న‌ష్ట‌భ‌యం అంత‌గా లేని నాలుగు పెట్టుబ‌డి మార్గాలు

డ‌బ్బు కోసం ప‌ని చేయ‌కు, నీ డ‌బ్బుతో ప‌ని చేయించు అని ఒక మ‌హానుభావుడు చెప్పాడు. ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పిన ఈ సూక్తి ఇప్పటి మ‌న ప‌రిస్థితుల‌కూ వ‌ర్తిస్తుంది. వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక అంటే కేవ‌లం నెల‌కో లేదా ఏడాదికో వేసుకునే బ‌డ్జెట్ లాంటిది కాదు.....

Published : 17 Dec 2020 15:16 IST

న‌ష్గ‌భ‌యం అంత‌గా ఎదుర్కోలేని వ్య‌క్తులు వేటిలో పెట్టుబ‌డులు పెట్టాల‌నే విష‌యాల‌ను తెలుసుకుందాం​​​​​​​

డ‌బ్బు కోసం ప‌ని చేయ‌కు, నీ డ‌బ్బుతో ప‌ని చేయించు అని ఒక మ‌హానుభావుడు చెప్పాడు. ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పిన ఈ సూక్తి ఇప్పటి మ‌న ప‌రిస్థితుల‌కూ వ‌ర్తిస్తుంది. వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక అంటే కేవ‌లం నెల‌కో లేదా ఏడాదికో వేసుకునే బ‌డ్జెట్ లాంటిది కాదు. అంత‌కుమించిన‌ది. వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ప్ర‌స్తుత అవ‌స‌రాల‌తో పాటు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌నూ ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని మ‌దుపు చేయాలి. మ‌న దేశంలో చాలా మంది ప్ర‌జ‌ల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక అనేది త‌క్కువ ప్రాధాన్యంగా మారిపోయింది. అది వారికొక అర్థం కానీ విష‌యంగానూ మారింది. భ‌విష్య‌త్ కోసం పెట్టుబ‌డులు పెడుతున్నామంటే, ప్ర‌స్తుత అత్య‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను పట్టించుకోవ‌ద్ద‌నే అపోహా చాలా మందిలో నెల‌కొంది. కానీ ఇది స‌రైన‌ల ఆలోచ‌న కాదు. ఆర్థిక అభ‌ద్ర‌త ఎప్ప‌టికైనా చేటే. కాబ‌ట్టి మ‌న జీవితంలో సాధించ‌వ‌ల‌సిన ఆర్థిక ల‌క్ష్యాల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకుని అందుకు త‌గ్గ‌ట్లుగా, పెట్టుబ‌డులు, పొదుపు చేస్తూ పోతూ ఉండాలి. ఈ కింద వివ‌రించిన ఉత్త‌మ పెట్టుబ‌డి మార్గాలు కేవ‌లం మీ పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త‌నివ్వ‌డ‌మే గాక‌, ఆర్థిక ల‌క్ష్యాల సాధ‌న‌లో తోడ్ప‌డ‌తాయి కూడా.

  1. ఉద్యోగ భ‌విష్య నిధి(ఈపీఎఫ్‌), ప్రజా భ‌విష్య‌నిధి(పీపీఎఫ్‌):

ఉద్యోగి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌ర జీవితం సాఫీగా సాగేలా ఈపీఎఫ్‌, పీపీఎఫ్ తోడ్ప‌డ‌తాయి. ఇవి అత్యంత భ‌ద్ర‌త‌తో కూడిన‌వే గాక‌, మంచి రాబ‌డులు 8 శాతం(పీపీఎఫ్‌), 8.5 శాతం(ఈపీఎఫ్‌) వార్ఙిక వ‌డ్డీ ఆదాయం అందిస్తాయి. ఉద్యోగి చిన్న వ‌య‌సు నుంచే పెట్టుబ‌డులు పెడుతూ పోతూ ఉంటే, ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి పెద్ద మొత్తంలో నిధి ఏర్ప‌డుతుంది. వ‌డ్డీ ఆదాయమే గాకుండా, ఈపీఎఫ్‌లో మెచ్యూరిటీ స‌మ‌యంలో మీ పెట్టుబ‌డుల‌లో మ‌రింత వృద్ధి నెల‌కొంటుంది.

పీపీఎఫ్‌లో చాలా త‌క్కువ ఆదాయం గ‌ల వారు సైతం రూ.100 మొద‌లుకుని పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. పీపీఎఫ్‌లో ఖాతాను ఏదేనీ బ్యాంకు లేదా పోస్ట‌పాఫీసు శాఖ‌ల‌లో తెర‌వ‌వ‌చ్చు.

  1. పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్ ప‌థ‌కాలు

ఈపీఎఫ్‌, పీపీఎఫ్ లాగానే పోస్టాఫీసు ట‌ర్మ్ డిపాజిట్లు(పీఓటీడీ) సైతం క‌చ్చిత‌మైన హామీతో, న‌ష్ట‌భ‌యం అంత‌గా లేని రాబ‌డులు(6.80 నుంచి 7.60 శాతం) అందిస్తాయి. ఈ ప‌థ‌కం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని భార‌త త‌పాలా సేవ‌ల విభాగం నేతృత్వంలో అమ‌లవుతోంది. ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితులు త‌ట్టుకుని, న‌ష్ట‌భ‌యం అంత‌గా లేని రాబ‌డుల‌నందించ‌డంలో ఇవి ముఖ్య‌మైన పెట్టుబ‌డి మార్గం. ఇందులో రూ.200 నుంచి డిపాజిట్ చేయ‌వ‌చ్చు. లాకింగ్ పీరియ‌డ్ 1 నుంచి 5 ఏళ్లు. పీఓటీడీలు మంచి ప‌న్ను ఆదా ప‌థ‌కాలు కూడా. ఇందులో మ‌రో ముఖ్య‌మైన అంశ‌మేంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖాతాను వేరే శాఖ‌కు మార్చుకునే సౌల‌భ్యం ఉంది. ఇందులో బ‌హుళ వ్య‌క్తులు, ఉమ్మ‌డి ఖాతాను కూడా తెర‌వ‌వ‌చ్చు.

  1. జాతీయ పింఛ‌ను ప‌థ‌కం

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్‌) అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ప‌థ‌కం. ఇది ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కం. దీని నిర్వ‌హ‌ణ చాలా సుల‌భ‌మే గాక‌, త‌క్కువ ఖ‌ర్చు, ప‌న్ను ఆదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేసుకునే స‌దుపాయాలున్నాయి. ఎన్‌పీఎస్ ముఖ్యంగా అసంఘ‌టిత రంగంలో ప‌ని చేస్తున్న‌వారికి ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని స‌మ‌కూర్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఎన్‌పీఎస్ నిధిలో ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి 40 శాతం మొత్తానికి ప‌న్నులు వ‌ర్తించ‌వు, అలాగే ఐటీ చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం అద‌నంగా రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలున్నాయి. జూన్ 30 ,2017 నాటికి ఎన్‌పీఎస్‌లో 1.07 కోట్ల మంది చందాదారుల‌తో పాటు, 1.90 ల‌క్షల కోట్ల నిర్వ‌హ‌ణలో ఉన్న ఆస్తులు(ఏయూఎమ్‌) ఉన్నాయి.

  1. మ్యూచువ‌ల్ ఫండ్లు

మొద‌టి సారిగా పెట్టుబ‌డులు పెట్టేవారికి లేదా పెట్టుబడుల విష‌యంలో అంత‌గా ప‌రిజ్ఞానం లేని వారికి, మ్యూచువ‌ల్ ఫండ్లు మంచివి. ఇందులో ఏ వ‌య‌సు వారైనా త‌మ త‌మ ఆర్థిక ల‌క్ష్యాలు, పెట్టుబ‌డుల‌క‌నుగుణంగా క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల విధానం(సిప్‌ల‌)లో చేయ‌వ‌చ్చు. సాంప్ర‌దాయ ఆర్థిక సాధానాల‌లో వ‌లె ఇందులో లాకింగ్ పీరియ‌డ్ లేక‌పోవ‌డం ప్ర‌ధాన సానుకూల‌త‌. మ‌దుప‌రులు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ‌బ్బుల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఇందులో వృత్తిగ‌త నిర్వ‌హ‌ణ‌, పెట్టుబ‌డుల వైవిధ్య‌త‌, న‌గ‌దు ల‌భ్య‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌, త‌క్కువ ఖ‌ర్చు లాంటివి ఇత‌ర సానుకూల అంశాలు. స‌రైన మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెడితే మంచి రాబ‌డుల‌ను అందుకోవ‌చ్చు.

వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌ణాళిక అనేది ప్ర‌తీ ఒక్క‌రికి అత్యంత ముఖ్య‌మైన అంశం, కాబ‌ట్టి దీనిని ఎవ‌రూ విస్మ‌రించ‌కూడ‌దు. మంచి భ‌విష్య‌త్ కోసం ఇప్ప‌టి నుంచే పెట్టుబ‌డుల‌ను చేస్తూ పోతూ ఉండాలి. అలా కాకుంటే వ్య‌క్తుల‌తో పాటు, వారి కుటుంబ‌మూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని