కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు ప్రచార నిధులు మళ్లిస్తాం

సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు కేటాయించిన నిధులను కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు మళ్లిస్తామని షియామీ ఇండియా వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు 1,000 ఆక్సిజన్‌

Updated : 24 Apr 2021 01:51 IST

షియామీ ఇండియా

దిల్లీ: సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు కేటాయించిన నిధులను కొవిడ్‌-19 ఉపశమన చర్యలకు మళ్లిస్తామని షియామీ ఇండియా వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు 1,000 ఆక్సిజన్‌ కాన్సెన్‌ట్రేటర్లను రూ.3 కోట్లతో సరఫరా చేయనుంది. కొవిడ్‌ యోధుల కోసం రూ.ఒక కోటి సమీకరించేందుకు గివ్‌ ఇండియాతో కలిసి జట్టు కట్టింది. ఏదేని కొత్త ఉత్పత్తి విడుదల చేసినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో పోటీలను (కాంటెస్ట్‌) షియామీ నిర్వహిస్తుంటుంది. ఇప్పుడు వీటికి ఖర్చు పెట్టే నిధులను కొవిడ్‌-19 ఉపశమన చర్యల కోసం వాడనుంది.


ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత
సంగీతా రెడ్డి

దిల్లీ: వైద్యానికి ఉపయోగించే ఆక్సిజన్‌ ఉత్పిత్తి, సరఫరాలో ఎటువంటి అంతరాయాలూ ఉండకూడదని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసినా ఆసుపత్రులు ఆక్సిజన్‌ కొరత ఎదుర్కొంటున్నాయని అపోలో హాస్పిటల్స్‌ జేఎండీ సంగీతా రెడ్డి పేర్కొన్నారు. ‘మాక్స్‌స్మార్ట్‌ హాస్పిటల్స్‌, మాక్స్‌ హాస్పిటల్‌ సాకేత్‌లలో గంటకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే ఉంది. మధ్యాహ్నం 1 నుంచీ వేచిచూస్తున్నాం. 700 మందికి పైగా రోగులున్నారు. తక్షణం సహాయం అవసరమ’ని మాక్స్‌ హెల్త్‌కేర్‌ చేసిన ట్వీట్‌కు ఆమె పై విధంగా స్పందించారు. ‘ప్రతి నిమిషం ఆలస్యమయ్యే కొద్దీ.. చాలా మంది ప్రాణాలకు ముప్పు ఉంటోంద’ని కేంద్ర మంత్రులు, దిల్లీ ముఖ్యమంత్రి, ఇతర రాష్ట్ర మంత్రులను టాగ్‌ చేస్తూ సంగీతా రెడ్డి ట్వీట్‌ చేశారు.


50 కొవిడ్‌ మొబైల్‌ పరీక్షా కేంద్రాలు: మైల్యాబ్‌

దిల్లీ: పుణెకు చెందిన మాలిక్యులార్‌ డయాగ్నోస్టిక్స్‌ కంపెనీ మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ దేశ వ్యాప్తంగా 50 కొవిడ్‌-19 మొబైల్‌ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇవి ఐసీఎంఆర్‌ ఆమోదిత, ఎన్‌ఏబీఎల్‌ ధ్రువీకరణ పొందిన కేంద్రాలుగా ఉంటాయని పేర్కొంది.  ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మరింత పెంచడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. ఈ పరీక్షా కేంద్రాలను ఆటోమేటెడ్‌ కాంపాక్ట్‌ ఎక్స్‌ఎల్‌ యంత్రాలతో రూపొందించినట్లు, రోజుకు 1,500-3,000 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపింది. ముంబయిలో ఇప్పటికే 2 కేంద్రాలు ఏర్పాటయ్యాయి.  


సంక్షిప్తంగా..

* స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలను అందించే ఫిన్‌టెక్‌ సంస్థ ఏంజెల్‌ బ్రోకింగ్‌ నూతన సీఈఓగా నారాయణ్‌ గంగాధర్‌ నియమితులయ్యారు.
* స్టాక్‌ మార్కెట్లో సులువుగా, వేగంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ‘యాక్సిస్‌ డైరెక్ట్‌ రింగ్‌’ మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని