Twitter: భారత్‌లో తొలి ట్విటర్‌ యూజర్‌ ‘బ్లూ టిక్‌’కు డబ్బులు చెల్లిస్తారా?

బ్లూ టిక్‌కు డబ్బు వసూలు చేయనుండడంపై భారత్‌లో తొలి ట్విటర్‌ యూజర్‌ నైనా రెఢూ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే తాను చెల్లిస్తానా లేదా కూడా తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విటర్‌లో వచ్చిన మార్పులనూ వివరించారు.

Published : 08 Nov 2022 14:20 IST

దిల్లీ: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ట్విటర్‌ (Twitter) వెళ్లిన తర్వాత సామాజిక మాధ్యమంలో రానున్న మార్పులపై ఇటీవల జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రపంచ కుబేరుడు పలు కీలక నిర్ణయాలతో రోజూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో భారత్‌లో తొలి ట్విటర్‌ (Twitter) యూజర్‌ నైనా రెఢూ (Naina Redhu) ఏమంటున్నారు? తొలి నాళ్లలోనే బ్లూ టిక్‌ (Blue Tick) పొందిన ఆమె.. మరి దాన్ని నెలకు 8 డాలర్లు చెల్లించి కొనసాగిస్తారా? వంటి విషయాలతో సహా అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్విటర్‌ (Twitter)లో వచ్చిన మార్పులపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆర్కుట్‌ హవా కొనసాగుతున్న రోజుల్లో 2006లో TWTTR (ట్విటర్‌ ప్రయోగ దశల్లో ఉన్నప్పటి పేరు) నుంచి నైనా (Naina Redhu)కు ఓ మెయిల్‌ వచ్చింది. కొత్త సామాజిక మాధ్యమంలోకి లాగిన్‌ కావాలని అందులో కోరారు. అప్పటికి ఇంకా ట్విటర్‌ (Twitter)ను అధికారికంగా విడుదల చేయలేదు. చూద్దాం.. ఎలా ఉంటుందో అని సైనప్‌ అయ్యి తొలిసారి ట్విటర్‌ (Twitter)లోకి లాగిన్ అయినట్లు నైనా (Naina Redhu)తెలిపారు. తర్వాత అదే ఇంత పెద్ద సామాజిక మాధ్యమంగా రూపాంతరం చెందుతుందని తాను అప్పట్లో ఊహించలేదన్నారు. తొలినాళ్లలో భారత్‌ నుంచి ట్విటర్‌లో ఎవరూ ఉండేవారు కాదని తెలిపారు. కేవలం ట్విటర్‌ ఉద్యోగులు వారి స్నేహితులు మాత్రమే ఉండేవారన్నారు. దీంతో దాదాపు ఏడాదిన్నర పాటు దాన్ని వినియోగించలేదన్నారు.

ప్రస్తుతం నైనా రెఢూ (Naina Redhu) జైసల్మేర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నారు. ట్విటర్‌ (Twitter)లో తొలిసారి లాగిన్‌ అయినప్పుడు తాను ముంబయిలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ట్విటర్‌ బయోలో ఫొటోగ్రాఫర్‌, ఆర్టిస్ట్‌, ఎక్స్‌పీరియెన్స్‌ కలెక్టర్‌ అని మాత్రమే ఉన్నాయి. ఎక్కడా తాను భారత్‌లో తొలి ట్విటర్‌ యూజర్‌ అని చెప్పలేదు. దీనిపై స్పందిస్తూ.. ‘‘నేను ట్విటర్‌లో చేరడం అనుకోకుండా జరిగిపోయింది. దాంట్లో నా ప్రయత్నం ఏమీ లేదు. అది ఇతరులకు చెప్పాల్సినంత గొప్ప విషయమని నేను అనుకోవట్లేదు. అది విజయమేమీ కాదు కదా! అమెరికాలో ఒకరు తొలి 140 మంది ట్విటర్‌ యూజర్లను పేర్కొంటూ ఓ వ్యాసం రాశారు. అది చూసిన తర్వాత కానీ భారత్‌లో నేనే తొలి యూజర్‌నన్న విషయం తెలియలేదు’’ అని నైనా వివరించారు.

ప్రస్తుతం ట్విటర్‌లో నైనా చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆమెకు దాదాపు 22 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 1.75 లక్షల ట్వీట్లు చేశారు. మరి ట్విటర్‌ బ్లూ టిక్‌ (Blue Tick) కోసం నెలకు 8 డాలర్లు చెల్లిస్తారా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అసలు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టతా లేదు. బ్లూ టిక్‌ (Blue Tick)కు ఉన్న అర్థం ఏమైనా మారుతుందా? ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే నేను ఓ నిర్ణయం తీసుకోగలుగుతా. అకౌంట్‌ నిజమైందేనా? లేక ప్రజల్ని ప్రభావితం చేయగల వక్తులా? అని తెలుసుకోవడానికి ఇప్పటి వరకు బ్లూ టిక్‌ (Blue Tick) ఇచ్చారు. ఇప్పటి వరకు దానికోసం ఏమీ చెల్లించలేదు. గత 16 ఏళ్లలో లేనిది ఇప్పుడెందుకు డబ్బులు చెల్లించాలి?’’ అని నైనా అన్నారు.

బ్లూ టిక్‌ (Blue Tick)కు ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్‌ పెట్టడం వల్ల భారత్‌లో పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని నైనా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలకు దాంతో పనేముందన్నారు. నకిలీ వార్తలు ట్విటర్‌లో చాలా ఉంటాయని.. సొంతంగా శోధించి వాస్తవాలేంటో తెలుసుకోవాలని సూచించారు. తొలినాళ్లలో వ్యక్తిగత విషయాలను సైతం మిత్రులతో పంచుకునేవాళ్లమని నైనా తెలిపారు. ఎవరు చూస్తున్నారనే విషయాన్ని పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదన్నారు. కానీ, ఇప్పుడు ఒక సందేశం పోస్ట్‌ చేయాలంటే చాలా ఆలోచించాల్సి వస్తోందన్నారు. అందుకే ట్విటర్‌ను వాడడం బాగా తగ్గించానని చెప్పారు. కేవలం వృత్తిగత అంశాల గురించి మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని