Car Loan: ఈఎంఐ భారం కావొద్దంటే కారు లోన్‌కు ఏ వడ్డీరేటు బెటర్‌?

కారు లోన్‌ తీసుకోవాలనుకునేవారు ఎలాంటి వ్యూహం అనుసరించాలి? పెరగనున్న ఈఎంఐ భారాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం....

Updated : 29 Jun 2022 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ ఇటీవల రెండు దఫాల్లో రెపోరేటును 90 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో రుణ వడ్డీరేట్లు ఎగబాకుతున్నాయి. ఈ తరుణంలో కారు లోన్‌ (Car Loan) తీసుకోవాలనుకునేవారు ఎలాంటి వ్యూహం అనుసరించాలి? పెరగనున్న ఈఎంఐ (EMI) భారాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం..!

ఫిక్స్‌డ్‌ Vs ఫ్లోటింగ్‌..

కారు లోన్ (Car Loan) తీసుకోవాలనుకునేవారికి ఫిక్స్‌డ్‌ (Fixed Rate), ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు (Floating Rate).. రెండూ అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్‌ అంటే రెపోరేటు (Repo Rate)కు అనుగుణంగా వడ్డీరేట్లు మారుతుంటాయి. అదే ఫిక్స్‌డ్‌లో అయితే, రుణ కాలపరిమితి (Tenure) ముగిసే వరకు ఒకే వడ్డీరేటు (Interest Rate) వర్తిస్తుంది. చాలా వరకు ప్రభుత్వ బ్యాంకులు కారు లోన్లను ఫ్లోటింగ్‌ వడ్డీరేట్ల (Floating Rate)కు అందిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులు ఫిక్స్‌డ్‌వైపు మొగ్గుచూపుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే రుణగ్రహీతల అభీష్టానికి విడిచిపెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిక్స్‌డ్‌ వడ్డీరేటుకు కారు లోన్‌ తీసుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 

వచ్చే 18-24 నెలల పాటు కారు లోన్ వడ్డీరేట్లు భారీగా పెరగనున్నట్లు అంచనా. దీంతో నెలవారీ కిస్తీ (EMI)లు భారమవుతాయి. దీని నుంచి బయటపడేందుకు స్థిర వడ్డీరేట్ల వద్ద లోన్‌ తీసుకుంటేనే మేలు. దీని వల్ల కారు లోన్‌ (Car Loan) ముగిసే వరకు ఒకే రకమైన ఈఎంఐ ఉంటుంది. సాధారణంగా కారు లోన్‌ కాలపరిమితి 7-8 ఏళ్ల వరకు ఉంటుంది.

రుసుములుంటాయి జాగ్రత్త!

ఫిక్స్‌డ్‌ వడ్డీరేట్ల వద్ద కారు లోన్‌ తీసుకునేవారు అదనపు రుసుములను పరిగణనలోకి తీసుకోవాలి. ఫిక్స్‌డ్‌ రేట్ల వద్ద రుణాలు తీసుకునేవారు ముందస్తు చెల్లింపు (Pre-Payment) రుసుము భరించాల్సి ఉంటుంది. అంటే రుణ కాలపరిమితి ముగియక ముందే లోన్‌ మొత్తాన్ని చెల్లించాలనుకుంటే అదనంగా కొంత ఛార్జీ వసూలు చేస్తారు. పైగా బ్యాంకులు ముందస్తు చెల్లింపునకు కొన్ని షరతులు విధిస్తాయి. దీనివల్ల ముందుగానే చెల్లించడం వల్ల పొందాల్సిన ప్రయోజనాలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఫ్లోటింగ్‌ రేట్ల వద్ద ఈ భారం ఉండదు.

సెకండ్‌ హ్యాండ్‌ కారు లోన్లు ఖరీదు..

గత ఏడాది కాలంగా కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీనికి వడ్డీరేట్ల పెంపు కూడా తోడయ్యింది. దీంతో చాలా మంది వినియోగించిన కార్లు అంటే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. కొత్తకార్లకు రుణాలు 7 శాతం వడ్డీరేటుతో లభిస్తే.. పాత కార్లకు 11 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కారు విలువను లెక్కించడంలో ఒక్కో సంస్థ ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంది. ఆ విలువపైనే రుణ మంజూరు మొత్తం ఆధారపడి ఉంటుంది. అయితే, సెకండ్‌ హ్యాండ్‌ కారుని కొనే ముందు కచ్చితంగా ఆ కారుపై ఇంతకుముందే తీసుకున్న రుణం పూర్తిగా చెల్లించారో.. లేదో.. ఆరా తీయాలి.

వడ్డీరేటు ఒక్కటే కాదు...

కారు కొనేటప్పుడు డీలర్‌షిప్‌లలో అందించే రుణ ఆఫర్ల మీదనే ఆధారపడొద్దు. మీకు అందుబాటులో ఉన్న అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఆరా తీయాలి. వడ్డీరేట్లను మాత్రమే కాకుండా ప్రాసెసింగ్‌ ఫీజు, ‘లోన్‌-టు-వాల్యూ’ నిష్పత్తి వంటి అంశాలన్నింటినీ సరిపోల్చుకోవాలి. ఇతర నియమ నిబంధనలు, షరతులనూ చూసుకోవాలి. తక్కువ పరిమితులు ఉన్న సంస్థ నుంచి రుణం తీసుకోవడం ఉత్తమం. అలాగే రుణం మంజూరు చేయబోయే సంస్థపై ఉన్న విశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 

మరోవైపు రుణ మొత్తాల ఈఎంఐల విలువ మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం మించకుండా జాగ్రత్త పడాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ 50 శాతం దాటొద్దు. అలాగే రుణగ్రహీతలు తమ క్రెడిట్‌ స్కోరునూ దృష్టిలో ఉంచుకోవాలి. స్కోరు 750 దాటితే.. వడ్డీరేటులో కొంత కలిసొచ్చే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని