Published : 26 Dec 2020 17:28 IST

ప్రపంచం మెచ్చిన సారథులు!

బ్యాంకింగ్‌, ఆర్థికం, సాంకేతికం, వైద్యం... ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా, తమ సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నవారిలో మహిళలే ముందుంటారు. మన దేశంలో అలా వివిధ సంస్థలకు నాయకత్వం వహిస్తూ తమ ఉనికిని ప్రపంచానికి చాటుతున్న కొందరు శక్తిమంతమైన మహిళా సారథులు...


నివృతి రాయ్‌...

ఇంటెల్‌ ఇండియా కంట్రీహెడ్‌గా, ఇంటెల్‌ డేటాసెంటర్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఓరెగన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పీజీ చేసిన నివృతి... తక్కువ జీతంతో ఓ మామూలు ఉద్యోగినిగా ఇంటెల్‌లో చేరారు. ఇంటెల్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఏర్పాటులో, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5జీ, క్లౌడ్‌ టెక్నాలజీని విస్తృతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత బృందంతో కలిసి సెన్సర్‌హబ్‌ని అందుబాటులోకి తెచ్చిన నివృతి... 2019 ఫార్చ్యూన్‌ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకుకున్నారు.


పద్మజా చుండూరు

ఇండియన్‌ బ్యాంక్‌ సీఈవోగా నియమితురాలైన తెలుగింటి ఆడపడుచు. 1984లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పద్మజ... ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో పీజీ పూర్తిచేశారు. మూడు దశాబ్దాలకు పైగానే బ్యాంకింగ్‌ రంగంలో అపారమైన ఉద్యోగానుభవం ఉన్న పద్మజ భారత్‌లోనే కాదు... అమెరికాలోనూ పలు పదవుల్ని అధిరోహించారు. యుఎస్‌ఐబీసీ బ్యాంకింగ్‌ కమిటీలో సభ్యురాలిగా, న్యూయార్క్‌ ఇంటర్నేషనల్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ బోర్డ్‌కి ట్రస్టీ సభ్యురాలిగానూ చేశారు. విదేశాల్లో పనిచేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, అదే ఉన్నతస్థాయికి చేరుకునేలా చేసిందనీ చెబుతారు పద్మజ.


వాణీకోలా...

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆర్థికంగా సాయం చేసే కలారీ క్యాపిటల్‌కి మేనేజింగ్‌ డైరెక్టర్‌. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వాణీకోలా... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా అందుకున్నారు. ఇరవైరెండేళ్లు సిలికాన్‌వ్యాలీలో పనిచేసిన వాణి... 2006లో భారత్‌కు తిరిగొచ్చాక కొన్నాళ్లు న్యూ ఎంటర్‌ప్రైజ్‌ అసోసియేట్స్‌లో పార్ట్‌నర్‌గా చేరారు. ఆరేళ్ల తరువాత ఆ సంస్థనే కలారీ క్యాపిటల్‌గా మార్చారు. అప్పటికి ఆ సంస్థ నిధులు వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే. ఆమె నాయకత్వంలో 2017 నాటికి అవి 4600 కోట్ల రూపాయలకు పెరిగాయి. క్యూర్‌ఫిట్‌, స్నాప్‌డీల్‌, మింత్రా, అర్బన్‌ లాడర్‌... వంటి సంస్థలు కలారీ క్యాపిటల్‌ సహకారంతో ఎదిగినవే.


రోషిణీ నాడార్‌ మల్హోత్రా...

హెచ్‌సీఎల్‌కి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, సీఈవోగా, వైస్‌ఛైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు చేపట్టారు రోహిణి. 2019లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన వందమంది మహిళల జాబితాలో యాభైనాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. దిల్లీలో పెరిగిన ఆమె నార్త్‌ వెస్ట్రన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌ నుంచి సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ స్ట్రాటజీ అంశంగా ఎంబీఏ పూర్తిచేశారు. ఇతర కంపెనీల్లో కొన్నాళ్లు పనిచేశాకే సొంత సంస్థలో చేరిన రోషిణీ హెచ్‌సీఎల్‌ ప్రారంభించిన తన తండ్రి శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌కి ట్రస్టీగానూ బాధ్యతలు చేపట్టారు. సంస్థలో స్ట్రాటజీ మేనేజిమెంట్‌ మొదలు ఎన్నో అంశాల్లో సత్తా చాటుతున్నారు.


సునీతారెడ్డి...

అపోలో హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సునీతను ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్‌రెడ్డి అపోలో లక్ష్మిగా సంబోధిస్తారు. ఫైనాన్స్‌హెడ్‌గా అపోలోలో కొన్నాళ్లు పనిచేసిన తరువాత ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలోని ‘అపోలో రీచ్‌ హాస్పిటల్స్‌ మోడల్‌’ నిర్వాహకురాలిగానూ వ్యవహరించారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కంపెనీల్లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. తన కృషితో సంస్థను లాభాలబాట పట్టించిన సునీత ఫార్చ్యూన్‌ఇండియా విడుదల చేసిన మోస్ట్‌ పవర్‌ఫుల్‌ విమెన్‌ జాబితాలో కిందటేడాది చోటు దక్కించుకున్నారు. ఈ రోజుల్లో వ్యాపారం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు... సామాజిక సేవ కూడా అందులో భాగమేనని చెబుతూ... ఎంతోమంది పేదలకు తమ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్యసాయం అందేలా చేశారు.


కిరణ్‌ మజుందార్‌ షా...

బయోకాన్‌ వ్యవస్థాపకురాలిగానే కాదు, భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగానూ గుర్తింపు ఈమె సొంతం. ఫైనాన్షియల్‌ టైమ్స్‌, ఫోర్బ్స్‌ జాబితా ఇలా వివిధ సంస్థలు విడుదల చేసే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రతిఏటా చోటు దక్కించుకోవడంలో ఆమెకు ఆమే సాటి. మహారాష్ట్రలో పుట్టి పెరిగిన కిరణ్‌ తండ్రి సలహాతో మెల్‌బోర్న్‌లోని బాలరాట్‌ యూనివర్సిటీ నుంచి మాల్టింగ్‌ అండ్‌ బ్రూయింగ్‌ చదివారు. వివిధ సంస్థల్లో పనిచేశాక బయోకాన్‌ ఇండియాను తన ఇంటి గ్యారేజీలో ప్రారంభించారు. ఇప్పుడు బయోకాన్‌ ఆసియాలోనే ఎక్కువమొత్తంలో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే సంస్థగా గుర్తింపు సాధించింది.

 
 
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని