వాహన టోకు సరఫరాలు అదుర్స్‌

దేశ వ్యాప్తంగా ప్రయాణికుల వాహనాలకు గిరాకీ పెరగడంతో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌లు మే నెలలో డీలర్లకు వాహనాల సరఫరాను గణనీయంగా పెంచాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, కియా ఇండియా,

Published : 02 Jun 2022 02:48 IST

ప్రయాణికుల వాహనాలకు భారీ గిరాకీ
మారుతీ, టాటా, హ్యుందాయ్‌ జోరు

దిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రయాణికుల వాహనాలకు గిరాకీ పెరగడంతో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌లు మే నెలలో డీలర్లకు వాహనాల సరఫరాను గణనీయంగా పెంచాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌, హోండా కార్స్‌, స్కోడా కంపెనీల మోడళ్లకూ గత నెలలో బలమైన గిరాకీ కనిపించింది. దేశీయ టోకు విక్రయాల్లో హ్యుందాయ్‌ కంటే టాటా మోటార్స్‌ ముందే ఉంది. మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విక్రయాలు మే నెలలో 1,34,222గా నమోదయ్యాయి. కొవిడ్‌-19 రెండో దశ విజృంభణతో 2021 మేలో కంపెనీ 35,293 వాహనాలనే డీలర్లకు సరఫరా చేసింది.  

ప్రయాణికుల వాహనాలు 2.94 లక్షలు

* 2021 మేలో 1.03 లక్షల ప్రయాణికుల వాహనాలే కంపెనీల నుంచి డీలర్లకు చేరగా, ఈ ఏడాది మేలో    2.94 లక్షల వాహనాలు సరఫరా అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-మే నెలల్లో కలిపి మొత్తం 5.88 లక్షల వాహనాలు అమ్ముడుపోయాయి. 2021 ఇదే కాలంలో 3.9 లక్షల వాహనాలే డీలర్లకు చేరాయి. 2022-23 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) 9 లక్షల టోకు విక్రయాలను చేరొచ్చన్నది పరిశ్రమ వర్గాల అంచనా .

* మారుతీ చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌ప్రెసో విక్రయాలు 4,760 నుంచి 17,408కు పెరిగాయి. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ మోడళ్ల విక్రయాలు 20,343 నుంచి 67,947కు చేరాయి.  

* టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు 43,341కు చేరాయి. దేశీయ విపణిలో ఇప్పటి వరకు కంపెనీకి ఇవే అత్యధిక విక్రయాలు. విద్యుత్‌ వాహనాల సరఫరా 476 నుంచి 3,454కు చేరింది.

* హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా దేశీయ టోకు విక్రయాలు 42,293కు చేరాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు 26,904గా నమోదయ్యాయి. కియా ఇండియా సరఫరాలు 11,050 నుంచి 18,718కు చేరాయి. టయోటా టోకు విక్రయాలు 707 నుంచి 10,216కు దూసుకెళ్లాయి.  

* ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో దేశీయ విక్రయాలు 60,830 నుంచి 1,12,308కు చేరాయి. టీవీఎస్‌ విక్రయాలు 52,084 నుంచి 1,91,482కు రాణించాయి. హోండా మోటార్‌ టోకు విక్రయాలు 3,53,188కి చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని