Published : 18 Jan 2022 02:18 IST

పబ్లిక్‌ ఇష్యూ నిబంధనలు కఠినతరం

నిధుల వినియోగం, ఓఎఫ్‌ఎస్‌పై సెబీ నోటిఫికేషన్‌

దిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) నిబంధనలను మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ కఠినతరం చేసింది. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను గుర్తు తెలియని భవిష్యత్‌ కొనుగోళ్లకు ఉపయోగించడంపై; నిర్దిష్ట వాటాదార్లు ఆఫర్‌ చేసే షేర్ల సంఖ్య పైనా పరిమితులు విధించింది.  యాంకర్‌ ఇన్వెస్టర్ల లాకిన్‌ గడువును 90 రోజులకు పెంచింది. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించిన నిధులను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు పరిశీలిస్తాయని సెబీ స్పష్టం చేసింది. సంస్థాగతేతర మదుపర్లకు జరిగే కేటాయింపులను లెక్కించే పద్ధతిని సైతం సవరించింది. ఈ నిబంధనలన్నీ అమల్లోకి రావడం కోసం ఐసీడీఆర్‌(ఇష్యూ ఆఫ్‌ క్యాపిటల్‌ అండ్‌ డిస్‌క్లోజర్‌ రిక్వైర్‌మెంట్స్‌) రెగ్యులేషన్స్‌ కింద ఉండే పలు నిబంధనలను సెబీ సవరించాల్సి ఉంటుంది.

ఎందుకంటే..

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడం కోసం పలు కొత్త తరం సాంకేతికత కంపెనీలు మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది.

* పెట్టుబడుల లక్ష్యం, భవిష్యత్‌ కొనుగోళ్ల వివరాలు లేకుండా జరిపే కేటాయింపులతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాల(జీసీపీ) కోసం చేసే కేటాయింపులు.. మొత్తం నిధుల సమీకరణలో 35 శాతాన్ని మించకూడదు.

* కొనుగోళ్లు లేదా పెట్టుబడుల లక్ష్యం లేకుండా చేసే కేటాయింపులు.. మొత్తం నిధుల సమీకరణలో 25 శాతాన్ని అధిగమించరాదు.

* ఒక వేళ పెట్టుబడుల లక్ష్యం/కొనుగోళ్లను నిర్దిష్టంగా ప్రస్తావిస్తే మాత్రం ఈ పరిమితి వర్తించదు.

* సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం సమీకరించే మొత్తంపై ఏజెన్సీల పర్యవేక్షణ ఉంటుంది. వార్షిక పద్ధతికి బదులుగా త్రైమాసికం వారీగా ఈ మానిటరింగ్‌ ఏజెన్సీ నివేదికను ఆడిట్‌ కమిటీ పరిశీలనకు అందించాలి.

* షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు బదులుగా సెబీ వద్ద నమోదైన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ(సీఆర్‌ఏ)లు మానిటరింగ్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. ఈ పర్యవేక్షణ నిధుల వినియోగం 100 శాతం అయ్యేంత వరకు ఉంటుంది.

* ఏదైనా కంపెనీ ట్రాక్‌ రికార్డు లేకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌)కు సమర్పించే ముసాయిదా పత్రాల విషయంలోనూ కొన్ని షరతులను విధించింది. ఇష్యూకు ముందు కంపెనీలో 20 శాతం కంటే ఎక్కువ వాటా ఉంటే వాటాదార్లు.. ఓఎఫ్‌స్‌లో తమ షేర్లలో 50 శాతం కంటే ఎక్కువ విక్రయించుకోవచ్చు. 20 శాతం కంటే తక్కువ వాటా ఉన్న వారు ఓఎఫ్‌ఎస్‌లో 10 శాతం షేర్లను మాత్రమే అమ్ముకోవాల్సి ఉంటుంది.

* యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఉన్న 30 రోజుల లాకిన్‌ గడువు వారికి కేటాయించిన 50 శాతానికి కొనసాగుతుంది. మిగతా భాగానికి మాత్రం 90 రోజుల లాకిన్‌ వర్తించనుంది. 2022 ఏప్రిల్‌ 1, ఆ తర్వాత వచ్చే ఇష్యూలకు ఇది అమలు అవుతుంది.

* 2022 ఏప్రిల్‌ 1న లేదా ఆ తర్వాత వచ్చే బుక్‌-బిల్ట్‌ ఇష్యూల్లో సంస్థాగతేతర మదుపర్ల(ఎన్‌ఐఐలు)కు కేటాయించిన వాటాలో మూడో వంతును రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు దరఖాస్తు పరిమాణం ఉండే వారికి కేటాయిస్తారు. రూ.10 లక్షల కంటే పైన దరఖాస్తు పరిమాణం ఉండే వారికి మిగతా వాటాను కేటాయించొచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని