2030కి రూ.9 లక్షల కోట్లకు

తెలంగాణాలో ఫార్మా, బయోటెక్‌ పరిశ్రమపై డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: 2030 నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్‌ పరిశ్రమ ప్రస్తుత స్థాయి నుంచి 3 రెట్లు పెరిగి రూ.9 లక్షల కోట్ల (120 బిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణాలో 800 కంటే అధికంగా ఫార్మా, బయోటెక్‌, మెడ్‌టెక్‌ కంపెనీలు ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే టీకాల్లో మూడోవంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. ‘తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై శుక్రవారం ఇక్కడ సీఐఐ- తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఫార్మా, బయోటెక్‌ రంగాల్లో సత్వర వృద్ధికి పరిశోధన- అభివృద్ధికి పెద్దపీట వేయటమే మార్గమని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా కార్యకలాపాలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, సీఐఐ- తెలంగాణ మాజీ ఛైర్మన్‌ వి.రాజన్న మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ఐటీ పరిశ్రమ 16 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.20 లక్షల కోట్ల) స్థాయికి చేరిందని, ఏటా 12 శాతానికి పైగా వృద్ధి నమోదు చేయటమే కాకుండా,  6.3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోందని అన్నారు. ఏటా 4 లక్షల మంది గ్రాడ్యుయేట్లు అందుబాటులోకి వస్తున్నందున ఐటీ పరిశ్రమకు అవసరమైన మానవ వనరుల లభ్యత హైదరాబాద్‌లో అధికంగా ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి విద్యుదుత్పత్తికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, దేశంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ కమిషనర్‌ కృష్ణ భాస్కర్‌ అన్నారు. టీ-ఫైబర్‌ కార్యక్రమం పూర్తయితే ‘డిజిటల్‌ తెలంగాణ’ కార్యరూపం దాల్చుతుందని అన్నారు. సరకు రవాణా రంగంలో తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని కిర్బీ బిల్డింగ్‌ సిస్టమ్స్‌ ఎండీ డి.రాజు పేర్కొన్నారు. బాటసింగారంలో కొత్తగా లాజిస్టిక్స్‌ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖతో కలిసి హైదరాబాద్‌లో ఎన్‌సీఏఎం (నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడిటివ్‌ మ్యానుఫాక్చరింగ్‌) ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల అడిటివ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, 3డి ప్రింటింగ్‌, ప్రొటోటైపింగ్‌ పరిశ్రమలు స్థానికంగా అభివృద్ధి చెందుతాయని సీఐఐ- తెలంగాణా వైస్‌ ఛైర్మన్‌ వగీష్‌ దీక్షిత్‌ వివరించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని