Updated : 29 Apr 2022 16:30 IST

పీపీఎఫ్, ఎన్పీఎస్, ఫిక్స్‌డ్ డిపాజిట్ పన్ను ఆదా పథకాలలో ఏది ఎంచుకోవాలి?

జీవితంలో ఆర్ధిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు సరైన ప్రణాళిక రూపొందించుకోకపోతే, ఆలస్యం చేయకుండా వెంటనే మొదలు పెట్టడం మంచిది. ఇది మీకు ఆర్ధిక క్రమశిక్షణను అలవరచడంతో పాటు కష్టపడి సంపాదించిన డబ్బును వృద్ధి చేయడానికి సహాయం చేస్తుంది. ఒకవేళ మీరు పన్ను మినహాయింపు లభించే పథకాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే, మరింత డబ్బును సమకూర్చుకోగలరు.  

సాధారణంగా చాలా మంది సరైన పన్ను ప్రణాళిక లేదా పెట్టుబడి ఎంపికను ఎంచుకోవడంలో ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సరైన ప‌న్ను మిన‌హాయింపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నప్పటికీ, కేవలం కొంతమంది మాత్రమే అందులో సఫలమవుతున్నారు. దానికి కారణం వారికి సరైన సమాచారం, పరిజ్ఞానం లేకపోవడం.

పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉన్న కొన్ని ప్రముఖ పెట్టుబడి పథకాల గురించి కింద తెలియచేశాము : 
 
ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్):

పీపీఎఫ్ అనేది పన్ను ఆదా లభించే ప్రముఖ పెట్టుబడి పథకం. పీపీఎఫ్ ఖాతా గ‌డువు 15 సంవ‌త్స‌రాలు. అయితే, త‌ర్వాత కూడా దీనిని కొన‌సాగించే అవ‌కాశం ఉంది. పీపీఎఫ్ ఖాతాదారుడు సంవ‌త్స‌రానికి రూ. 500 నుంచి గ‌రిష్ఠంగా రూ.1,50,000 వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టొచ్చు. గ‌రిష్ఠంగా సంవత్స‌రానికి 12 సార్లు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. పీపీఎఫ్‌ చందాదారుల‌కు ఆదాయపన్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొంద‌వ‌చ్చు.  

జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్):

చందాదారులు తమ ఆదాయం నుంచి కొంత మొతాన్ని ప్రతి నెలా దీర్ఘ కాలం పాటు పెట్టుబడిగా పెట్టి, పదవీ విరమణ తరువాత నెల నెలా కొంత మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందాలనే ఉద్దేశంతో భార‌త ప్ర‌భుత్వం నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌ను (ఎన్పీఎస్) ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక భ‌ద్ర‌త‌కు, మార్కెట్ ఆధారిత రాబ‌డుల‌ను ఎన్‌పీఎస్‌ అందించ‌గ‌ల‌దు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ) ఈ ప‌థ‌కాన్ని నియంత్రిస్తుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అందుబాటులో ఉంది. పెట్టుబడిదారుడికి 60 ఏళ్లు వచ్చే వరకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.సెక్షన్ 80 CCD ప్రకారం, ఒక వ్యక్తి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. అదనంగా మరో రూ. 50 వేల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

జాతీయ పొదుపు పత్రాలు (ఎన్ఎస్సీ) :

పోస్ట్ ఆఫీస్ ల నుంచి జాతీయ పొదుపు పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఇది ఐదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ తో అందుబాటులో ఉంటుంది. దీనిని కేవలం మెచ్యూరిటీ పూర్తైన తరువాత మాత్రమే చెల్లిస్తారు. ఈ పథకం కింద కనిష్టంగా రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. ఆదాయ పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద డిపాజిటర్లు రూ. 1.50 లక్షల వరకు పన్ను రాయితీని పొందవచ్చు.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్:

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును అందిస్తుంది. కొంత మేర రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే వారు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ పెట్టుబడిని పెద్ద మొత్తంలో వృద్ధి చేయడంతో పాటు, పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. 

పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్:

పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్‌లలో ఒకటి.  ఇది చాలా సురక్షితమైన పెట్టుబడి. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. దీనికి కనీసం 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.

ఆరోగ్య బీమా ప్రీమియం:

ఆరోగ్య బీమా ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 25,000 వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆరోగ్య బీమా పాలసీ కోసం మీరు చెల్లించే ప్రీమియంపై ఆదాయ పన్ను సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 

ఎవరికి ఇది మేలు?

పన్ను ఆదా పధకాలు అనేకం. ఇందులో ఎవరు ఇది ఎంచుకోవాలో తెలుసుకుందాం. పీపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఎన్ఎస్సీ లాంటి పథకాలలో వడ్డీ రేటు 6-7% వరకు ఉన్నప్పటికీ, ఇందులో పెట్టుబడి మొత్తం పూర్తి సురక్షితమనే చెప్పాలి. అయితే, ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం లో సహకరించకపోవచ్చు. ఎన్పీఎస్ లాంటి పధకాలు దీర్ఘకాలం లో పదవీ విరమణ నిధి తో పాటు పెన్షన్ పొందడానికి మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ లో అధిక రిస్క్ ఉంటుంది, కాబట్టి నష్టాలు కూడా భరించగలిగే వారే ఇందులో పెట్టుబడి పెట్టడం మంచిది. ఆరోగ్య బీమా ని పన్ను మినహాయింపు కోసం మాత్రమే ఎంచుకోవడం సరైనది కాదు. మీ బీమా అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవాలి. 

 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని