రేపటి నుంచి భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) మదుపు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మూడో విడత రేపటి నుంచి ప్రారంభం కానుంది.

Published : 02 Dec 2021 02:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) మదుపు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ మూడో విడత రేపటి నుంచి ప్రారంభం కానుంది. దాదాపు రూ.5,000 కోట్లను సమీకరించే లక్ష్యంతో వచ్చిన ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ)లో ఈ నెల 3 నుంచి 9 వరకు మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఈ పథకం వ్యవధి 2032 ఏప్రిల్‌ 15 వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా ప్రాథమికంగా రూ.1,000 కోట్లు సమీకరించాలని అనుకుంటుండగా, గ్రీన్‌షూ ఆప్షన్‌ ద్వారా మరో రూ.4,000 కోట్లూ అట్టేపెట్టుకునే వీలుంది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ను ఎడెల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహిస్తోంది. అక్టోబరు నాటికి ఈ పథకం కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.36,359 కోట్లు. భారత్‌ బాండ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోని రుణ పత్రాల్లో మదుపు చేస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో ‘ఏఏఏ’ రేటింగ్‌ ఉన్న కంపెనీలనే ఇందుకోసం ఎంచుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ మూలధన అవసరాల కోసం రుణాలు తీసుకునేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం తొలి విడతలో రూ.12,400 కోట్లు, రెండో విడతలో రూ.11,000 కోట్లు సమీకరించింది. ఈ సందర్భంగా దీపం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు మదుపరుల నుంచి వస్తున్న పెట్టుబడులు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, మదుపరులకు ఈ పథకంపై ఉన్న నమ్మకాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని