పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధి

టాటా గ్రూపునకు చెందిన ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 - 40 శాతం వృద్ధి నమోదు చేయనుంది. ఇది పరిశ్రమ సగటు వృద్ధి 20 శాతం కంటే అధికమని టాటా

Published : 09 Dec 2021 01:54 IST

విస్తరణకు రూ.488 కోట్లు సమీకరిస్తాం

 ‘కొవిడ్‌-19’ ఎంతో నష్టం చేసింది

 టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ నవీన్‌ తహిల్యాని

ఈనాడు - హైదరాబాద్‌

టాటా గ్రూపునకు చెందిన ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 - 40 శాతం వృద్ధి నమోదు చేయనుంది. ఇది పరిశ్రమ సగటు వృద్ధి 20 శాతం కంటే అధికమని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ అండ్‌ సీఈఓ నవీన్‌ తహిల్యాని తెలిపారు. కొత్త శాఖల ఏర్పాటు, పెద్ద సంఖ్యలో బీమా సలహాదార్లను నియమించడం, డిజిటల్‌ విక్రయాలు పెంచడం వల్లే అధిక వృద్ధి సాధ్యమవుతోందని వివరించారు. గత అయిదేళ్లలో 33 శాతం వార్షిక వృద్ధి నమోదు చేశామని, దేశంలోని 5 అతిపెద్ద జీవిత బీమా కంపెనీల్లో తమ కంపెనీ ఒకటని అన్నారు. తమ అజమాయిషీలో రూ.54,000 కోట్ల ఆస్తులున్నాయని, ఈ ఆస్తులకు ఫోర్‌/ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఉందని తెలిపారు. విస్తరణ అవసరాలకు అనుగుణంగా త్వరలో రూ.488 కోట్ల రుణం సమీకరించనున్నట్లు చెప్పారు. 2022 జనవరి- మార్చిలో జీవిత బీమా కొత్త పాలసీ తీసుకు వస్తామన్నారు.

‘కొవిడ్‌’ ప్రభావం

‘కొవిడ్‌-19తో గత-ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో బీమా క్లెయిములు పెరిగాయి. దానివల్ల రూ.400 కోట్ల మేరకు నష్టపోయామ’ని ఆయన చెప్పారు. 2019-20తో పోలిస్తే, 2020-21లో క్లెయిమ్‌లు 35 శాతం అధికంగా వచ్చాయని, ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇంకా పెరిగాయని చెప్పారు. తాము రూ.870 కోట్ల విలువైన క్లెయిములు పరిష్కరించామని, ఇందులో సగం ‘కొవిడ్‌’ బాధితులకు చెందినవేనని తెలిపారు. తమ క్లెయిముల పరిష్కార నిష్పత్తి 98 శాతం ఉందన్నారు. క్లెయిములు పెరగడంతో రీ-ఇన్సూరెన్స్‌ ప్రీమియం రేట్లు భారీగా పెరిగినట్లు తెలిపారు. ‘దేశీయ బీమా పరిశ్రమకు ఇది పెద్ద సమస్య’ అన్నారాయన. ‘ఒమిక్రాన్‌’ తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, మనదేశంలో ఎక్కువ మంది టీకా తీసుకున్నందున ముప్పు తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

బీమా చైతన్యం వచ్చింది, కానీ..

టర్మ్‌ బీమా కొనుగోలు చేసే వారి సంఖ్య, కొవిడ్‌ రెండో దశ నాటికి రెట్టింపు అయినట్లు నవీన్‌ తహిల్యాని వివరించారు. వ్యాధి తీవ్రత తగ్గాక బీమా పాలసీలు కొనుగోలు చేసే వారి సంఖ్య పలుచబడిందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని వివరించారు. బీమా ప్రాధాన్యంపై ప్రజల్లో కొంతమేరకు చైతన్యం వచ్చింది కాబట్టి, దీన్ని ఇంకా విస్తరించి ప్రజలందరికీ బీమా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకురావడానికి బీమా కంపెనీలు కృషి చేయాల్సి ఉందన్నారు. కొత్త పాలసీల ఆవిష్కరణ, సేవల పరిధి విస్తరించడమే ఇందుకు మార్గమని విశ్లేషించారు.

తెలుగు రాష్ట్రాలు ఎంతో ముఖ్యం

తమ మొత్తం వ్యాపారంలో 5.5 శాతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి లభిస్తోందని, సమీప భవిష్యత్తులో ఈ రాష్ట్రాల వాటా బాగా పెరిగే అవకాశం ఉందని నవీన్‌ తహిల్యాని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న 314 శాఖల్లో 22 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయన్నారు. ఇక్కడ కొత్త శాఖలు ప్రారంభించడంతో పాటు గత 3 నెలల్లో పెద్ద సంఖ్యలో బీమా సలహాదార్లను నియమించినట్లు వివరించారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో మొదటి ప్రీమియం ఆదాయం, మొత్తం వ్యాపారం పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని