Economic Survey 2022: ఇలాగైతేనే $5 ట్రిలియన్ ఎకానమీ.. ఆర్థిక సర్వే 10 పాయింట్లు

కొవిడ్‌ మహమ్మారి కారణంగా కుంటుపడిన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడిందని ఆర్థిక సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది.

Updated : 31 Jan 2022 18:54 IST

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి కారణంగా కుంగిన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడిందని ఆర్థిక సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 2024-25 నాటికి ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే.. పెద్ద ఎత్తున మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని అభిప్రాయపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మేరకు ఉభయ సభల్లో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. సర్వేలో ముఖ్యాంశాలివీ..

  1. వృద్ధికి ఢోకా లేదు: 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పుంజుకుందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు, పెరిగిన ఎగుమతుల కారణంగా.. ఆర్థిక వ్యవస్థలోకి నిధులు ప్రవాహం పెరిగిందని తెలిపింది. 2022-23లో ఆర్థిక వృద్ధి రేటు 8- 8.5 శాతం ఉండొచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2 శాతంగా నమోదవ్వొచ్చని అంచనా వేసింది.
  2. టార్గెట్‌ 5 ట్రిలియన్‌: 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే మౌలిక రంగంలో 1.4 ట్రిలియన్‌ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 2008-17 మధ్య కాలంలో మొత్తం 1.1 ట్రిలియన్‌ డాలర్లను మౌలిక రంగంలో జొప్పించినట్లు పేర్కొంది. అయితే, భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమేనని అభిప్రాయపడింది. అయితే, 2020-25 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు 1.5 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడుల లక్ష్యంతో నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్ఐపీ) కేంద్రం ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేసింది.
  3. ప్రైవేటీకరణకు ఎయిరిండియా ఊతం: ప్రైవేటీకరణను వేగవంతం చేయడానికి ఎయిరిండియా విక్రయం ఊతం ఇచ్చిందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. వ్యాపారంలో ప్రభుత్వ రంగాన్ని పరిమితం చేస్తూ.. అన్ని రంగాల్లో ప్రైవేటు వ్యక్తుల పాత్రను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఎయిరిండియా విక్రయం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను సాధించడంతో పాటు ప్రైవేటీకరణకు ఇది మరింత ఊతం అందిస్తుందని తెలిపింది. ఇటీవల కేంద్రం ఎయిరిండియాను రూ.18వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.
  4. ఆర్థిక వ్యవస్థకు టీకా: ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంలో కొవిడ్‌ టీకాలు ముఖ్య భూమిక పోషించాయని సర్వే అభిప్రాయపడింది. కేవలం ఆరోగ్య సంరక్షణ దృష్టితోనే కాకుండా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలోనూ టీకాలు కీలక పాత్ర పోషించాయని అభిప్రాయపడింది. టీకాలను స్థూల ఆర్థిక వ్యవస్థకు సూచికగా వ్యవహరించాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా జనవరి 16 నాటికి 156 కోట్ల టీకా డోసులు వేసినట్లు తెలిపింది.
  5. చిప్‌ ఇబ్బంది పెట్టింది: సెమీ కండక్టర్ల కొరత కారణంగా పలు పరిశ్రమలు మూతపడడమో లేదంటే ఉత్పత్తిని తగ్గించడమో చేశాయని ఆర్థిక సర్వే పేర్కొంది. చిప్‌ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు 2021 డిసెంబర్‌ నాటికి 7 లక్షల కార్లను అందించలేకపోయాయని తెలిపింది. అందుకే ప్రభుత్వం సెమీకండక్టర్లు, డిస్‌ప్లే తయారీ రంగానికి ప్రోత్సహించేందుుకు రూ.76 వేలకోట్లు ఖర్చు చేసేందుకు ముందుకొచ్చిందని పేర్కొంది.
  6. విక్రయాలు పడినా.. ధరలు తగ్గేదేలే: కరోనా మొదటి, రెండో వేవ్‌ కారణంగా దేశంలో గృహ విక్రయాలు తగ్గినా వాటి ధరలు మాత్రం ఎక్కడా తగ్గలేదని ఆర్థిక సర్వే పేర్కొంది. పైగా కొన్ని నగరాల్లో ధరలు గణనీయంగా పెరిగాయని పేర్కొంది. రెండు వేవ్‌ల తర్వాత ఇప్పుడు గృహ విక్రయాలు కూడా పెరిగాయని పేర్కొంది. గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం, కొన్ని రాష్ట్రాలు స్టాంప్‌ డ్యూటీని తగ్గించడం ఇందుకు కారణమని తెలిపింది. 
  7. ఐపీవో బూమ్‌: ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయని ఆర్థిక సర్వే పేర్కొంది. 2021 ఏప్రిల్‌-నవంబర్‌ మధ్య 75 కంపెనీలు ఐపీవోకి వచ్చి రూ.89,066 కోట్లు సమీకరించాయని తెలిపింది. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధికమని పేర్కొంది. టెక్నాలజీ స్టార్టప్‌లు ఎక్కువగా మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయని తెలిపింది.
  8. రహదారుల్లో వేగం: దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2013-14 నుంచి రహదారుల నిర్మాణంలో వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది. 2020-21లో 13,327 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగినట్లు తెలిపింది. 2019-20లో ఇది 10,237 కిలోమీటర్లుగా ఉందని పేర్కొంది.
  9. ఫార్మా రంగంలో భారీగా ఎఫ్‌డీఐలు: దేశీయ ఫార్మారంగంలోకి ఈ ఏడాది ఒక్కసారిగా విదేశీ పెట్టుబడులు పోటెత్తాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ముఖ్యంగా కొవిడ్‌ సంబంధిత వ్యాక్సిన్లు, ఇతర ఔషధాలకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో 2021 ఏప్రిల్‌- సెప్టెంబర్‌ మధ్య రూ.4,413 కోట్లు ఎఫ్‌డీఐల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినట్లు తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 53 శాతం అధికమని పేర్కొంది.
  10. పర్యాటకానికి ఒమిక్రాన్ వర్రీ: దేశం పర్యాటక రంగం ఇంకా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృతి కారణంగా అంతర్జాతీయ పర్యాటకుల రాక తగ్గిందని పేర్కొంది. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని పేర్కొంది. ప్రయాణ ఆంక్షల విషయంలో దేశాల మధ్య సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే పర్యాటక రంగం కోలుకుంటుందని అభిప్రాయపడింది.

ఆర్థిక సర్వే 2021-22 డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని