పాస్‌వర్డ్‌ పంచుకోవడంపై నెట్‌ఫ్లిక్స్‌ ఆంక్షలు

జనవరి- మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌కు రెండు లక్షల మంది చందాదారులు తగ్గారు. గత పదేళ్లలో నెట్‌ఫ్లిక్స్‌ చందాదారులను కోల్పోవడం ఇదే మొదటిసారి.

Published : 21 Apr 2022 02:37 IST

వినియోగదారులు తగ్గడమే కారణం

శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా): జనవరి- మార్చిలో నెట్‌ఫ్లిక్స్‌కు రెండు లక్షల మంది చందాదారులు తగ్గారు. గత పదేళ్లలో నెట్‌ఫ్లిక్స్‌ చందాదారులను కోల్పోవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ ఎప్పటినుంచో తీసుకురావాలని భావిస్తున్న మార్పులపై దృష్టిపెట్టింది. ఖాతాను ఇతరులతో కలిసి వాడేందుకు పాస్‌వర్డ్‌ పంచుకోవడాన్ని పరిమితం చేయనుందని, ప్రకటనలతో కూడిన చౌక చందా పథకాలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, యాపిల్‌, వాల్ట్‌ డిస్నీ వంటి సంస్థలతో పోటీ కారణంగా గత త్రైమాసికంలో చందాదారులు తగ్గారని సంస్థ తెలిపింది.  కంపెనీ రష్యాలో సేవలు నిలిపివేసినందున 7 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య మరో 20 లక్షల మంది ఖాతాదారులు తగ్గొచ్చని అంచనా వేసింది. మార్చికి ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు 22.16 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. చందాదారులు తగ్గడంతో, బుధవారం షేరు విలువ 36 శాతం పతనమైంది. గత 4 నెలల్లో నెట్‌ఫ్లిక్స్‌ షేరు విలువ సగానికి పైగా తగ్గి, వాటాదార్ల సంపద 150 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 11.25 లక్షల కోట్ల) మేర హరించుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని