మార్కెట్‌ జోరులో.. జాగ్రత్త..

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48,000లు దాటేసింది....

Updated : 08 Jan 2021 16:06 IST

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు జీవన కాల గరిష్ఠాలను చేరుకున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48,000లు దాటేసింది. కరోనా మహమ్మారి వల్ల 2020 ప్రారంభంలో సంక్షోభం ఎదుర్కొన్న మార్కెట్‌ 26,000 పాయింట్లకు పడిపోయింది. ఆ తర్వాత కోలుకొని, దాదాపు 80శాతం వృద్ధి చెందింది. కరోనా టీకాలు రావడం, విదేశీ పెట్టుబడులు రావడం మార్కెట్‌కు ఊతం ఇస్తున్నాయి. త్వరలోనే సెన్సెక్స్‌ 50,000లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? అనిశ్చితి నుంచి మార్కెట్‌ వృద్ధి వరకూ మనకు నేర్పిన పాఠాలేమిటి? చూద్దాం..

లక్ష్యం చేరుకునేలా...
స్టాక్‌ మార్కెట్‌ జోరు మీద ఉన్న నేపథ్యంలో చాలామంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అయితే, మదుపు చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఏ లక్ష్యం కోసం పెట్టుబడులు పెడుతున్నారు? ఎన్నాళ్లపాటు కొనసాగిస్తారు? ఎంత వరకూ నష్టభయం భరించగలరు.. అనిశ్చితి వస్తే ఎలా స్పందిస్తారు అనే అంశాల ఆధారంగా పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒక లక్ష్యం కోసం అనుకొని, మదుపు చేసినప్పుడే విజయం సాధించగలరనే సంగతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రణాళిక లేకుండా మదుపు చేస్తే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మీ ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకునేందుకు కష్టం కావచ్చు. ఇలాంటప్పుడు ఆర్థిక ప్రణాళికల నిపుణులను సంప్రదించేందుకు మొహమాటపడొద్దు.
ట్రేడింగ్‌ చేస్తుంటే..
స్టాక్‌ మార్కెట్లో రోజువారీ లావాదేవీలు చేయాలని అనుకుంటున్నారా? దీర్ఘకాలం కొనసాగాలా? దీన్ని ముందుగా నిర్ణయించుకోండి. ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాలున్నాయి. స్వల్పకాలంలో మదుపు చేసినప్పుడు లాభాలు వచ్చినా.. నష్టాల తీవ్రతా అదే విధంగా ఉంటుంది. స్వల్పకాలంలో మదుపు చేయాలనుకునే ట్రేడర్లకు మార్కెట్‌ గురించి పూర్తి అవగాహన ఉండాలి. కంపెనీల గురించి పరిశోధన చేయాలి. ఆయా రంగాలు, ప్రభుత్వ పాలసీలు, మార్కెట్‌ పోకడలు, ఆర్థిక వ్యవస్థ పనితీరు ఇలా అనేక రకాల అంశాలపై పట్టు సాధించాలి. లేదా పూర్తిగా అదృష్టంపైనే లాభాలు ఆధారపడి ఉంటాయి. ఇది అందరికీ సాధ్యం కాదు. మీరు మార్కెట్లో కొత్తగా ప్రవేశిస్తే.. మ్యూచువల్‌ ఫండ్ల మార్గాన్ని ఎంచుకోవడమే మేలు. తొలుత ఇండెక్స్‌ ఫండ్లతో మీ పెట్టుబడిని ప్రారంభించండి.
దీర్ఘకాలమే మేలు..
షేర్లలో మదుపు చేసినప్పుడు దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. అప్పుడే మంచి లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. 1995లో వచ్చిన ఒక లార్జ్‌ క్యాప్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్‌ ఎన్‌ఏవీ ధర అప్పట్లో రూ.10 ఉండేది. ఇప్పుడు దాని ధర రూ.706 దరిదాపుల్లో ఉంది. ఆ సమయంలో మీరు రూ.లక్ష అందులో మదుపు చేసి ఉంటే.. ఇప్పుడు అది రూ.70.6లక్షలతో సమానం. అయితే, మొదటి పదేళ్లలో దీని వృద్ధి రూ.6.6లక్షలుకాగా తర్వాత పదేళ్లలో రూ.46లక్షలకు చేరింది. గత ఐదేళ్లలోనే ఈ స్థాయి వృద్ధి సాధ్యమయ్యింది. మార్చి 2020లో దీని విలువ రూ.43 లక్షలు కాగా.. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. ఇలా ఒక ఫండ్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు రకరకాల దశల్లో వృద్ధి సాధ్యమవుతుంది. మీరు స్వల్పకాలమే మదుపు చేస్తే.. ఇలాంటి వృద్ధి కనిపించకపోవచ్చు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేమిటంటే.. మార్కెట్‌లో హెచ్చుతగ్గులు సహజం. మనం చేయాల్సిందల్లా.. పెట్టుబడి వృద్ధి చెందేందుకు సమయం ఇవ్వాలి. అప్పుడే చక్రవడ్డీ ప్రభావంతో మీ పెట్టుబడి వృద్ధి చెందుతంది. ఫలితంగా ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి.
నష్టం భరించగలరా?
ఈక్విటీ మార్కెట్లో అనిశ్చితి సర్వసాధారణం. షేర్ల ధరలు ఒకరోజు పెరుగుతాయి. మరోరోజు తగ్గుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. నష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉందా చూసుకోండి. నష్టభయం అధికంగా ఉన్న పథకాల్లోనే అధిక రాబడికీ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. మీరు స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశారనుకుందాం. ఇందులో 30శాతం వరకూ నష్టం వచ్చినా తట్టుకోగలను అని మీరు అనుకున్నారు.. ఇలాగే ఈక్విటీల్లో మదుపు చేసేటప్పుడూ.. నష్టపరిమితిని నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఈ పరిమితి దాటి నష్టాలు వస్తే.. మీ ఆర్థిక లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, www.BankBazaar.com

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని