కష్టకాలమే

అంతర్జాతీయ మందగమనం, మండిపోతున్న ముడిచమురు ధరల వల్ల, దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిస్తోంది. అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు కూడా ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బ్యాంకులేమో రుణరేట్లు పెంచుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి గత అంచనాల కంటే తగ్గొచ్చని  మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. స్టాక్‌ మార్కెట్లు కూడా పతనమవుతున్నందున, మదుపర్ల సంపద హరించుకుపోతోంది.

Published : 12 May 2022 06:48 IST

ధరల మంట.. పొదుపు బాట
ఆరోగ్యంపై మాత్రం ఖర్చుకు వెనకాడట్లేదు
వినియోగదార్ల ధోరణిపై ఈవై నివేదిక

అంతర్జాతీయ మందగమనం, మండిపోతున్న ముడిచమురు ధరల వల్ల, దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదిస్తోంది. అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు కూడా ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు బ్యాంకులేమో రుణరేట్లు పెంచుతున్నాయి. ఫలితంగా ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి గత అంచనాల కంటే తగ్గొచ్చని  మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. స్టాక్‌ మార్కెట్లు కూడా పతనమవుతున్నందున, మదుపర్ల సంపద హరించుకుపోతోంది.

దిల్లీ: వస్తువులు, సేవల వ్యయాలు పెరుగుతుండడంపై భారత వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల అత్యవసరం కాని కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో మరింత పొదుపు చేయాలని భారత్‌లో 80 శాతం మంది భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది కాలంలో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఈవై ఫ్యూచర్‌ కన్జూమర్‌ ఇండెక్స్‌ తొమ్మిదో ఎడిషన్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభివృద్ధి చెందిన- వర్థమాన దేశాలతో పాటు భారత్‌లోని 1,000 మందికి పైగా వినియోగదార్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలివీ..
* వర్థమాన దేశాలు ధరల పెరుగుదలపై ఎక్కువ ఆందోళన చెందుతున్నాయి. వీటి వల్ల తమ ఎంపికలపై ప్రభావం (దక్షిణాఫ్రికా 77%, భారత్‌ 64%, బ్రెజిల్‌ 63%, చైనా 42%) పడుతోందని 62 శాతం మంది తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 45 శాతం(అమెరికా 50%, కెనడా 52%, బ్రిటన్‌ 42%, ఫ్రాన్స్‌ 40%)గా ఉంది.
* భారత్‌లో అధిక ధరల వల్ల మధ్యతరగతి (58%), అధికాదాయ వర్గాల(60%)తో పోలిస్తే అల్పాదాయ వర్గాలపై ఎక్కువ ప్రభావం (72%) పడుతుందని భావిస్తున్నారు.
* పెరుగుతున్న వ్యయాలను తట్టుకోవడం కోసం గతంలో కంటే అధికంగా పొదుపు చేయాలని భారత్‌లో 80 శాతం మందికి పైగా అభిప్రాయపడుతున్నారు. 50 శాతం మంది ఇప్పటికే పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి కొనసాగనుంది. నాణ్యమైన, సేంద్రియ ఆహారంపై మాత్రం ఎక్కువ ఖర్చు చేయనున్నారు.
* సగం మందికి పైగా ప్రజలు, వచ్చే 2-3 ఏళ్లలో శారీరక ఆరోగ్య లక్ష్యాలను పెట్టుకున్నారు. దీర్ఘకాలంలో శారీర ఆరోగ్యం(80%), మానసిక ఆరోగ్యం(78%)పై ఎక్కువ దృష్టి సారించనున్నారు.
* ధరలు పెరుగుతున్నందున, ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు తమ ఆదాయాలు, మార్జిన్లను నిలబెట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి రావొచ్చు.


మెరుగు పడుతుంది

అయితే భవిష్యత్తుపై ఇతర దేశస్థుల కంటే భారతీయులు ఆశావహంగా ఉన్నారు. వచ్చే ఏడాది కాలంలో ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయనే ఆశాభావాన్ని భారత్‌లో 77 శాతం మంది వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలా భావిస్తున్న వారు 48 శాతం మందే కావడం గమనార్హం.


భారత వృద్ధి 7.6 శాతం!

కోత విధించిన మోర్గాన్‌ స్టాన్లీ

దిల్లీ: ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాలకు భారత వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.6 శాతం, 2023-24లో 6.7 శాతంగా నమోదుకావొచ్చని సంస్థ తాజాగా అంచనా వేసింది. మునుపటి అంచనాలతో పోలిస్తే ఇవి 30 బేసిస్‌ పాయింట్లు (0.3 శాతం) తక్కువ. అంతర్జాతీయ మందగమనం, చమురు అధిక ధరలు ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఇవే పరిస్థితులు కొనసాగితే ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు వంటి ఆర్థిక సూచీలు మరింత దిగజారొచ్చని హెచ్చరించింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. భారత్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠానికి చేరేందుకు ఇది ప్రధాన కారణమైంది. ‘ధరలు బాగా పెరగడం, వినియోగదారు గిరాకీ బలహీనంగా ఉండటం, కఠిన ఆర్థిక పరిస్థితులు వంటివి వ్యాపార సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మూలధన రికవరీలో జాప్యానికి దారితీయొచ్చు’ అని భారత్‌కు మోర్గాన్‌ స్ట్టాన్లీ ముఖ్య ఆర్థికవేత్త ఉపాసనా చాచ్ర పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెల ప్రారంభంలో రెపో రేటును 0.4 శాతం పెంచింది. ఫలితంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణరేట్లను పెంచుతున్నాయి. జూన్‌, ఆగస్టు పరపతి సమీక్షల్లో కూడా కీలకరేటును ఆర్‌బీఐ మరో 0.5 శాతం చొప్పున పెంచొచ్చని, డిసెంబరుకు రెపో రేటు 6 శాతానికి చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ లక్ష్యాలను పెంచడంతో పాటు, కీలక రేట్ల పెంపునూ జూన్‌ 6-8 తేదీల్లో జరిపే ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ చేపట్టవచ్చని సమాచారం. 2022-23కు 4.5 శాతం అనుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలను ఇప్పటికే 5.7 శాతానికి సవరించిన సంగతి విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని