Updated : 05 Jul 2022 07:27 IST

హోటళ్లు, రెస్టారెంట్లు.. సేవా రుసుం వసూలు చేయొద్దు

సీసీపీఏ

దిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు సేవా రుసుము వసూలు చేయకుండా నిషేధం విధించినట్లు కేంద్ర వినియోగదారు హక్కుల పరిరక్షణా సంస్థ (సీసీపీఏ) సోమవారం తెలిపింది. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించినట్లు గుర్తిస్తే ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. ఆహార పదార్థాల బిల్లుపై అదనంగా 10 శాతం సేవా రుసుము కలిపి, ఈ మొత్తంపై జీఎస్‌టీ (వస్తు సేవా పన్ను) వసూలు చేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో.. ‘అనైతిక వ్యాపార విధానాలు, వినియోగదారు హక్కుల ఉల్లంఘన’ను నియంత్రించేందుకు సీసీపీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. ఏ రెస్టారెంటు లేదా హోటల్‌ తమ ఆహార పదార్థాల బిల్లులో సేవా రుసుమును కలపకూడదు. ఇతరత్రా ఏ పేరుతోనూ ఈ రుసుము వసూలు చేయకూడదు. వినియోగదారులను సేవా రుసుము కట్టమని ఒత్తిడి చేయకూడదు. బిల్లులో సేవా రుసుము కలిపి, ఆ మొత్తానికి జీఎస్‌టీ విధించకూడదు. ‘సేవా రుసుము ఇవ్వాలా వద్దా అనేది వినియోగదారు ఇష్టం. వారి విచక్షణపైనే అది ఆధారపడి ఉంటుంద’ని తాజా మార్శదర్గకాలు స్పష్టం చేస్తున్నాయి.

* ఏదేని హోటల్‌ లేదా రెస్టారెంటు సేవా రుసుము విధిస్తే.. దానిని బిల్లులో నుంచి తొలగించమని వినియోగదారులు అడగొచ్చు. 1915కు కాల్‌ చేసి లేదంటే లేదా ఎన్‌సీహెచ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా నేషనల్‌ కన్జూమర్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

* ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఇ-డాఖిల్‌ పోర్టల్‌ ద్వారా వినియోగదారుల కమిషన్‌ వద్ద కూడా ఫిర్యాదులు దాఖలు చేయొచ్చు.

* ఇలాంటి వ్యవహారాలపై దర్యాప్తు జరపాల్సిందిగా సంబంధిత కలెక్టరునూ కోరొచ్చు. సీసీపీఐకు ఇ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు పంపించవచ్చు.

ఈ నిర్ణయం ఎందుకంటే

‘ఒక వస్తువు విక్రయ ధరలో వస్తువు, సేవల విభాగం రెండూ కలిసే ఉంటాయి. ఫలానా ఆహార పదార్థం లేదంటే పానీయానికి ధర నిర్ణయించే విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలాంటి ఆంక్షలు లేవు. అందువల్ల మెనూలో పొందుపర్చిన ఆహార పదార్థాలకు ఆర్డరు ఇచ్చినప్పుడు దాని ధర, వర్తించే పన్నులు కలిసే ఉంటాయి. అంతకుమించి అదనంగా వసూలు చేస్తే అది అనైతిక వ్యాపార విధానం కిందకు వస్తుంద’ని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఆహార పదార్థాలను తిన్న తర్వాత.. దాని నాణ్యత, హోటల్‌ సిబ్బంది అందించిన సేవల ఆధారంగా టిప్‌ ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై వినియోగదారు నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి. అందువల్ల సేవా రుసుమును బిల్లులో కలపడం వినియోగదారు హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని వెల్లడించాయి.

‘ మార్గదర్శకాలను క్షుణ్నంగా అధ్యయనం చేస్తాం. మేం తప్పకుండా ప్రభుత్వాన్ని కలిసి మా అభిప్రాయాన్ని చెబుతాం. ఎందుకంటే మా రంగం ఒక్క దానినే దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతర రంగాల విషయంలోనూ అలాగే వ్యవహరించాలి. మీరు ఏమైనా నియమ నిబంధనలు తేవాలనుకుంటే.. ఒక చట్టాన్ని తయారు చేయండి. దానిని అందరూ పాటించేలా చూడాల’ని హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షుడు గుర్బాక్షిష్‌ సింగ్‌ కోహ్లి అన్నారు.


విలాస, హానికారక ఉత్పత్తులపై 28% జీఎస్‌టీ కొనసాగుతుంది

రెవెన్యూ కార్యదర్శి

విలాస వస్తువులు, హానికారక ఉత్పత్తులపై జీఎస్‌టీ అత్యధిక శ్లాబ్‌ అయిన 28 శాతాన్ని ప్రభుత్వం కొనసాగించే ఉద్దేశంలోనే ఉందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ వెల్లడించారు. ఆర్థిక అసమానతలు ఉన్న దేశంలో ఈ తరహా వస్తువులకు అధిక పన్ను రేటు ఉండాలని తెలిపారు. అయితే మిగిలిన మూడు శ్లాబ్‌ (5%, 12%, 18%)లను రెండుకు పరిమితం చేసే విషయంలో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చి అయిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో,  పన్ను రేట్ల హేతుబద్దీకరణను జీఎస్‌టీ మండలి చేపట్టిందని తెలిపారు. ఆదాయ తటస్థ స్థాయైన 15.5 శాతానికి పన్ను రేట్లను పెంచేందుకు విధానకర్తలకు మంత్రశక్తులేవీ లేవని ఆయన పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని