Jio: సముద్రం అడుగున కేబుల్‌.. మాల్దీవులకు జియో

దేశీయ దిగ్గజ మొబైల్‌ ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తాను అభివృద్ధి చేస్తున్న ఇండియా- ఏషియా- ఎక్స్‌ప్రెస్‌ (ఐఏఎక్స్‌) సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థను మాల్దీవుల్లోని హుల్‌హమాలేకు కూడా తీసుకెళ్లనుంది. అధిక డేటా సామర్థ్యం, అధిక వేగంతో కూడిన

Updated : 22 Feb 2022 09:24 IST

మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల్లో పోటీపడుతున్న రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు.. సముద్ర అడుగుభాగాన కేబుల్‌ వ్యవస్థల ఏర్పాటులోనూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు.

దిల్లీ: దేశీయ దిగ్గజ మొబైల్‌ ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తాను అభివృద్ధి చేస్తున్న ఇండియా- ఏషియా- ఎక్స్‌ప్రెస్‌ (ఐఏఎక్స్‌) సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థను మాల్దీవుల్లోని హుల్‌హమాలేకు కూడా తీసుకెళ్లనుంది. అధిక డేటా సామర్థ్యం, అధిక వేగంతో కూడిన ఐఏఎక్స్‌ వ్యవస్థ హుల్‌హుమాలేను భారత్‌, సింగపూర్‌లలోని ప్రపంచ దిగ్గజ ఇంటర్నెట్‌ హబ్‌లకు నేరుగా కలపనుంది. మాల్దీవులకు ఐఏఎక్స్‌ ప్రాజెక్టు అనుసంధాన్ని ఓషియన్‌ కనెక్ట్‌ మాల్దీవ్స్‌ సహకారంతో చేపడుతున్నట్లు జియో తెలిపింది. ఐఏఎక్స్‌ వ్యవస్థ ముంబయిలోని పశ్చిమ ప్రాంత నుంచి మొదలై  భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, మలేసియా, థాయ్‌లాండ్‌ ద్వారా సింగపూర్‌కు అనుసంధానం అవుతుందని పేర్కొంది. రిలయన్స్‌ జియో అభివృద్ధి చేస్తున్న మరో సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థ ఇండియా- ఐరోపా- ఎక్స్‌ప్రెస్‌ (ఐఈఎక్స్‌)ను ముంబయి నుంచి మిలాన్‌ వరకు అనుసంధానం చేయనుంది. సవోనా, ఇటలీ, మధ్య ప్రాచ్య, మధ్యధరా దేశాలను ఇది కలుపుకుంటూ పోతుంది. ఐఏఎక్స్‌ సేవలు 2023 చివరికల్లా, ఐఈఎక్స్‌ సేవలు 2024 మధ్య కల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ‘ఈ వ్యవస్థలు 16000 కి.మీ. పొడవునా, సెకనుకు 100 జీబీ వేగంతో 200 టెరాబైట్‌లకు పైగా డేటా సామర్థ్యాన్ని అందుబాటులోకి తెస్తాయ’ని జియో తెలిపింది.

సముద్రగర్భ కేబుల్‌ కన్సార్షియంలో ఎయిర్‌టెల్‌కు 20% వాటా: అధిక వేగవంత డేటా నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని విస్తరించుకోవడంలో భాగంగా ‘సీ-మీ-వీ-6’ సముద్రగర్భ కేబుల్‌ కన్సార్షియంలో భారతీ ఎయిర్‌టెల్‌ చేరింది. ఇందులో ప్రధాన పెట్టుబడిదారుగా కూడా ఉండనుంది. 2025లో అందుబాటులోకి రానున్న ఈ కేబుల్‌ కన్సార్షియంలో 20 శాతం పెట్టుబడిని ఎయిర్‌టెల్‌ పెట్టనుంది. ఈ బృందంలోని మిగిలిన 12 సభ్య సంస్థల్లో బంగ్లాదేశ్‌ సబ్‌మెరీన్‌ కేబుల్‌ కంపెనీ, దిరాగు (మాల్దీవులు), డిజిబౌటి టెలికాం, మొబైలీ (సౌదీ అరేబియా), ఆరెంజ్‌ (ఫ్రాన్స్‌), సింగ్‌టెల్‌ (సింగపూర్‌) శ్రీలంక టెలికాం, టెలికాం ఈజిప్ట్‌, టెలికాం మలేసియా, టెలిన్‌ (ఇండోనేషియా) ఉండనున్నాయి. 19200 కిలో మీటర్ల పొడవునా విస్తరించించే సీ-మీ-వీ-6.. సింగపూర్‌ నుంచి ఫ్రాన్స్‌ వరకు ఏర్పాటు కానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్‌ వ్యవస్థల్లో ఇది కూడా ఒకటి. సీ-మీ-వీ-6 ద్వారా తమ ప్రపంచ నెట్‌వర్క్‌కు 100 టెరాబిట్‌ల సామర్థ్యం అదనంగా చేరుతుందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని