జూన్‌ వరకు ఆగితే మరిన్ని కఠిన నిర్ణయాలు తప్పవు

జూన్‌ పరపతి విధాన సమీక్ష వరకు వేచి ఉండకుండా.. ముందుగానే కీలక రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడం వెనక ‘ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, మధ్యకాల వృద్ధి అవకాశాలను పటిష్ఠం చేయడం

Published : 19 May 2022 02:42 IST

 అందుకే ముందుగానే కీలక రేట్ల పెంపు

ఎంపీసీ సమావేశ ముఖ్యాంశాల వెల్లడి 

ముంబయి: జూన్‌ పరపతి విధాన సమీక్ష వరకు వేచి ఉండకుండా.. ముందుగానే కీలక రేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడం వెనక ‘ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, మధ్యకాల వృద్ధి అవకాశాలను పటిష్ఠం చేయడం, బలహీన వర్గాల కొనుగోలు శక్తిని పరిరక్షించాలన్నదే’ తమ ఉద్దేశమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. మే 2-4న జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశ వివరాలను బుధవారం విడుదల చేసింది. ‘జూన్‌ పరపతి విధాన సమీక్ష వరకు వేచిచూస్తే సమయాన్ని వృథా చేసినట్లు అవుతుంది. రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. అప్పుడు జూన్‌లో మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంద’ని మే 4న కీలక రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎంపీసీ సభ్యులతో ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత్‌ దాస్‌ చెప్పారు. కీలక రేట్లను పెంచుతూ ఎంపీసీ సభ్యులు తీసుకున్న నిర్ణయం కంటే, ఆ నిర్ణయం తీసుకున్న సమయంపై మార్కెట్‌ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. కీలక రేట్లను సాధ్యమైనంత త్వరగా 100 బేసిస్‌ పాయింట్ల మేర పెంచాల్సిన అవసరం ఉందని ఎంపీసీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన అయిదుగురు సభ్యుల మాదిరిగానే.. రెపో రేటును 0.40 శాతం పెంచే ప్రతిపాదనకే ఆయన ఓటేశారు. కమొడిటీ ధరలు, ద్రవ్యోల్బణంపై రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం కారణంగా.. నిర్దేశిత సమయం కంటే ముందే (ఆఫ్‌- సైకిల్‌) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించి, నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దాస్‌ తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం కొనసాగితే పొదుపు మొత్తాలు, పెట్టుబడులు, పోటీతత్వం, వృద్ధిపై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పేదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు కొనసాగినంత వరకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి ఉంటుందని ఎంపీసీ సభ్యుడు, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నరు మైఖేల్‌ దేవవ్రత పాత్ర అన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలతో వాస్తవిక స్థూల ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడం, నిర్వహించడం సవాలుగా మారిందని ఎంపీసీలోని మరో సభ్యుడు, ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ రంజన్‌ అభిప్రాయపడ్డారు. ఎంపీసీ తదుపరి సమావేశం జూన్‌ 6 నుంచి 8 వరకు జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని