అమెరికాకు 175 కొత్త ఔషధాలు

తన వార్షికాదాయాల్లో మూడోవంతు వాటా కలిగిన ఉత్తర అమెరికా విపణిలోకి 175 కొత్త ఔషధాలను విడుదల చేయనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో రెండంకెల

Published : 23 Jun 2022 06:32 IST

దేశీయంగా కంపెనీలు-బ్రాండ్ల కొనుగోలుకూ వీలు
బయోసిమిలర్‌, సీడీఎంఓ విభాగాలపై దృష్టి: డాక్టర్‌ రెడ్డీస్‌

ఈనాడు, హైదరాబాద్‌: తన వార్షికాదాయాల్లో మూడోవంతు వాటా కలిగిన ఉత్తర అమెరికా విపణిలోకి 175 కొత్త ఔషధాలను విడుదల చేయనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. దీంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాల్లో రెండంకెల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం 25 శాతం ఎబిటా (వడ్డీ, పన్ను, తరుగుదల, ఇతర కేటాయింపుల కంటే ముందు ఆదాయం) మిగులు సాధించాలని భావిస్తున్నట్లు ‘ఇన్వెస్టర్ల సమావేశం’లో డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం వెల్లడించింది. ప్రధానంగా బయోసిమిలర్‌ ఔషధాలు, సీడీఎంఓ (కాంట్రాక్టు అభివృద్ధి, తయారీ సేవలు), చిన్న-పెద్ద మాలిక్యూల్స్‌ ఆధారిత మందులపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని, ఈ విభాగాల నుంచి సమీప భవిష్యత్తులో అధిక వృద్ధి సాధించే అవకాశం ఉందని సంస్థ వివరించింది.
డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సర (2021-22) ఆదాయాల్లో 12 శాతం వృద్ధి కనబరచింది. ఎబిటా మిగులు 21.2 శాతంగా ఉంది. వీటిని పెంచుకునేందుకు, ప్రస్తుత వ్యాపార విభాగాల్లో విస్తరించడంతో పాటు కొత్త ఔషధ విభాగాలు, విపణుల్లోకి అడుగుపెట్టాలని కంపెనీ భావిస్తోంది. 25 శాతం ఆర్‌ఓసీఈ (రిటర్న్‌ ఆన్‌ కేపిటల్‌ ఎంప్లాయ్‌డ్‌) నమోదు చేయాలనే ఆలోచనను  యాజమాన్యం వెలిబుచ్చింది.

కొత్త విభాగాల నుంచే నాలుగో వంతు ఆదాయం:  కొత్తగా ఇమ్యునో- ఆంకాలజీ ఎన్‌సీఈ (న్యూ కెమికల్‌ ఎంటిటీస్‌) ఔషధాలను ఆవిష్కరించే దిశగా డాక్టర్‌ రెడ్డీస్‌ అడుగులు వేస్తోంది. దీర్ఘకాలంలో నూట్రాస్యూటికల్స్‌, సెల్‌ జీన్‌ థెరపీ, డిసీజ్‌ మేనేజ్‌మెంట్‌.. విభాగాల్లో క్రియాశీలక సంస్థగా మారాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయిదేళ్లలో వార్షిక ఆదాయాల్లో దాదాపు నాలుగో వంతు కొత్త ఔషధ విభాగాల నుంచి లభిస్తుందని అంచనా. ఇందుకోసం పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించింది.

అమెరికాలో నియామకాలు: ఉత్తర అమెరికాలో 175 కొత్త ఔషధాలను విడుదల చేసేందుకు వీలుగా మార్కెటింగ్‌ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇందులో 90 ఔషధాలకు మార్కెటింగ్‌ అనుమతుల కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డిఏ వద్ద దరఖాస్తు చేసింది. వీటిల్లో బయోసిమిలర్‌ ఔషధాలు, పెప్టైడ్లు, అత్యంత సంక్లిష్ట సాంకేతిక నైపుణ్యం అవసరమైన ఔషధాలు ఉన్నాయి. ప్రస్తుతం డాక్టర్‌ రెడ్డీస్‌ వార్షికాదాయాల్లో ఉత్తర అమెరికా ఆదాయాల వాటా 35 శాతం ఉంది. చైనా, బ్రెజిల్‌, కొన్ని ఐరోపా దేశాల్లో అమ్మకాలు పెంచుకోవడం పైనా కంపెనీ కసరత్తు చేస్తోంది.

దేశీయ విపణిపైనా దృష్టి: కొంతకాలంగా డాక్టర్‌ రెడ్డీస్‌ దేశీయ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరిస్తోంది. మనదేశంలో ప్రస్తుతం మందుల అమ్మకాల పరంగా చూస్తే 10వ స్థానంలో సంస్థ ఉంది. మొదటి-5 కంపెనీల జాబితాలో  చేరాలనేది కంపెనీ లక్ష్యం. ఇప్పటికే ఉన్న ఔషధ విభాగాల్లో బలోపేతం కావడంతో పాటు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇతర కంపెనీలు లేదా బ్రాండ్లు కొనుగోలు చేయడం ద్వారా సత్వర వృద్ధి సాధించే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచన ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని