విమాన సేవలకు 5జీ గండం!

ప్రధాన విమానాశ్రయాలకు సమీపంలో కనుక టెలికాం సంస్థలు 5జీ సేవలు అందిస్తే, వేలసంఖ్యలో విమాన సర్వీసులు రద్దవ్వడమో, ఆలస్యం కావడమో జరుగుతుందని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. ఇందువల్ల ప్రయాణికులు, సరకు

Published : 19 Jan 2022 03:44 IST

అమెరికాలో సంస్థల ఆందోళన  

వాషింగ్టన్‌: ప్రధాన విమానాశ్రయాలకు సమీపంలో కనుక టెలికాం సంస్థలు 5జీ సేవలు అందిస్తే, వేలసంఖ్యలో విమాన సర్వీసులు రద్దవ్వడమో, ఆలస్యం కావడమో జరుగుతుందని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. ఇందువల్ల ప్రయాణికులు, సరకు రవాణా కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుందని విమానయాన సంస్థల సీఈఓలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో బుధవారం నుంచి కొత్త సీ-బ్యాండ్‌ 5జీ సేవలను వెరిజోన్‌, ఏటీ అండ్‌ టీ సంస్థలు ప్రారంభించనున్నాయి. విమాన తయారీ సంస్థలు, విమానయాన సంస్థల ఆందోళనతో 5జీ సేవల ప్రారంభాన్ని ఇప్పటికే రెండుసార్లు టెలికాం సంస్థలు వాయిదా వేశాయి. విమానాలు భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నాయో గణించేందుకు ఉపయోగపడే ఆల్టీమీటర్ల వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్‌ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే, అత్యంత వేగంగా డేటా బదిలీకి వీలు కల్పించే 5జీ సేవల స్పెక్ట్రమ్‌ ఫ్రీక్వెన్సీ ఉంటోంది. 3.7- 3.98 గిగాహెర్ట్జ్‌ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరిజోన్‌, ఏటీ అండ్‌ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.

సంక్షోభానికి అవకాశం: 5జీ సేవలు ప్రారంభించిన 36 గంటల్లోపే విమానయాన రంగంలో సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా విమాన సేవల సంస్థలు పేర్కొన్నాయి. బోయింగ్‌ 777ఎస్‌ వంటి విమానాలు ల్యాండింగ్‌ అయ్యే అవకాశం ఉండదని ఒక అధికారి తెలిపారు. బోయింగ్‌ కార్గో విమానాలు సైతం నిలిచిపోవచ్చని చెప్పారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) సూచనలకు అనుగుణంగా విమానాశ్రయాల రన్‌వే చుట్టూ రెండు మైళ్ల పరిధి వరకు మినహాయించి, 5జీ సేవలను ప్రారంభించాలని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా, యునైటెడ్‌, సౌత్‌వెస్ట్‌, యూపీఎస్‌, అలస్కా ఎయిర్‌, అట్లాస్‌ ఎయిర్‌, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్‌, ఫెడ్‌ఎక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి విమానయాన సంస్థలు.. శ్వేతసౌధ జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్‌, రవాణా కార్యదర్శి, ఎఫ్‌ఏఏ అడ్మినిస్ట్రేటర్‌, ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ ఛైర్‌వుమన్‌లకు లేఖ రాశాయి. ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా, 5జీ సేవలు ప్రారంభం కంటే ముందుగానే విమానాలను నిలిపివేయాలని సంస్థలు యోచిస్తున్నాయి. బుధవారం అమెరికాకు రావాల్సిన అంతర్జాతీయ విమానాలను సైతం రద్దు చేయాలని భావిస్తున్నాయి. ఈ సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని బోయింగ్‌ తెలిపింది.

తమ పరికరాలేవీ విమానాల ఎలక్ట్రానిక్స్‌కు ఆటంకం కలిగించబోవని ఏటీ అండ్‌ టీ, వెరిజోన్‌ తెలిపాయి. ఈ సాంకేతికతను అనేక దేశాల్లో సురక్షితంగా వినియోగిస్తున్నారనీ వివరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని