‌టీసీజీపై పన్ను = (1,50,000-1,00,000)x10% = ₹5,000

* ఎల్‌టీసీజీపై రూ.1లక్ష వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అందుకే పై ఉదాహరణలో రూ.1లక్ష తీసివేసి మిగిలిన మొత్తంపై మాత్రమే పన్ను గణించాం.

మొత్తం చెల్లించాల్సిన పన్ను = 12,000 + 5,000 = 17,000

* కానీ, రమేశ్‌ తన పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్‌ బాగా పడిపోయినట్లు గమనించారు. అవి తిరిగి కోలుకొనే సూచనలు కూడా లేవన్న అంచనాకు వచ్చారు. ట్యాక్స్ లాస్‌ హార్వెస్టింగ్‌ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. పడిపోయిన స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా రూ.30,000 స్వల్పకాల మూలధన నష్టాన్ని చవిచూశారు. అప్పుడు ఆయన పన్ను చెల్లింపు ఇలా ఉంటుంది...

ఎస్‌టీసీజీపై పన్ను  = (80,000-30,000)x15% = ₹7,500

ఎల్‌టీసీజీపై పన్ను = ₹5,000

మొత్తం చెల్లించాల్సిన పన్ను = 7,500 + 5,000 = ₹12,500

మొత్తంగా రూ.3,500 వరకు పన్ను ఆదా అయ్యింది. మరోవైపు నష్టాల్లో ఉన్న స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును మరింత బలమైన షేర్లలో మదుపు చేయడం ద్వారా కూడా నష్టాన్ని పూడ్చుకునే అవకాశం రమేశ్‌కు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని