ప్ర‌యాణ భ‌త్యంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం ఎలా?

ప్ర‌యాణ భ‌త్యం క్లెయిం చేసుకోక‌పోతే ఈ సొమ్ము మొత్తం మీ ఆదాయానికి జ‌త‌చేసి అందుకు త‌గిన ప‌న్ను విధిస్తారు.

Published : 16 Dec 2020 19:41 IST

సంస్థ‌లు, ఉద్యోగ‌లకు అందించే ప్ర‌యోజ‌నాల్లో భాగంగా సెల‌వు ప్ర‌యాణ భ‌త్యం (లీవ్ ట్రావెల్ అల‌వెన్స్‌)ను ఇస్తుంటాయి. ఇది ఉద్యోగి శాల‌రీ ఆదాయం నుంచి ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఒక సుల‌భ మార్గం. లీవ్ ట్రావెల్ అల‌వెన్సు (ఎల్‌టీఏ)ను, లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) అని కూడా అంటారు. దీనిని ప్ర‌తీ సంవ‌త్స‌రం క్లెయిమ్ చేసుకొనేందుకు గానీ, పూర్తి మొత్తంపై క్లెయిమ్ చేసుకొనేందుకు గానీ వీలుండ‌దు. ఎల్‌టీఏ అనేది ఉద్యోగి శాల‌రీ ప్యాకీజీలో ఒక భాగమే, అయిన‌ప్ప‌టికీ ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 10(5) ప్ర‌కారం దీనిని ప‌న్ను ర‌హిత‌ ఆదాయంగా ప‌రిగ‌ణించ‌కూడ‌దు.

ఎల్‌టీఏపై ఎంత మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు?
ఈ ప్ర‌యాణ భ‌త్యం భార‌త‌దేశంలో ప్ర‌యాణించినందుకు మాత్ర‌మే ఇస్తారు. ఉద్యోగి ప్ర‌యాణ భ‌త్యం క్లెయిం చేసిన కాలానికి త‌ప్ప‌నిస‌రిగా సెల‌వులో ఉండాలి. సంస్థ నుంచి ఎల్‌టీఏ రూపంలో ఎంతైతే ఆదాయం వ‌స్తుందో అంత మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు కోర‌వ‌చ్చు. ఎల్‌టీఏకి మించి చేసిన ఖ‌ర్చుకు ప‌న్ను క్లెయిమ్ చేసుకోలేము.

మీరు చేసే ప్ర‌యాణం, వాస్త‌వ వ్య‌యంపై ఎల్‌టీఏ ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ ప్ర‌యాణం చేయ‌క‌పోతే మిన‌హాయింపు రాదు. ప్ర‌యాణం చేసిన‌ట్టుగా టికెట్లు, బోర్డింగ్ పాసులు, బిల్లులు లాంటివి మ‌నం ప‌నిచేసే సంస్థ‌కు స‌మ‌ర్పించాలి. రైల్వే, విమాన‌, ఇత‌ర ప్ర‌జా ర‌వాణా ప్ర‌యాణ ఖ‌ర్చుల‌కు ఎల్‌టీఏ క్లెయిం చేసుకోవ‌చ్చు.

విమాన ప్ర‌యాణంపై: ఎయిర్‌ ఇండియా ప్ర‌యాణంలో ఎకాన‌మీ క్లాస్ వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది.

రైల్వే ప్ర‌యాణంపై: ఏసీ ఫ‌స్ట్ క్లాస్ టికెట్ వ‌ర‌కు రైల్వే ప్ర‌మాణంపై ఎల్‌టీఏ మినహాయింపు వ‌ర్తిస్తుంది.

ఇత‌ర మార్గాల ద్వారా చేసే ప్ర‌యాణాల ఖ‌ర్చులు: రైల్వే ఏసీ ఫ‌స్ట్ క్లాస్ టికెట్ ధ‌ర‌కు స‌మానంగా ఇత‌ర మార్గాల ద్వారా చేసే ప్ర‌యాణ ఖ‌ర్చులకు మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది.

ఎల్‌టీఏ లెక్కించేప్పుడు జీవిత భాగ‌స్వామి, పిల్ల‌లు, ఉద్యోగిపై ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌తో పాటు తోబుట్టువుల ప్ర‌యాణ ఖ‌ర్చుల కూడా అనుమ‌తిస్తారు. అక్టోబ‌ర్ 1, 1998 నుంచి ఈ మిన‌హాయింపు ఉద్యోగి ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఇస్తున్నారు.

ఎల్‌టీఏలో ప‌న్ను మిన‌హాయింపు కోసం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు?

నాలుగు సంవ‌త్స‌రాల‌లో రెండు సార్లు చేసే ప్ర‌యాణాల‌కే ఈ భ‌త్యం వ‌ర్తిస్తుంది. ప్ర‌స్తుతం 2018-2021 సంవ‌త్స‌రాలవి న‌డుస్తున్నాయి. ఒక ప్ర‌యాణ భ‌త్యాన్ని క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకునే వీలుంది. ఉదాహ‌ర‌ణ‌కు 2014-17 మ‌ధ్య‌లో దీన్ని ఉప‌యోగించ‌క‌పోతే 2018 ప్ర‌యాణ భ‌త్యం వాడుకునే వీలుంది. ఈ విధానం ద్వారా నాలుగు సంవ‌త్స‌రాల‌లో గ‌రిష్టంగా మూడు ఎల్‌టీఏ ప‌న్ను మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. అయితే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్ట ప్ర‌కారం క్యారీ ఫార్వ‌ర్డ్‌ను, మీరు మొద‌టి సంవ‌త్స‌రంలో క్లెయిమ్ చేస్తేనే అనుమ‌తిస్తారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌మ త‌మ సంస్థ‌లు అందించే ఎల్‌టీఏల‌ను క్లెయిం చేసుకోవ‌చ్చు. అయితే ఇద్ద‌రూ ఒకే ప్ర‌యాణానికి క్లెయిం చేసుకునే వీలులేదు.

(Source: Livemint)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని