EPFO: వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలు ఉన్నాయా? విలీనం చేయకపోతే ఏమవుతుంది?

Merging Multiple EPF Accounts: ఒకటి కంటే ఎక్కువ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయా? ఒకవేళ విలీనం చేయకపోతే ఏమవుతుందో తెలుసుకోవడంతో పాటు.. ఎలా విలీనం చేయాలో తెలుసుకోండి..

Published : 27 Jul 2023 02:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరికొత్త అవకాశాలు, మెరుగైన జీతాలు ఆశిస్తూ ఇతర ఉద్యోగాలకు వెళ్లటం సహజమే. అయితే ఇలా ఉద్యోగం మారిన ప్రతిసారీ కొత్త ఈపీఎఫ్‌ (EPF) ఖాతాలు తెరుస్తారు. కానీ, వాటిని విలీనం చేయరు. ఎలా విలీనం చేయాలో తెలియక కొందరు.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో తెలియక మరికొందరు దీన్ని విస్మరిస్తుంటారు. ఒకవేళ మీకూ వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలుంటే వాటిని ఎలా విలీనం చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకటి కంటే ఎక్కువ ఖాతాల వల్ల ఉండే ఇబ్బందులేంటో చూద్దాం..

ఓ వ్యక్తి వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పటికీ వారికి ఒకటే యూఏఎన్‌ (UAN) ఉంటుంది. యూఏఎన్‌ అంటే యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌. మరో విధంగా చెప్పాలంటే ఆధార్‌ సంఖ్య లాంటిదన్నమాట. ఈపీఎఫ్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక యూఏఎన్‌ కేటాయిస్తారు. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ యూఏఎన్‌ నంబర్‌ కిందే ఆయా సంస్థలు వేర్వేరు ఖాతాలను తెరుస్తాయి. అయితే, ఈపీఎఫ్‌ నియమాల ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ యూఎన్‌ నంబర్లు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నా ఎలాంటి పెనాల్టీలూ విధించరు. వేరే సంస్థలో ఉద్యోగంలో చేరితే పాత యూఏఎన్‌ నంబర్‌నే ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ సూచిస్తోంది.

ఇక పీఎఫ్‌ ఖాతాల విషయానికొస్తే.. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఒక్కో అకౌంట్‌ క్రియేట్‌ అవుతుంది. వీటిని అలానే వేర్వేరుగా వదిలేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు కోల్పోవడంతో పాటు పన్ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరుసగా మూడేళ్ల పాటు ఒక పీఎఫ్‌ ఖాతాలో డబ్బు జమ కాకుంటే ఆ ఖాతాలోని డబ్బుపై ఎటువంటి వడ్డీని ఈపీఎఫ్‌ఓ జమ చేయదు. సాధారణంగా పీఎఫ్‌ ఖాతా ఐదేళ్లు దాటితే అందులోని విత్‌డ్రాలపై ఎలాంటి పన్నూ ఉండదు. ఐదేళ్ల కంటే తక్కువ ఉంటే విత్‌ డ్రా సమయంలో 10 శాతం టీడీఎస్‌ కట్‌ అవుతుంది. ఆ ఖాతాలో రూ.50వేలు కంటే తక్కువ ఉంటే ఈ నియమం వర్తించదు. అందుకే ఖాతాలు విలీనం చేసుకోవడం మంచిది.

ఓ ఉదాహరణ ద్వారా చెప్పాలంటే.. A అనే వ్యక్తి ఒక్కో కంపెనీలో రెండేళ్లు చొప్పున నాలుగు కంపెనీలు మారాడు. తర్వాత ఆయా ఈపీఎఫ్ ఖాతాలను విలీనం చేశాడు. దీంతో ఆ వ్యక్తి సర్వీసు కాలాన్ని ఎనిమిదేళ్లుగా పరిగణిస్తారు. అదే ఖాతాలు విలీనం చేయకపోతే ఆయా ఖాతాల సర్వీసు కాలాన్ని రెండేళ్లుగా పరిగణించి విత్‌ డ్రాలపై పన్ను విధిస్తారు.

విలీనం ఇలా..

  • తొలుత EPFO వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • సర్వీసెస్‌ విభాగంలో ‘వన్‌ ఎంప్లాయీ- వన్‌ ఈపీఎఫ్‌ అకౌంట్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి
  • మెంబర్‌ ఇ-సేవా పోర్టల్‌లోకి లాగిన్‌ అయ్యాక మీ వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.
  • ఆ తర్వాత పాత ఖాతా నంబర్ల విలీనం కోసం రిక్వెస్ట్‌ పంపించాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం మొబైల్‌ నంబర్‌, ప్రస్తుతం యూఏఎన్‌, మెంబర్‌ ఐడీని సమర్పించాల్సి ఉంటుంది.
  • మీ రిక్వెస్ట్‌ ప్రస్తుత సంస్థ ఆమోదం తెలిపాక.. ఈపీఎఫ్‌ఓ మీ వివరాలన్నిటినీ పరిశీలించి అకౌంట్‌ విలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. 
  • ఒకవేళ వేర్వేరు UAN నంబర్లపై వేర్వేరు ఖాతాలు విలీనం చేయాలంటే ఈపీఎఫ్‌ఓకు మెయిల్‌ చేయాల్సి ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని