ChatGPT: చాట్‌జీపీటీపై నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్న ఓ సీఈఓ!

ChatGPT: తమ ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడం కోసం జెనీస్‌ సీఈఓ ఆకాశ్‌ నిగమ్‌ చాట్‌జీపీటీని వినియోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ఏఐ చాట్‌బాట్‌పై అవగాహన పెంచుకోవాలని ఉద్యోగులను సూచించారు. వారందరి కోసం చాట్‌జీపీటీ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకున్నారు

Published : 04 May 2023 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT) తెరపైకి వచ్చిన తర్వాత కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)పై ప్రపంచ వ్యాప్తంగా తెగ చర్చ జరుగుతోంది. ఓపెన్‌ఏఐ అనే సంస్థ సృష్టించిన ఈ చాట్‌జీపీటీ (ChatGPT) యూజర్లు అడిగే అన్ని ప్రశ్నలకు ఇట్టే సమాధానం ఇస్తోంది. వ్యాసాలు, ప్రసంగాలు రాయడం, క్లిష్టమైన గణిత సమీకరణాలకు జవాబులు చెప్పడం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు కఠినమైన కోడ్‌లు రాసిపెట్టడం.. ఇలా అన్నింటినీ చకచకా చేసేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో కొన్ని ఉద్యోగాల స్థానంలో ఏఐని వినియోగిస్తారనే వాదన బలపడుతోంది. ఈ క్రమంలో ఓ అంకుర సంస్థ సీఈఓ చాట్‌జీపీటీ కోసం నెలకు రూ.రెండు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.

చాట్‌జీపీటీ (ChatGPT)ని తమ కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచడం కోసం వినియోగించుకోవాలని అంకుర సంస్థ జెనీస్‌ సీఈఓ ఆకాశ్‌ నిగమ్‌ నిర్ణయించారు. తమ సంస్థలోని ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్స్‌, ఫైనాన్స్‌, డిజైన్‌, ఆర్‌అండ్‌డీ, అకౌంటింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో చాట్‌జీపీటీని ఉపయోగించే విధానాన్ని తెలుసుకోవాలని ఉద్యోగులను సూచించారు. ఈ కంపెనీలో మొత్తం 120 మంది పనిచేస్తున్నారు. వారందరి కోసం చాట్‌జీపీటీ (ChatGPT) ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొని దాని ఖర్చును కంపెనీయే భరిస్తోంది. అందుకోసం నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తోంది.

నిగమ్‌ సూచన మేరకు ఉద్యోగులు సైతం చాట్‌జీపీటీ (ChatGPT)ని తమ ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం కోసం సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు ఆర్‌అండ్‌డీ విభాగం.. గణిత, కోడింగ్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకుంటుంది. అలాగే లీగల్‌ డాక్యుమెంట్లు రాయడం, కార్పొరేట్‌ రెగ్యులేషన్లను రూపొందించడం, ప్రజెంటేషన్లు తయారు చేయడం వంటి పనులను సైతం చాట్‌జీపీటీ (ChatGPT) ద్వారానే చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ క్రమంలో దీన్ని వినియోగించడంలో కొంత అనుభవం గడించిన సీనియర్లు.. కింది స్థాయి ఉద్యోగులకు తర్ఫీదునిస్తున్నారు.

ఓవైపు పనిప్రదేశంలో ఏఐ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు దీన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలో కొన్ని కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జరిపిన అధ్యయనంలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. చాట్‌జీపీటీ (ChatGPT)ని వినియోగించడం వల్ల పనిప్రదేశంలో ఉత్పాదకత దాదాపు 14 శాతం పెరిగినట్లు గుర్తించింది. అలాగే తక్కువ అనుభవం, నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు పనిని 35 శాతం వేగంగా పూర్తి చేసినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని