దంప‌తులు ఇద్ద‌రూ సంపాదించేవారైతే మ‌దుపు ఎలా ఉండాలి?

ఈ సృష్టిలో అధిక భాగం సుఖ‌సంతోషాలు, స్థిర‌త్వం, భ‌ర‌సాతో కూడిన జీవితాలు డ‌బ్బుతో ముడిప‌డి ఉన్నాయి.

Published : 04 Apr 2022 12:32 IST

సంపాద‌న మొద‌లైన త‌ర్వాత ఖ‌ర్చు పెట్ట‌డానికే సంపాద‌న అని కాకుండా పొదుపు, పెట్టుబ‌డులు కూడా చాలా ముఖ్య‌మైన‌వే. పెట్టుబ‌డులు అనేవి దీర్ఘ‌కాలానికి కొన‌సాగాలి. ఎవ‌రినైనా భ‌విష్య‌త్తులో ఆర్ధికంగా ఆదుకునేవి, అనేక ఇబ్బందుల‌ను గట్టెక్కించేవి వారు చేసే పొదుపులే. కుటుంబంలో ఒక్క‌రి సంపాద‌నే అయితే ఆదా త‌క్కువే ఉండ‌వ‌చ్చు. కానీ, భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ సంపాద‌న‌ప‌రులైతే డ‌బ్బు ఆదా చేయ‌డం చాలా వ‌ర‌కు సాధ్య‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆర్ధిక ప‌రిస్థితిని మెరుగుప‌ర‌చ‌డానికి, డ‌బ్బు ఆదా చేయ‌డం, స‌రియైన చోట పెట్టుబ‌డి పెట్ట‌డం కూడా ముఖ్యం.

ప్ర‌జ‌ల జీవితంలో డ‌బ్బు ముఖ్య‌మైన పాత్ర పోషిస్తుంది. అది బ్ర‌హ్మ‌చారి అయినా లేదా వివాహిత జంట అయినా, సంపాద‌న లేకుండా ఎవ‌రూ మంచి జీవితాన్ని గ‌డ‌ప‌లేరు. పెళ్ల‌యిన దంప‌తులకు చిన్న‌పాటి వాద‌న‌లు వ‌స్తే త్వ‌ర‌గా ముగిసిపోతాయి. కానీ, ఆర్ధిక ప‌ర‌మైన స‌మ‌స్య‌లున్న‌ వారికి వాద‌న‌లు వ‌స్తే వివాహ జీవితంపై పెను ప్ర‌భావం ప‌డుతుంది. వారు ఆర్ధికంగా స్థిరంగా ఉంటే వారి వ్య‌క్తిగ‌త జీవితాలు కూడా స్థిరంగా ఉండే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ సృష్టిలో అధిక భాగం సుఖ‌సంతోషాలు, స్థిర‌త్వం, భ‌ర‌సాతో కూడిన జీవితాలు డ‌బ్బుతో ముడిప‌డి ఉన్నాయి. కాబట్టి, సంపాదించేట‌ప్పుడే డ‌బ్బు ఆదాను తీవ్రంగానే ప‌రిగ‌ణించాలి. దీంతో భ‌విష్య‌త్తులో ఆర్ధిక సంబంధ‌మైన‌ సుఖ‌సంతోషాలు చేయిదాటిపోవు.

ఈ క్రింది పొదుపు సూత్రాల‌ను పాటిస్తే మంచిది:

1. ఆర్ధిక ప్ర‌ణాళిక ప్రారంభించే ముందు భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆర్ధిక స‌వాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుందో అంచ‌నాకు రావాలి. స‌మాజంలో వివిధ వ‌య‌స్సు, వ‌ర్గాల జీవ‌న ప్ర‌మాణాల‌ను, వ్య‌యాల‌ను గ‌మ‌నించాలి. వారు ఎదుర్కొనే ఆటుపోట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. పెట్టుబ‌డి ప్రారంభించ‌డానికి ఆర్ధిక ల‌క్ష్యాల‌కు ప్ర‌ణాళిక చాలా ముఖ్యం.

2. దంప‌తులు ఇద్ద‌రూ సంపాద‌న‌ప‌రులైతే మొద‌ట పెట్టుబ‌డులు పెట్టండి, ఆపై ఖ‌ర్చు చేయండి. ప్ర‌ముఖ అమెరిక‌న్ పెట్టుబ‌డిదారుడు 'వారెన్ బ‌ఫెట్‌' ముందు పొదుపు చేసి, మిగిలింది ఖ‌ర్చు పెట్ట‌మ‌ని చెప్పారు. ఇదే సూత్రాన్ని సంపాదించే దంప‌తులు పాటించాలి. 

3. ఒక జంట క‌లిసి కూర్చుని వారి జీవితంలోని అన్ని ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌ల‌ను గుర్తించ‌వ‌చ్చు. త‌ద‌నుగుణంగా ప్ర‌తిదానికి బ‌డ్జెట్‌ను కేటాయించ‌వ‌చ్చు.

4. కుటుంబంలోని అంద‌రి వ్య‌క్తుల‌కు ఆరోగ్య బీమా చేయించండి. ప‌నిచేసే వ్య‌క్తుల‌కు త‌గినంత ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీని తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

5. పెట్టుబ‌డుల విష‌యానికొస్తే ఈక్విటీలలో స‌రైన డైవ‌ర్సిఫికేష‌న్ ఎంపిక‌తో పెట్టుబ‌డి పెట్ట‌డం స్థిర‌మైన రాబ‌డిని ఇస్తుంది. డైవ‌ర్సిఫికేష‌న్ కోసం, దంప‌తులు ఈక్విటీ ఆధారిత మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు. సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా క్ర‌మం త‌ప్ప‌కుండా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 

6. ఉద్యోగ విర‌మ‌ణ అనంత‌రం ఆర్ధిక అవ‌స‌రాలు తీర్చుకోవ‌డానికి పెన్ష‌న్ అనేది ఎవ‌రికైనా అవ‌స‌ర‌మే. దీనికి 'ఎన్‌పీఎస్' (నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌)లో పెట్టుబ‌డి మంచి పధకం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 'ఎన్‌పీఎస్'  అనేది దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ఎంపిక‌గా ఉద్దేశించ‌బ‌డింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన, దీర్ఘ‌కాలంలో ఉప‌యోగ‌ప‌డే పొదుపు ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని మీకు అనిపిస్తే 'ఎన్‌పీఎస్‌' స‌రైన పెన్ష‌న్ ప‌థ‌కం అని చెప్ప‌వ‌చ్చు. ఇది పెట్టుబ‌డిదారుడి ప‌ద‌వీ విర‌మ‌ణపై దృష్టి పెడుతుంది. ప్ర‌స్తుతం 'పీఎఫ్ఆర్‌డీఏ' అందించే ఈ పెన్ష‌న్ ప‌థ‌కం 18-75 ఏళ్ల మ‌ధ్య ఉన్న భార‌తీయ పౌరులంద‌రికీ అందుబాటులో ఉంటుంది.

7. ప‌నిచేసే చోట 'పీఎఫ్‌' 12% వాటా ఉంటుంది. మీ ఆర్ధిక సౌల‌భ్యాన్ని బట్టి 12% దాటికూడా 'వీపీఎఫ్‌'గా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. బ్యాంకు, పోస్టాఫీసుల‌క‌న్నా దీనికి వ‌డ్డీ ఎక్కువ‌. దీర్ఘ‌కాల పొదుపైన 'పీపీఎఫ్‌'లో కూడా పొదుపు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ‌పు ప‌న్ను కూడా లేదు.

8. సంపాద‌న‌ప‌రులైన దంప‌తులు గృహ రుణాన్ని జాయింట్‌గా తీసుకోవ‌చ్చు. దీనివ‌ల్ల రుణ అర్హత పెరగడమే కాకుండా 'ఈఎంఐ' చెల్లించ‌డానికి కూడా సులభంగా ఉంటుంది.

పెట్టుబ‌డుల‌కు త‌గినంత అనుభ‌వం లేకున్నా, అనుమానాలున్నా.. ఆర్ధిక స‌ల‌హాదారుల‌ను సంప్ర‌దించి త‌గిన విధంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు. మ‌రిన్ని పెట్టుబ‌డులకు మీ వ‌య‌స్సు, ఆదాయాన్ని బ‌ట్టి ఆర్ధిక స‌ల‌హ‌దారులు త‌గిన స‌ల‌హాలు ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని