బీమా పాలసీ ఎక్కడ కొనాలి?

వెబ్ అగ్రిగేట‌ర్ అనేది బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి వార‌ధిలా ప‌నిచేస్తూ, వివిధ బీమా కంపెనీలు సంబంధించిన పాల‌సీల‌ను పోల్చి చూపిస్తుంది.

Published : 25 Dec 2020 13:42 IST

బీమా ప్ర‌తీఒక్క‌రికీ అవ‌సరం, జీవితంలో ఒక‌భాగం. బీమాలో చాలా ర‌కాలు ఉన్నాయి. జీవిత‌, వాహ‌న‌(కారు, ద్వీచ‌క్ర వాహ‌న‌) బీమా, ఆరోగ్య బీమా, వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా, క్రిటిక‌ల్ ఇలెనెస్ మొద‌లైన వివిధ ర‌కాల బీమా పాల‌సీలు ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి.

అంద‌రికీ అన్ని పాల‌సీలు అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు.అయితే ప్ర‌తీఒక్క‌రూ ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ పాల‌సీల‌ను తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. చాలా మంది బీమా ఏజెంట్ ద్వారా పాల‌సీల‌ను కొనుగోలు చేస్తుంటారు. కార‌ణం మ‌నం ప్ర‌తీ బీమా సంస్థ వ‌ద్ద‌కు వెళ్ళి వివిధ పాల‌సీలు వాటికి సంబంధించిన ప్రీమియం(చాలామంది త‌క్కువ ప్రీమియంతో కూడిన పాల‌సీ కోసం చూస్తుంటారు), సెటిల్‌మెంట్ రేషియో మొద‌లైన స‌మ‌చారాన్ని తెలుసుకోవ‌డం వ్య‌య ప్ర‌యాస‌ల‌తో కూడి ఉంటుంది. ఇంత చేసి ఒక సంస్థ‌ను ఎంచుకుంటే వాటి నుంచి స‌రైన స‌మాచారాన్ని తెలుసుకోవ‌డ‌మూ క‌ష్ట‌మే. ఇందుకు చాలా స‌మ‌యాన్ని వెచ్చించాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారాన్ని అందిస్తున్నాయి వెబ్ అగ్రిగేట‌ర్లు.

వెబ్ అగ్రిగేట‌ర్ అంటే?
వెబ్ అగ్రిగేట‌ర్ అనేది బీమా సంస్థ‌కు, పాల‌సీదారునికి మ‌ధ్యవ‌ర్తిలా ప‌నిచేస్తుంది. వివిధ బీమా సంస్థ‌ల‌కు సంబంధించిన ఉత్ప‌త్తుల‌ను, వాటి ధ‌ర‌ల‌ను పోల్చి చూపిస్తుంది. ఇందుకు వారు ఐఆర్‌డీఏఐ(బీమా నియంత్ర‌ణ ప్రాధికార సంస్థ‌) నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. ఐఆర్‌డీఏఐ వ‌ద్ద రిజ‌స్ట‌ర్ అయ్యి లైసెన్స్ పొందిన సంస్థ‌లు మాత్ర‌మే ఈ సేవ‌ల‌ను అందిస్తాయి. పాల‌సీ బ‌జార్‌, మై ఇన్సూరెన్స్ క్లబ్ తదితర సంస్థలను ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఐఆర్‌డీఏఐ వ‌ద్ద లైసెన్స్ పొందిన సంస్థ‌లు మిన‌హా మ‌రి ఏ ఇత‌ర సంస్థ‌లు ఈ విధ‌మైన సేవ‌ల‌ను అందించ‌రాదు.

ఇంట‌ర్‌నెట్ వాడ‌కం ఎక్కువ‌గా ఉన్న ప్ర‌స్తుత రోజుల్లో వెబ్ అగ్రిగేటర్స్ ఆన్‌లైన్‌లో వివిధ సంస్థ‌ల‌కు సంబంధించిన పాల‌సీ వివ‌రాలు, స‌మాచారాన్ని విన‌యోగ‌దారునికి అందిస్తాయి. అయితే పాల‌సీ కొనుగోలు చేసే వారి అవ‌స‌రాల‌ మేర‌కు మాత్ర‌మే అంటే వారు ఎంచుకున్న పాల‌సీ ఆన్‌లైన్లో చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియం, పాల‌సీ ప‌త్రాల‌ను చేతికి ఇస్తారా లేదా సాప్ట్ కాపీగా ఇస్తారా వంటి వివ‌రాల‌ను ఖ‌చ్చితంగా తెల‌పాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల స‌మ‌యం ఆదా కావ‌డంతో పాటు డ‌బ్బు ఆదా అవుతుంది. నిర్ణీత స‌మ‌యంలోపుగా పాల‌సీకి సంబంధించిన స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు. కాంపిటేటీవ్ క్వ‌టేష‌న్స్ కోసం వెబ్ అగ్రిగేటర్లు బీమా సంస్థ‌తో ఒప్పందం చేసుకుంటారు.

ప్ర‌యోజ‌నాలు:

  • ఒక వ్య‌క్తి ఒక పాల‌సీకి సంబంధించి వివిధ కంపెనీల ధ‌ర‌ల‌ను, ఆఫ‌ర్ల‌ను పోల్చి చూసుకోవ‌చ్చు.

  • ఎక్కువ స‌మ‌యం వృధా కాకుండా ప్రీమియంల‌ను నేరుగా చెల్లించ‌వ‌చ్చు.

  • కస్టమర్ కేర్ ద్వారా పాలసీ లోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

  • క్లెయిమ్ సమయం లో సహాయ పడతారు.

  • ఆన్లైన్ పాలసీల ప్రీమియం కాస్త తక్కువగా ఉంటాయి.

ప్ర‌తికూల‌త‌లు:

  • ఎంచుకున్న అగ్రిగేట‌ర్లు లైసెన్సు పునరుద్ధరించుకున్నారా లేదా అని ప్రతీసారి తెలుసుకోవ‌డం

  • ఏజెంట్ ద్వారా ల‌భించే సేవ‌లు అగ్రిగేట‌ర్‌లు అందించ‌క‌పోవ‌చ్చు. ఉదాహరణకి, ఫారం నింపడం లో.

  • కొన్ని వెబ్సైట్లు అన్నీ పధకాలను చూపించకపోవచ్చు.

వెబ్ అగ్రిగేటర్ల‌ను సంప్ర‌దించే ముందు అవి లైన‌న్స్ ఉన్న‌వా కాదా అని త‌నిఖీ చేసుకోవాలి. ఇందుకోసం ఐఆర్‌డీఏ వెబ్‌సైట్‌ను ఆశ్రయించ‌వ‌చ్చు. అక్కడ లైసెన్స్‌ ఉన్న బీమా సంస్థ‌ల‌ వివరాలు ఉంటాయి. వెబ్ అగ్రిగేట‌ర్లు వారి లైసెన్స్‌ను, రిజిస్ట‌ర్ తేదీని వెబ్‌సైట్‌లో పొందిప‌ర‌చాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీరు ఎంచుకున్న అగ్రిగేట‌ర్ వారి వెబ్‌సైట్‌లో లైసెన్స్ నెంబ‌రును ప్ర‌ద‌ర్శించ‌క‌పోతే, ఐఆర్‌డీఏఐ వెబ్‌సైట్‌కి వెళ్ళి అది రిజిష్ట‌ర్డ్ కంపెనీ అవునా? కాదా అనే విష‌యాన్ని ధృవీక‌రించుకోవాలి.

ఈ కింది లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా వెబ్ అగ్రిగేట‌ర్ పేరు, వారి వెబ్‌సైట్ లింక్‌, రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్ వంటి వివ‌రాల‌ను, అదేవిధంగా ఫిబ్ర‌వ‌రి 28,2019 నాటికి ర‌ద్దు/ స‌స్పెండ్‌/ తిర‌స్క‌ర‌ణ‌/ నిలిపివేసిన‌/ స‌రెండ‌ర్ చేసిన‌/ పున‌రుద్ధ‌ర‌ణ తిర‌స్క‌రించిన‌/ పున‌రుద్ధ‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌ని/ పున‌రుద్ధ‌ర‌ణ ప్రాసెస్ జ‌రుగుతున్న కంపెనీ వివ‌రాలు కూడా పొంద‌వ‌చ్చు.
https://www.irdai.gov.in/ADMINCMS/cms/whatsNew_Layout.aspx?page=PageNo2337&flag=1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని