మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా

స్టాక్‌ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది.

Published : 10 May 2024 01:12 IST

మ్యూచువల్‌ ఫండ్లు

స్టాక్‌ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. అదే సమయంలో పరోక్షంగా షేర్లలో మదుపు చేసేందుకు వస్తున్న మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరులూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఫండ్‌ మదుపరులు పెట్టుబడులు ప్రారంభించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

 దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడిని ఆర్జించాలంటే.. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడులు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. షేర్ల మాదిరిగా వీటిని క్రమం తప్పకుండా గమనించాల్సిన అవసరం లేదు. నెలనెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి కోసం కేటాయించవచ్చు. ఈ ఫండ్లలో కొన్నింటిలో నష్టభయం ఎక్కువగా ఉంటుంది. మరికొన్ని సురక్షితంగా ఉంటాయి. కొన్ని దీర్ఘకాలం కోసం ఎంచుకోవాలి. మరికొన్ని స్వల్ప, మధ్యస్థ కాలాలకు అనుకూలంగా ఉంటాయి. ఏ తరహా ఫండ్లు ఎంచుకున్నప్పటికీ.. ఎంతోకొంత నష్టభయం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక రాబడికీ వీలుంటుంది. స్వల్ప నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేసినప్పుడు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకూ కొనసాగించవచ్చు. అదే అధిక నష్టభయం ఉన్న పథకాల్లో పెట్టుబడి పెడితే.. కనీసం మూడు నుంచి అయిదేళ్ల వరకూ దాన్ని కొనసాగించాలి. అప్పుడే మార్కెట్‌ అస్థిరతను తట్టుకొని, లాభాలను సాధించేందుకు వీలుంటుంది.

లాభంపై పన్ను లేకుండా..

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఈక్విటీ, డెట్‌ పథకాలకు వేర్వేరుగా పన్ను గణిస్తారు. నిర్ణీత డెట్‌ ఫండ్ల నుంచి వచ్చిన లాభాలను వ్యక్తిగత ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. అదే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల నుంచి వచ్చిన లాభాలను ఏడాది లోపు స్వీకరిస్తే.. ఆ మొత్తంపై 15 శాతం స్వల్పకాలిక మూలధన రాబడి పన్ను చెల్లించాలి. ఏడాదికి మించి కొనసాగించినప్పుడు దీర్ఘకాలిక మూలధన రాబడిగా పరిగణిస్తారు. అప్పుడు ఏడాదికి రూ.1,00,000కు మించి వచ్చిన లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మినహాయింపుతోపాటు..

ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి, పన్ను ఆదా చేసుకోవాలని భావించేవారు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) లేదా క్లోజ్డ్‌ ఎండెడ్‌ ఫండ్‌ పథకాల్లో మదుపు చేయాలి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు మూడేళ్ల లాకిన్‌ ఉంటుంది. క్లోజ్డ్‌ ఎండెడ్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు, నిర్ణీత కాలంపాటు కొనసాగించాల్సి ఉంటుంది. వీటిలో సాధారణంగా మూడు నుంచి అయిదేళ్ల వరకూ పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ఉండదు. కాబట్టి, మీ పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని ఈ తరహా పథకాల్లో మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు. వీటిలో క్రమానుగత పెట్టుబడి విధానంలో దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగిస్తే.. పన్ను ప్రయోజనాలతోపాటు, మంచి రాబడినీ సొంతం చేసుకోవచ్చు.

రుసుములు చూసుకోండి

కొన్ని పథకాల్లో అమ్మకపు రుసుము (ఎగ్జిట్‌ లోడ్‌) ఉంటుంది. ఉదాహరణకు కొన్ని ఈక్విటీ ఫండ్లు పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఏడాదిలోపు యూనిట్లను విక్రయిస్తే.. 1 శాతం వరకూ రుసుమును వసూలు చేస్తాయి. మీరు యూనిట్లను రిడీమ్‌ చేస్తున్న విలువపై ఈ అమ్మకపు రుసుము వర్తిస్తుంది. కాబట్టి, అధిక రాబడి రావాలంటే.. కనీసం ఎగ్జిట్‌ లోడ్‌ వ్యవధి ముగిసే వరకైనా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.

రాబడి మాటేమిటి?

మీరు పెట్టుబడి పెట్టిన ఫండ్‌ పనితీరు సరిగా లేనప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని అనుకుంటారు.. మార్కెట్‌ పరిస్థితుల కారణంగా తక్కువ రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. సూచీలు కుదుటపడ్డాక వేగంగా కోలుకుంటాయి. కాబట్టి, వెంటనే నిర్ణయానికి రాకుండా దీర్ఘకాలంలో ఫండ్‌ పనితీరు ఎలా ఉందో చూడండి. అదే విభాగంలోని ఇతర ఫండ్లతో పోల్చి చూడండి. ప్రామాణిక సూచీని అందుకోవడంలో విఫలం అయితే.. దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయండి. సూచీలకు అనుగుణంగానే రాబడిని అందిస్తుంటే కొంత కాలం వేచి చూడొచ్చు.
మీరు పెట్టుబడిని ప్రారంభించేటప్పుడే, దానికి ఒక లక్ష్యాన్ని అనుసంధానం చేయండి. ఎంచుకున్న పథకంలో అనుకున్న మొత్తం జమ అయ్యేదాకా వేచి చూడండి. చిన్న అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరికాదు. ఆశించిన మొత్తం సమకూరినప్పుడు ఆ ఫండ్‌ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలి. అప్పుడూ అవసరం ఉన్నంత మొత్తమే తీసుకోవడం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని