Byjus: కష్టాలు చుట్టుముట్టిన వేళ.. బైజూస్‌ రవీంద్రన్‌ కంటతడి!

Byjus Raveendran Broke Down: కంపెనీని కాపాడుకునేందుకు బైజూస్‌ రవీంద్రన్‌ ఓ దశలో కంటతడి పెట్టుకున్నారు. ఆ కంపెనీలో ఈడీ సోదాల అనంతరం ఇది జరిగింది.

Published : 27 Jul 2023 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ (Byjus) ఇటీవల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు నిలిచిపోవడం, బోర్డు నుంచి డైరెక్టర్లు వైదొలగడం, సంస్థకు ఆడిటర్‌ గుడ్‌బై చెప్పడం వంటి అంశాలతో ఆ సంస్థ నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ కంపెనీ ఖాతా పుస్తకాల తనిఖీకి కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం కొన్ని రోజుల క్రితం ఆదేశించింది. అయితే, ఇలా కంపెనీని వరుస కష్టాలు చుట్టుముట్టిన వేళ.. ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఓ దశలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రన్‌ కంటతడి పెట్టుకున్నారని తెలిసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రవీంద్రన్‌ నివాసంతోపాటు బైజూస్‌ మాతృ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు చేపట్టింది. ఫెమా చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ అప్పట్లో వెల్లడించింది. విదేశీ మారకానికి సబంధించిన ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దీనిపై ఎలాంటి కేసులూ నమోదవ్వలేదు. ఈ దాడుల అనంతరం కొన్ని రోజుల తర్వాత దుబాయ్‌లో పలువురు ఇన్వెస్టర్లతో రవీంద్రన్‌ మాట్లాడారు. మధ్యప్రాచ్యం నుంచి 1 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ విషయంలో ఆయన ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ.. కంపెనీని కాపాడుకునేందుకు కన్నీటి పర్యంతమయ్యారు. అదే కాల్‌లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తాజాగా వెల్లడించింది.

వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలు ఉన్నాయా? విలీనం చేయకపోతే ఏమవుతుంది?

కేరళలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన రవీంద్రన్‌ తొలినాళ్లలో బెంగళూరులో విద్యార్థులకు ట్యూషన్లు బోధించేవారు. అతడి బోధనా పద్ధతుల తీరు ఆకట్టుకోవడంతో అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అలా కొన్ని రోజులకే థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట కోచింగ్‌ సెంటర్లు ప్రారంభించారు. అలా చిన్నగా ప్రారంభమైన బైజూస్‌ ప్రస్థానం.. డిజిటల్‌ రూపు సంతరించుకుంది. జియో ప్రవేశంతో మరింత ఎత్తుకెదిగింది. తొలి నాళ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ విద్యకు డిమాండ్‌ పెరగడంతో కొన్ని కంపెనీలను సైతం బైజూస్‌ కొనుగోలు చేసింది.

2022లో కరోనా తగ్గుముఖం మొదలైన తర్వాత బైజూస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ ట్యూషన్లకు ఆదరణ తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెట్టుబడులూ నెమ్మదించాయి. ఈ క్రమంలోనే ముందుగా హామీ ఇచ్చిన కొన్ని కంపెనీలు పెట్టుబడులకు ముఖం చాటేశాయి. ఈ దశలోనే 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక ఫలితాల వెల్లడిని కంపెనీ ఆలస్యం చేయడంతో కష్టాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈడీ సోదాలు జరిగాయి. కంపెనీ ఆడిటర్‌గా ఉన్న డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ గత నెలలో రాజీనామా చేసింది. అదే వారంలో కంపెనీ బోర్డు నుంచి మూడు సంస్థలు వైదొలగాయి. ఇటీవల కార్పొరేట్‌ మంత్రిత్వ శాఖ ఖాతా పుస్తకాల తనిఖీకి ఆదేశించింది. తాజాగా బైజూస్‌పై తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ప్రోసస్‌ ఎన్‌వీ అనే సంస్థ తాజాగా విమర్శలు గుప్పించింది. కంపెనీ పరిమాణం పెరుగుతూ వచ్చిన క్రమంలో పాలనా పరంగా అవసరమైన మార్పులను సమర్థంగా చేపట్టలేకపోయిందని, తమ డైరెక్టర్లు పలుమార్లు సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టిందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని