మదుపు.. ఈ లెక్కలు చూశాకే..

ప్రతి రూపాయికీ ఒక లెక్క ఉండాలి. ఆర్థికంగా విజయం సాధించాలంటే పాటించాల్సిన మొదటి సూత్రం ఇది. దీంతోపాటు సంపాదించిన డబ్బును ఎలా దాచి పెట్టాలి, అది వృద్ధి చెందడానికి ఎంత సమయం ఇవ్వాలి అనేదీ కీలకమే.

Updated : 24 Dec 2021 08:24 IST

ప్రతి రూపాయికీ ఒక లెక్క ఉండాలి. ఆర్థికంగా విజయం సాధించాలంటే పాటించాల్సిన మొదటి సూత్రం ఇది. దీంతోపాటు సంపాదించిన డబ్బును ఎలా దాచి పెట్టాలి, అది వృద్ధి చెందడానికి ఎంత సమయం ఇవ్వాలి అనేదీ కీలకమే. ఈ నేపథ్యంలో ఆర్థిక ప్రణాళికలో ఎంతో ముఖ్యమైన కొన్ని నిష్పత్తులను చూద్దామా.

50 శాతం ఖర్చులకు..

ఆర్జించిన మొత్తం అంతా ఖర్చు చేయలేం. అలా అని దాచిపెట్టడమూ సాధ్యం కాదు. అందుకే, సంపాదించిన మొత్తంలో 50శాతం మించకుండా ఇంటి కోసం ఖర్చు చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంలో 20 శాతం స్వల్పకాలిక అవసరాలు, లక్ష్యాలకు పక్కన పెట్టాలి. అంటే, అత్యవసర నిధి ఇతర అవసరాలన్నమాట. ఇక మిగిలిన 30 శాతం దీర్ఘకాలిక ప్రణాళికతో మదుపు చేసుకోవాలి. ఇందులో పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల ఉన్నత చదువులు, ఏదైనా పెద్ద కొనుగోలు లాంటివి ఉండాలి. ప్రతి రూపాయికీ ఈ 50-20-30 నిబంధన పాటించాలి.

15తో కోటీశ్వరులు

కోటీశ్వరులు కావాలంటే.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు. ఒక వ్యక్తి నెలకు రూ.15,000 చొప్పున 15 ఏళ్లపాటు, 15 శాతం రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేస్తూ వెళ్లారనుకోండి.. చివరకు రూ.కోటికి పైగానే చేతిలోకి వస్తుంది. ఈ 15-15-15 సూత్రం రెండు రకాలుగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉపయోగపడటంతోపాటు, మంచి రాబడిని ఆర్జించేందుకూ అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్ల పనితీరు ఎంతో ఆసక్తికరంగా ఉంది. మార్కెట్లకు ఇబ్బంది ఉన్నా.. దీర్ఘకాలం మదుపు కొనసాగిస్తే.. సగటు ప్రయోజనంతో లాభాలు కనిపిస్తాయి.

రెట్టింపు ఎప్పుడు..

మన పెట్టుబడికి వచ్చిన రాబడి ఆధారంగా ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందని తెలుసుకునేందుకు 72తో రాబడి శాతాన్ని భాగించాలి. ఉదాహరణకు మీ పెట్టుబడిపై 8 శాతం రాబడి వస్తుందనుకుంటే.. 9 ఏళ్లలో మీ సొమ్ము రెట్టింపు (72/8=9) అవుతుందన్నమాట.

ఈక్విటీల్లో ఎంత?

ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు.. 100 నుంచి మీ వయసు తీసేయాలి. వచ్చిన అంకె ఆధారంగా మీ పెట్టుబడి మొత్తంలో ఈక్విటీ శాతం ఎంత అనేది నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు మీ వయసు 30 అనుకుంటే.. 70శాతం వరకూ ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టాలి. మిగతా 30 శాతాన్ని డెట్‌లోకి మళ్లించాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ నిష్పత్తినీ మారుస్తూనే ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని