మార్చిలోపే పవన్‌ హన్స్‌ విక్రయం!

హెలికాప్టర్‌ రవాణా సేవల కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వరంగ సంస్థ పవన్‌ హన్స్‌లో వాటా విక్రయ నిమిత్తం, ఆసక్తి గల పెట్టుబడిదార్ల నుంచి బిడ్‌లను వచ్చే జనవరిలో ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉంది.

Published : 08 Dec 2021 02:22 IST

దిల్లీ: హెలికాప్టర్‌ రవాణా సేవల కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వరంగ సంస్థ పవన్‌ హన్స్‌లో వాటా విక్రయ నిమిత్తం, ఆసక్తి గల పెట్టుబడిదార్ల నుంచి బిడ్‌లను వచ్చే జనవరిలో ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉంది. ‘పవన్‌హన్స్‌ ప్రైవేటీకరణ నిమిత్తం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్‌లను ఆహ్వానించే సమయం ఆసన్నమైంది. జనవరిలో బిడ్‌లను ఆహ్వానించి, మార్చి కల్లా వాటా విక్రయాన్ని పూర్తి చేస్తామ’ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్రక్రియను సమీక్షించేందుకు, వాటా విక్రయ సమయాన్ని నిర్ణయించేందుకు రాబోయే కొన్ని వారాల్లో మంత్రిత్వ సంఘం సమావేశం అయ్యే అవకాశం ఉంది. పవన్‌ హన్స్‌లో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా ఓఎన్‌జీసీ చేతిలో ఉంది. ప్రభుత్వం, ఓఎన్‌జీసీ రెండూ కూడా తమ వాటాలను విక్రయించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం 4-5 సంస్థల నుంచి బిడ్‌లు రావొచ్చని భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.350 కోట్లు సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1985లో నెలకొల్పిన పవన్‌ హన్స్‌ వద్ద 40 హెలికాప్టర్లు ఉండగా, 450 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ఈ సంస్థను విక్రయించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ఇది అయిదోసారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని