టాటా మోటార్స్‌లో నియామకాలు

విద్యుత్‌ వాహనాల (ఈవీ)తో పాటు వివిధ వ్యాపార విభాగాల సామర్థ్యాలను మరింత పటిష్టం చేయడానికి టాటా మోటార్స్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజా నియామకాలతో పాటు, ప్రస్తుత ఉద్యోగుల

Published : 06 Jun 2022 02:00 IST

ఆర్‌అండ్‌డీ ని బలోపేతం చేస్తాం
ప్రస్తుత ఉద్యోగులకూ నైపుణ్య శిక్షణ  
ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర

దిల్లీ: విద్యుత్‌ వాహనాల (ఈవీ)తో పాటు వివిధ వ్యాపార విభాగాల సామర్థ్యాలను మరింత పటిష్టం చేయడానికి టాటా మోటార్స్‌ సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తాజా నియామకాలతో పాటు, ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగు పరచనుంది. పరిశోధన-అభివృద్ధి విభాగాన్ని (ఆర్‌అండ్‌డీ) బలోపేతం చేసేందుకు నియామకాలు చేపడుతున్నట్లు కంపెనీ ప్రయాణికుల-విద్యుత్తు వాహన విభాగాల అధిపతి శైలేష్‌ చంద్ర వెల్లడించారు. ఈ విభాగ ఇంజినీర్ల నైపుణ్యాలు మెరుగుపరచే యత్నాలు చేస్తామన్నారు. ఈవీ విభాగంలో బ్యాటరీ ప్యాక్‌లతో పాటు మోటార్‌ డిజైన్‌, వాహన ఆర్కిటెక్చర్‌లో తన నైపుణ్యాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ విభాగాల్లో..

వచ్చే కొన్నేళ్లపాటు వృద్ధి, వ్యాపార ప్రణాళికల్లో భాగంగా అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్‌, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌, సప్లయ్‌ చైన్‌, కార్యకలాపాలు, వాణిజ్య విభాగాల్లో వివిధ స్థాయుల్లో ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు కంపెనీ తెలిపింది. జేఎల్‌ఆర్‌ వంటి ఇతర గ్రూప్‌ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తామని పేర్కొంది. ఈవీల్లో బ్యాటరీ ప్యాక్‌ల సామర్థ్యాలను పెంచడం, మోటార్‌ డిజైన్‌, కొత్త ఆర్కిటెక్చర్లు, ఇతర క్లిష్టమైన కార్యాచరణలపై దృష్టి పెడుతున్నట్లు వివరించింది.


1100 ఉద్యోగాలు: సన్‌ ఫార్మా

దిల్లీ: దేశీయ విపణిలో క్షేత్రస్థాయి సిబ్బందిని ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం పెంచుకోవాలని ఔషధ సంస్థ సన్‌ ఫార్మా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం కలిగించడం, భౌగోళిక విస్తరణ వంటి లక్ష్యాల కోసం ఈ నియామకాలు జరుపుతామని కంపెనీ సీఈఓ (భారత వ్యాపారం) కీర్తి గనోర్కర్‌ వెల్లడించారు. ప్రపంచంలోనే స్పెషాల్టీ జెనరిక్‌ ఔషధాల తయారీలో అతి పెద్ద నాలుగో సంస్థగా పేరున్న సన్‌ ఫార్మాకు మన దేశంలో 11,000 మంది మెడికల్‌ రెప్రెజెంటేటివ్‌లు (ఎంఆర్‌లు), సంబంధిత సిబ్బంది ఉన్నారు. వీరికి మరో 1100 మందిని జతచేసుకుంటామని సంస్థ తెలిపింది. 2021-22లో కంపెనీ భారత ఫార్ములేషన్ల విక్రయాలు 23 శాతం పెరిగి రూ.12,759 కోట్లకు చేరాయి. 2022 మార్చి త్రైమాసికంలో ఫార్ములేషన్ల ఆదాయం 16 శాతం పెరిగి రూ.3,096 కోట్లకు చేరింది. సన్‌ ఫార్మాకు 40కు పైగా తయారీ ప్లాంట్లు ఉండగా, అంతర్జాతీయంగా 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22లో ఆదాయం 500 కోట్ల డాలర్ల  (రూ.38,500 కోట్లు) మైలురాయిని అధిమించగా, సర్దుబాటు చేసిన నికర లాభం 100 కోట్ల డాలర్లను (రూ.7,700 కోట్లు) దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని